
ప్రభుత్వంపై పోరు సాగించండి
నరసాపురం రూరల్: కూటమి ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను ఎప్పటికప్పుడు నిలదీస్తూ ప్రజలకు అండగా నిలవాలని వైఎస్సార్ సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సూచించినట్టు ఆ పార్టీ ఎంబీసీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు పెండ్ర వీరన్న తెలిపారు. గురువారం తాడేపల్లిలోని పార్టీ కార్యాలయంలో జగన్‌మోహన్‌రెడ్డిని తాను కలిసిన సందర్భంలో పై విధంగా సూచించారన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది గడవక ముందే ప్రజల్లో విశ్వాసాన్ని కోల్పోయిందని, ఎన్నికల సమయంలో చంద్రబాబు, పవన్‌కల్యాణ్ వంటి నేతలు ఇచ్చిన హామీల అమలు కోసం గట్టిగా డిమాండ్ చేయాలని జగన్ ఆదేశించారన్నారు. ప్రజలకు మంచి చేసే విషయంలో రాజీ లేని పోరాటం సాగించాలని సూచించారని, ప్రభుత్వం పెట్టే కేసులకు భయపడవద్దని అభయమిచ్చారన్నారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో చేసిన మంచిని రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఈబీసీ వర్గాలు ఇప్పుడు గుర్తు చేసుకుంటున్నాయన్నారు. త్వరలోనే మంచి రోజులు వస్తాయని, అధైర్య పడవద్దని, కార్యకర్తలు నాయకులు ఐక్యంగా ఉంటూ ప్రభుత్వంపై పోరు సాగించాలని పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి సూచించినట్టు వీరన్న తెలిపారు.