
నేత్రపర్వంగా వార్షికోత్సవం
ద్వారకాతిరుమల: శ్రీవారి ఆలయానికి ఉపాలయమై, క్షేత్రదేవతగా విరాజిల్లుతోన్న శ్రీ కుంకుళ్లమ్మ అమ్మవారి ఆలయంలో వార్షికోత్సవ వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. శనివారం ఉదయం 9 గంటల నుంచి గణపతి పూజ, సర్వతోభద్ర మండలి ఆరాధన, మూలమంత్ర అనుష్టానం అనంతరం హోమాలను ఆలయ అర్చకులు, పండితులు వేద మంత్రోచ్ఛరణల నడుమ అట్టహాసంగా నిర్వహించారు. ఆదివారం ఆలయంలో జరగనున్న పూర్ణాహుతితో ఈ వార్షికోత్సవ వేడుకలు ముగుస్తాయని ఆలయ ఈఓ వేండ్ర త్రినాధరావు తెలిపారు.
బీఎస్‌ఎన్‌ఎల్ భూముల విక్రయానికి ఆన్‌లైన్ బిడ్డింగ్
పాలకొల్లు సెంట్రల్ : బీఎస్‌ఎన్‌ఎల్‌లో ఉపయోగంలో లేని భూములను విక్రయిస్తున్నట్లు బీఎస్‌ఎన్‌ఎల్ జీఎం ఎల్.శ్రీను తెలిపారు. శనివారం పట్టణంలోని బీఎస్‌ఎన్‌ఎల్ ఆఫీసులో మాట్లాడుతూ పట్టణంలోని విజయ ఆర్ధోపెడిక్ ఆసుపత్రి పక్కన ఉన్న 1.03 ఎకరాలు భూమిని విక్రయిస్తున్నట్లు తెలిపారు. ఈ భూమి కొనుగోలుకు జూన్ 13 నుంచి ఆన్‌లైన్ బిడ్స్ ప్రారంభించామన్నారు. పూర్తి వివరాలకు 94235 65008, 94901 22622 నెంబర్లలో బీఎస్‌ఎన్‌ఎల్ సిబ్బందిని సంప్రదించాలని ఆయన సూచించారు.
హ్యాండ్‌లూమ్ టెక్నాలజీలో డిప్లమో కోర్సుకు ఆహ్వానం
ఏలూరు (టూటౌన్): ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన అభ్యర్థులకు వెంకటగిరిలోని శ్రీ ప్రగడ కోటయ్య మెమోరియల్ ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్‌లూమ్ టెక్నాలజీలో డిప్లమో కోర్సు కోసం ఈ నెల 20న స్పాట్ అడ్మిషన్లు నిర్వహిస్తున్నామని జిల్లా హ్యాండ్‌లూమ్, టెక్స్‌టైల్స్ అధికారి రఘనందన్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇతర వివరాలకు కాలేజ్ వెబ్‌సైట్ లేదా 94417 95408, 98661 69908, 90102 43054 నెంబర్లలో సంప్రదించాలని కోరారు. ఆసక్తి గల విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.