హనుమకొండలోని ఓ ప్రాంతంలో 650 గజాల స్థలంలో ఓ అపార్ట్‌మెంట్ నిర్మాణానికి ఓ వ్యక్తి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్నాడు. అన్ని పత్రాలను జత చేశాడు. క్షేత్రస్థాయి తనిఖీకి వచ్చిన అధికారులు మాస్టర్ ప్లాన్ రోడ్డు విస్తరణ, ఆటో క్యాడ్ డ్రాయింగ్‌లో సాంకేతిక లోపాలున్నాయంటూ ఫైల్‌ను కొన్ని రోజులు పెండింగ్‌లో పెట్టారు. చివరకు ఓ మధ్యవర్తి ద్వారా బేరసారాలు జరపగా, చదరపు అడుగుకు ఇంత చొప్పున లెక్కకట్టి రూ.లక్షల్లో ముడుపులు ముట్టజెప్పారు. ఆ తర్వాతే ప్రొసీడింగ్స్ జారీ అయ్యాయి.
రిటైర్‌మెంట్ తర్వాత వచ్చిన డబ్బుతో 200 గజాల స్థలంలో జీ+1 ఇంటి నిర్మాణం కోసం మరో వ్యక్తి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్నాడు. అన్ని పత్రాలు సక్రమంగా ఉన్నప్పటికీ, క్షేత్రస్థాయి పరిశీలనకు వచ్చిన టౌన్ ప్లానింగ్ సిబ్బంది ప్లాన్ లో చిన్నపాటి సాంకేతిక లోపాలున్నాయంటూ ఫైల్‌ను పెండింగ్‌లో పెట్టారు. రెండు వారాలు కార్యాలయం చుట్టూ తిరిగినా ఫలితం లేకుండాపోయింది. చివరకు ఒక మధ్యవర్తి ద్వారా సంప్రదించగా, సెట్‌బ్యాక్ కొలతల్లో సర్దుబాటు చేస్తామని చెబుతూ రూ.35 వేలు డిమాండ్ చేశారు. అడిగిన మొత్తం ముట్టజెప్పిన రెండు రోజుల్లోనే బిల్డింగ్ పర్మిషన్ జారీ అయ్యింది.
సాక్షి, వరంగల్:
గ్రేటర్ వరంగల్ పరిధిలో భవన నిర్మాణ అనుమతుల్లో కొందరు సిబ్బంది పక్కా ‘ప్లానింగ్’తో ముందుకెళ్తున్నారన్న ఆరోపణలు న్నాయి. పెరుగుతున్న నిర్మాణాలే వీరికి మంచి ఆదాయ వనరుగా మారాయనే విమర్శలు వస్తున్నాయి. 605 గజాల్లోపు ఇన్‌స్టంట్ అప్రూవల్ ఇంటి నిర్మాణ అనుమతుల్లో ముందుగానే మొత్తం ఫీజు దరఖాస్తుదారులు చెల్లించడాన్ని వీరు ఆసరాగా చేసుకొని కొందరు ప్లానింగ్ సిబ్బంది ఫైల్ ప్రాసెస్ విషయంలో కాలయాపన చేస్తూ టచ్‌లోకి వచ్చాకే ముందుకెళ్తుండడం వీరికి చేసుకుంటున్నారు. భవన నిర్మాణదారులు అప్పటికే రూ.లక్షల్లో ఫీజులు కట్టి ఉండడంతో, ఇక తిరకాసులు తమ వల్ల కాదని.. రూ.5 వేల నుంచి రూ.50 వేల వరకు సమర్పించుకుంటున్నట్లు విమర్శలున్నాయి. 605 గజాలు, ఆపైన ఉన్న సింగిల్ విండో ఫైల్స్ ముఖ్యంగా అపార్ట్‌మెంట్లు ఉండడంతో విస్తీర్ణం, అంతస్తులను బట్టి రూ.1.5 లక్షల నుంచి రూ.3 లక్షల వరకు వసూళ్లు చేస్తుండడం చర్చకు దారితీస్తోంది.
నిర్మాణాల జోరు...అక్రమార్జన హోరు
గ్రేటర్ వరంగల్ నగరంలో నిర్మాణ అనుమతుల కోసం దరఖాస్తు చేసుకుంటే ఫైల్ పరిశీలన, క్షేత్రస్థాయి తనిఖీలు, నిబంధనల పరిశీలన, అనుమతి జారీ వరకు వివిధ దశల్లో ప్లానింగ్ సిబ్బంది పాత్ర కీలకం. ఈక్రమంలో కొందరు సిబ్బంది అందినకాడికి దండుకుంటున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వీరిపై ఉన్నతాధికారులు దృష్టి సారించాలని నగరపౌరులు కోరుతున్నారు. అదేవిధంగా జీడబ్ల్యూఎంసీ ప్లానింగ్ విభాగంలో అనుమతుల జారీ ప్రక్రియ, ఫైళ్ల పెండింగ్, క్షేత్రస్థాయి తనిఖీలపై సమగ్ర విచారణ జరపాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఈవిభాగంలోని కొందరు సిబ్బంది ఆదాయ వనరులపై ఏసీబీ అధికారులు దృష్టి సారిస్తే అక్రమాల వసూళ్ల తంతు వెలుగులోకి వచ్చే అవకాశముందని నగరవాసులు కోరుతున్నారు.
బల్దియాలో బిల్డింగ్
పర్మిషన్ల దందా
అందినకాడికి దండుకుంటున్న
ఆ విభాగంలోని కొందరు
605 గజాల్లోపు ఓ లెక్క..
దాటిందంటే మరో లెక్క
మామూలుగా చూసుకోకపోతే
వివిధ కారణాలతో కొర్రీలు
ఏసీబీ దృష్టి సారిస్తే అవినీతి
అక్రమాలు వెలుగులోకి..


