కౌంటింగ్‌ నిర్వహణ ఏర్పాట్లు భేష్‌ | Sakshi
Sakshi News home page

కౌంటింగ్‌ నిర్వహణ ఏర్పాట్లు భేష్‌

Published Fri, May 31 2024 1:18 AM

కౌంటింగ్‌ నిర్వహణ ఏర్పాట్లు భేష్‌

భీమవరం: జిల్లాలో ఎన్నికల కౌంటింగ్‌ కేంద్రాల్లో చేసిన ఏర్పాట్లు సంతృప్తికరంగా ఉన్నాయని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్‌ కుమార్‌ మీనా అన్నారు. భీమవరంలోని ఎస్‌ఆర్‌కేఆర్‌, విష్ణు ఇంజినీరింగ్‌ కళాశాలల్లో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్‌ రూమ్స్‌, కౌంటింగ్‌ కేంద్రాలను గురువారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌ ఓట్ల లెక్కింపునకు సంబంధించి చేపట్టిన చర్యలను రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారికి వివరించారు. సుమారు 1,000 మంది కౌంటింగ్‌ సూపర్‌వైజర్లు, కౌంటింగ్‌ అసిస్టెంట్లు, మైక్రో అబ్జర్వర్లతో పాటు దాదాపు 400 మంది ఇతర సిబ్బంది కౌంటింగ్‌ విధుల్లో పాల్గొననున్నట్లు తెలిపారు. కౌంటింగ్‌ కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నామని, సూక్ష్మ పరిశీలన, సీసీ కెమెరాల నిఘా మధ్య కౌంటింగ్‌ ప్రక్రియను నిర్వహించనున్నట్లు వివరించారు. బ్యారికేడింగ్‌, సూచిక బోర్డులు ఏర్పాటు, వాహనాల పార్కింగ్‌, మీడియా కేంద్రం ఏర్పాటు, రౌండ్ల వారీగా ఫలితాల వెల్లడి ప్రణాళిక, అభ్యర్థులు, కౌంటింగ్‌ ఏజెంట్లకు అవసరమైన ఏర్పాట్లు, మార్గదర్శకాల మేరకు కౌంటింగ్‌ టేబుళ్ల ఏర్పాటు తదితర అంశాలను వివరించారు. పోస్టల్‌ బ్యాలెట్‌, ఈవీఎంల్లోని ఓట్లను లెక్కించే ప్రక్రియలో భాగస్వాములుకానున్న కౌంటింగ్‌ సూపర్‌ వైజర్లు, కౌంటింగ్‌ అసిస్టెంట్లు, మైక్రో అబ్జర్వర్లు తదితరులకు శిక్షణ ఇస్తున్నట్లు కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌ వివరించారు. ఎస్పీ వేజెండ్ల అజిత మాట్లాడుతూ 500 మంది పోలీస్‌ సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు, కౌంటింగ్‌ కేంద్రాల పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్‌ మళ్లింపు ఏర్పాట్లు, సమస్యాత్మక ప్రాంతాల్లో తీసుకున్న చర్యలు, కట్టుదిట్టమైన భద్రత, బందోబస్తుకు చేసిన ఏర్పాట్లను ముఖేష్‌కుమార్‌ మీనాకు వివరించారు. అనంతరం ముఖేష్‌ కుమార్‌ మీనా మాట్లాడుతూ అధికారులు, సిబ్బంది సమష్టి కృషితో జిల్లాలో పోలింగ్‌ ప్రక్రియ మాదిరిగానే కీలకమైన కౌంటింగ్‌ను విజయవంతంగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఎన్నికల కమిషన్‌ జారీ చేసిన గుర్తింపు కార్డులు కలిగిన వారిని మాత్రమే కౌంటింగ్‌ కేంద్రాలకు అనుమతించాలని ఆదేశించారు. ఎక్కడ ఏలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పలు సూచనలు చేశారు. జాయింట్‌ కలెక్టర్‌ సీవీ ప్రవీణ్‌ ఆదిత్య, డీఆర్వో జె.ఉదయ భాస్కరరావు, ఏఎస్పీ వి.భీమారావు, ఎస్‌ఈబీ అదనపు ఎస్పీ ఏటీవీ రవికుమార్‌, ఆర్వోలు కె.శ్రీనివాసులురాజు, కె చెన్నయ్య, వి.స్వామినాయుడు, బి.శివన్నారాయణరెడ్డి, ఎం.అచ్యుత అంబరీష్‌, బి.వెంకటరమణ పాల్గొన్నారు.

రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్‌ కుమార్‌ మీనా

భీమవరంలో స్ట్రాంగ్‌ రూమ్స్‌, కౌంటింగ్‌ కేంద్రాల పరిశీలన

Advertisement
 
Advertisement
 
Advertisement