మే 11న సుందరగిరిపై నృసింహ జయంతి వేడుకలు
ద్వారకాతిరుమల: శ్రీవారి ఆలయానికి దత్తత దేవాలయమైన ఐఎస్ జగన్నాధపురంలోని సుందరగిరిపై కొలువైన శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారి జయంతి (ఆవిర్భావ)వేడుకలు మే 11న వైభవంగా జరుగనున్నాయి. ఆరోజు స్వాతి నక్షత్రం, చతుర్దశి తిథి పర్వదినాన్ని పురస్కరించుకుని ఉదయం 7.30 గంటలకు స్వామి, అమ్మవార్లకు అర్చకులు, పండితులు విశేష ద్రవ్యాలతో అష్టోత్తర శతకలశ అభిషేకం నిర్వహిస్తారు. ఆ తరువాత సుదర్శన నృసింహ ధన్వంతరి గరుడ ఆంజనేయ అనంత మూలమంత్ర హోమాలు, విశేష నివేదనలు, పంచ హారతులు, నీరాజన మంత్రపుష్పాలు, ప్రసాద వినియోగం, అన్నప్రసాద వితరణ కార్యక్రమాలు దేవస్థానం ఆధ్వర్యంలో జరుగుతాయని నృసింహ ఉపాసకులు కొచ్చర్లకోట సత్యవెంకట లక్ష్మి నరసింహ గురూజీ తెలిపారు. మధ్యాహ్నం అన్నసమారాధన జరుగుతుందన్నారు. రూ.1,116 చెల్లించి ఈ పూజా కార్యక్రమాల్లో పాల్గొనే దంపతులకు స్వామివారి శేష వస్త్రంతో పాటు, ప్రసాదాలను అందిస్తారని చెప్పారు. వివరాలకు 99085 63958, 99122 81886 నంబర్లలో సంప్రదించాలన్నారు.
మద్ది క్షేత్రానికి పోటెత్తిన భక్తులు
జంగారెడ్డిగూడెం: గురవాయిగూడెం మద్ది ఆంజనేయస్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. మంగళవారం స్వామివారికి ప్రీతికరమైన రోజు కావడంతో భక్తులు అధిక సంఖ్యలో బారులు దీరి స్వామివారిని దర్శించుకున్నారు. భక్తులు స్వామి ఆలయం చుట్టూ 108 ప్రదక్షిణలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. ద్వారకాతిరుమల మండలం గొల్లగూడెంనకు చెందిన శ్రీ విజయదుర్గ భజన సమాజం వారిచే హనుమాన్ చాలీసా పారాయణం నిర్వహించారు. మధ్యాహ్నం వరకు దేవస్థానానికి వివిధ సేవలు, విరాళాల ద్వారా రూ.1,43,328 సమకూరినట్లు ఈవో ఆర్‌వీ చందన తెలిపారు. 1200 మంది భక్తులకు నిత్యాన్నదాన సత్రం నందు అన్నప్రసాద వితరణ చేశారు. దేవస్థాన పర్యవేక్షకులు జవ్వాది కృష్ణ, కురగంటి రంగారావు ఏర్పాట్లు చేశారు.
మే 11న సుందరగిరిపై నృసింహ జయంతి వేడుకలు


