25 మంది వలస కార్మికులకు విముక్తి | - | Sakshi
Sakshi News home page

25 మంది వలస కార్మికులకు విముక్తి

Nov 27 2026 1:02 AM | Updated on Nov 27 2026 1:02 AM

● ఆర్డీఓ ఎదుట హాజరుపర్చిన అధికారులు

కమలాపూర్‌: జీవనోపాధి కోసం వలస వచ్చి నిర్బంధంలో మగ్గిపోతున్న 25 మంది వలస కార్మికులకు అధికారులు విముక్తి కల్పించారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు, కావలి నుంచి సుమారు 14 ఏళ్ల క్రితం కొన్ని కుటుంబాలు కమలాపూర్‌లోని శివ సిమెంట్‌ బ్రిక్స్‌ తయారీ కేంద్రంలో పని చేయడానికి వలస వచ్చారు. ఆసమయంలో బ్రిక్స్‌ తయారీ పరిశ్రమ నిర్వాహకుడు వలస కార్మిక కుటుంబాలకు రూ.80 వేలు అడ్వాన్సుగా చెల్లించాడు. ఆతర్వాత ఆ మొత్తాన్ని అప్పుగా చూపించి భార్యభర్తలు ఇద్దరికి కలిపి వారానికి రూ.600 చొప్పున చెల్లిస్తూ శ్రమ దోపిడీకి పాల్పడుతున్నాడు. వలస కార్మికుల కుటుంబాల్లో ఎవరైనా చనిపోతే ఆ కుటుంబం నుంచి భార్యనో, భర్తనో ఎవరినో ఒకరిని మాత్రమే పంపిస్తున్నాడు, అది కూడా ఏడాదిలో ఒకసారి మాత్రమే. వారిపై దాడులకు పాల్పడుతూ.. అనేక రకాలుగా చిత్రహింసలకు గురి చేస్తున్నాడు. మైనర్లతోనూ పనులు చేయిస్తూ ఆర్థిక, శ్రమ దోపిడీకి పాల్పడుతున్నాడు. వలస కార్మికులు వారి నిర్భందంలో మగ్గిపోతూ అనేక అవస్థలు పడుతున్నట్లు స్వచ్ఛంద సంస్థలు, లేబర్‌ కమిషన్‌ ద్వారా ఫిర్యాదు అందింది. ఈమేరకు స్థానిక జీపీఓ శిరీషరెడ్డి ఐసీడీఎస్‌ సూపర్‌వైజర్‌ రేణుక, సునీతతో కలిసి వెళ్లి శివ బ్రిక్స్‌ తయారీ కేంద్రాన్ని పరిశీలించారు. పూర్తి విచారణ అనంతరం వలస కార్మికులకు నిర్వాహకుల నిర్బంధం నుంచి విముక్తి కల్పించారు. తహసీల్దార్‌ కార్యాలయానికి తరలించారు. అనంతరం ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు సుమారు 25 మందిని హనుమకొండలోని ఆర్డీఓ కార్యాలయానికి తరలించి ఆర్డీఓ వెంకటేశ్‌ ఎదుట హాజరు పర్చినట్లు జీపీఓ శిరీషరెడ్డి తెలిపారు. కార్యక్రమంలో తహసీల్దార్‌ సురేష్‌, అధికారులు, పోలీసులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement