హసన్‌పర్తి: సబ్‌ఇన్‌స్పెక్టర్, సమాన తత్సమాన ఉద్యోగాల నియామకాల ప్రిలిమినరీ రాత పరీక్షలకు నిమిషం ఆలస్యమైనా అనుమతి ఉండదని పోలీస్ కమిషనర్ శ్వేత శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. పరీక్షల నిర్వహణకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. వరంగల్ రీజియన్ పరిధిలో మొత్తం 32 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు, పరీక్ష నిర్వహణ, భద్రతా పర్యవేక్షణ కోసం వాటిని ఆరు రూట్లుగా విభజించినట్లు తెలి పారు. ప్రతీ రూట్‌కు ఏసీపీ స్థాయి అధికారిని నియమించినట్లు చెప్పారు. ఈపరీక్షకు వరంగల్ రీజియల్ పరిధిలో మొత్తం 18,194 మంది అభ్యర్థులు హాజరుకానున్నారు. ఆదివారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంటల వరకు పరీక్ష కొనసాగుతుందన్నారు. ఉదయం 9 గంటల నుంచి పరీక్ష కేంద్రంలోకి అనుమతించనున్నట్లు తెలిపారు.
కొనుగోలు కేంద్రాల ఏర్పాటులో జాప్యం
రాయపర్తి: రైతులను దళారుల చేతుల్లోకి కాంగ్రెస్ ప్రభుత్వం నెట్టిందని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. మండల కేంద్రంలో ధాన్యం కొనుగోలుకేంద్రానికి శుక్రవారం ఆయన సందర్శించి రైతులతో మాట్లాడారు. సకాలంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయకపోవడంతో ధాన్యాన్ని ఇప్పటికే దళారులకు తక్కువ ధరకు అమ్ముకోవాల్సి వచ్చిందని రైతులు వాపోయారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో నిర్లక్ష్యం చేస్తోందని ఆరోపించారు. కొనుగోలు కేంద్రాల ఏర్పాటులో జాప్యంతో ధాన్యాన్ని దళారులకు అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని పేర్కొన్నారు. రైతు భరోసా పథకం అమలులోను రైతులకు ఎదురుచూపులే మిగులుతున్నాయని, రైతు రుణమాఫీ ప్రయోజనం ఎక్కువ మంది రైతులకు అందలేదని ఆరోపించారు. బీఆర్‌ఎస్ మండల నాయకులు పాల్గొన్నారు.
ఆర్థిక ఇబ్బందులతో రైతు ఆత్మహత్య
దుగ్గొండి: ఎల్‌నినో ప్రభావంతో ఈసారి పంట ఆశించిన దిగుబడి రాలేదు. బావిలో సాగునీరు లేక పంట ఎండిపోయే పరిస్థితి నెలకొంది. ఇందుకు తోడు గతంలోని అప్పులు వేధిస్తున్నాయి. దీంతో మనస్తాపం చెందిన ఓ యువరైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘట మండలంలోని వెంకటాపురం గ్రామంలో శుక్రవారం రాత్రి జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. గ్రామానికి చెందిన యువరైతు లడె రాజ్‌కుమార్(40) తనకున్న 4 ఎకరాలతోపాటు మరో 2 ఎకరాలు కౌలుకు తీసుకుని సాగు చేస్తున్నాడు. తన భూమిలో సాగునీరు కోసం రెండు బోరు బావులు ఉండగా ఒకటి ఇటీవల ఎండిపోయింది. ఇంకో బోరునుంచి నీరు తగినంతగా రావడం లేదు. గత సీజన్ పంట పెట్టుబడి, ఈసారి అయిన పెట్టుబడులు సుమారు రూ.7లక్షల వరకు అప్పు ఉంది. చేతికి వచ్చే దశలో ఉన్న మొక్కజొన్న పంట ఎండే పరిస్థితి ఉందని లోలోన మదనపడుతున్నాడు. ఈ క్రమంలో శుక్రవారం ఉదయం మొక్కజొన్న చేనుకు నీరు పెడతానని వెళ్లి మధ్యాహ్నం వరకు ఇంటికి రాలేదు. దీంతో అనుమానం వచ్చిన కుటుంబ సభ్యులు అక్కడికి వెళ్లి చూడగా పురుగుల మందు తాగి అపస్మారక స్థితిలో ఉన్నాడు. తోటి రైతుల సాయంతో చికిత్స నిమిత్తం వరంగల్ ఎంజీఎంకు తరలించగా చికిత్స పొందుతూ సాయంత్రం మృతిచెందాడు. మృతుడికి తల్లి రాధమ్మ, భార్య సంతోషి, కుమారుడు పవన్ ఉన్నారు.


