ముల్కనూరు టు అమెరికా.. | - | Sakshi
Sakshi News home page

ముల్కనూరు టు అమెరికా..

Nov 16 2026 1:20 AM | Updated on Nov 16 2026 1:20 AM

తెలంగాణ సోనా, జైశ్రీరామ్‌ బియ్యానికి డిమాండ్‌.. తొలి విడత 25 టన్నుల ఎగుమతి

సాక్షిప్రతినిధి, వరంగల్‌/ భీమదేవరపల్లి : ఒకప్పుడు పంట పెట్టుబడి కోసం వడ్డీ వ్యాపారులను ఆశ్రయించిన రైతులు.. నేడు తమ సొంత సహకార సంస్థ అండతో పంట పండించి, అదే సంస్థకు విక్రయించి, ప్రపంచ మార్కెట్‌కు పంపించే స్థాయికి ఎదిగారు. ఆ రైతు ఆర్థిక స్వావలంబనకు ప్రతీకగా నిలుస్తోంది భీమదేవరపల్లి మండలంలోని ముల్కనూరు కో–ఆపరేటివ్‌ రూరల్‌ క్రెడిట్‌ అండ్‌ మార్కెటింగ్‌ సొసైటీ. 1956లో 373 మంది రైతులతో ప్రారంభమైన ఈ సంస్థ.. ఇప్పుడు 7,500 మందికి పైగా సభ్యులతో విస్తరించి, వ్యవసాయానికి అవసరమైన దాదాపు అన్ని సేవలను ఒకే వేదికపై అందిస్తోంది. తాజాగా ‘ముల్క నూరు రైస్‌’ బ్రాండ్‌ను అమెరికా మార్కెట్‌కు తీసుకెళ్లేందుకు అడుగులు వేయడం మరో మైలురాయిగా నిలుస్తోంది.

అమెరికా బాటలో ముల్కనూరు బియ్యం..

ముల్కనూరు సొసైటీకి చెందిన తెలంగాణ సోనా, జైశ్రీరామ్‌ రకాల బియ్యాన్ని అమెరికాకు ఎగుమతి చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. అమెరికాలోని ప్రవాస భారతీయులు, ముఖ్యంగా తెలుగు సమాజంలో ఉన్న డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని అమెరికాలోని హార్వెస్ట్‌ లింకు కో–ఆపరేటివ్‌ అనే ప్రముఖ కొనుగోలుదారు సంస్థతో సొసైటీ ఒప్పందం కుదుర్చుకుంది. విశాఖపట్నం పోర్టు ద్వారా తొలి విడతలో సుమారు 25 టన్నుల బియ్యాన్ని పంపేందుకు సన్నాహాలు పూర్తయ్యాయి. అవసరమైన నియంత్రణ, కంటైనర్‌ అనుమతులు పూర్తయిన వెంటనే ఎగుమతి ప్రక్రియ ప్రారంభం కానుంది. అంతర్జాతీయ మార్కెట్‌లో దేశీయ ధరతో పోలిస్తే మెరుగైన ధర లభించే అవకాశం ఉండడంతో.. ఎగుమతులు విస్తరిస్తే రైతులకు కూడా మెరుగైన మార్కెట్‌ అవకాశాలు ఏర్పడతాయని సొసైటీ ఆశిస్తోంది.

విత్తనం నుంచి మార్కెట్‌ వరకు..

అంతా సొసైటీదే..

ముల్కనూరు నమూనా ప్రత్యేకత రైతుకు కేవలం రుణం ఇవ్వడంతో ఆగిపోదు. విత్తనాలు, ఎరువులు, వ్యవసాయ పరికరాలు, సాంకేతిక సలహాలు, పంట రుణాలు, పంట కొనుగోలు, గోదాంలు, ప్రాసెసింగ్‌, బ్రాండింగ్‌, మార్కెటింగ్‌.. ఇలా వ్యవసాయ విలువ గొలుసులోని అనేక దశలను సొసైటీ తన పరిధిలోకి తీసుకొచ్చింది. సొసైటీ సొంత గోదాంలు, గ్రామాల వద్ద నేరుగా కొనుగోలు కేంద్రాలు ఉండడంతో రవాణా వ్యయం తగ్గడంతో పాటు మధ్యవర్తుల ప్రమేయం కూడా తగ్గుతోంది. పంట నాణ్యతను పరిశీలించి కొనుగోలు చేయడం, సొసైటీ ఆధ్వర్యంలోనే ప్రాసెసింగ్‌ చేసి ‘ముల్క నూరు రైస్‌’గా మార్కెట్‌లోకి తీసుకురావడం రైతు కు అదనపు విలువను అందించేలా ఉంది.

‘సహకార’ స్ఫూర్తితో 70 ఏళ్ల ప్రస్థానం.. ఇప్పుడు అంతర్జాతీయ మార్కెట్‌పై గురి

373 మంది రైతులతో మొదలు.. 7,500 మంది సభ్యులకు విస్తరణ..

విత్తనం నుంచి విక్రయం వరకు ఒకే గొడుగు కింద సేవలు..

దళారులకు దూరంగా

‘ముల్కనూరు’ రైతులు..

కరువుకు దూరంగా కర్షక లోకం..

స్థానికం నుంచి జాతీయానికి.. ఇప్పుడు అంతర్జాతీయానికి..

ముల్కనూరు బియ్యం ఇప్పటికే తెలంగాణలోని పలు విక్రయ కేంద్రాల ద్వారా వినియోగదారులకు చేరుతున్నాయి. బియ్యం ప్రాసెసింగ్‌, విత్తనాల ఉత్పత్తి, నిల్వ, నాణ్యత నియంత్రణ, బ్రాండింగ్‌ వంటి కార్యకలాపాలను సొసైటీ తన పరిధిలోనే నిర్వహిస్తోంది. ఇప్పటి వరకు ‘ముల్కనూరు’అంటే రైతుల సహకారంతో నిలదొక్కుకున్న గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు చిరునామాగా ఉన్న పేరు.. ఇక అమెరికా మార్కెట్‌లోనూ వినిపించేందుకు సిద్ధమవుతోంది. తొలి 25 టన్నుల ఎగుమతి విజయవంతమైతే.. అది కేవలం ఒక బియ్యం కంటైనర్‌ ప్రయాణం కాదు.. తెలంగాణ రైతు సమష్టి శక్తి అంతర్జాతీయ మార్కెట్‌ వైపు వేసే తొలి పెద్ద అడుగు కానుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement