హన్మకొండ కల్చరల్: కార్తీకమాస ప్రారంభంతో జిల్లాలో పెళ్లిళ్ల సందడి మొదలైంది. మార్కెట్‌లో వివాహ అనుబంధ వ్యాపార దుకాణాల్లో రద్దీ పెరిగింది. బంగారం ధరలు కాస్త తగ్గినా.. ఫంక్షన్ హాళ్లు మొదలుకొని నిత్యావసరాల వరకు అన్నింటి ధరలు పెరిగాయి. పేద, మధ్య తరగతి వర్గాల వారు పెళ్లి చేయాలంటే తలకు మించిన భారంగా మారుతోందని ఆందోళన చెందుతున్నారు.
రెండు నెలల పాటు ముహూర్తాలు..
దీపావళి తర్వాత నుంచి రెండునెలల పాటు వివాహ ముహూర్తాలున్నాయని పురోహితులు చెబుతున్నారు. రాబోయే రెండు నెలల పాటు వాయిద్యాలు మండపాలు, క్యాటరింగ్ నిర్వాహకులు, ఫొటోగ్రాఫర్లు, వీడియోగ్రాఫర్లు, వివాహ సామగ్రి, పూజల దండలు తయారు చేసే వృత్తుల వారికి చేతి నిండా పనులు దొరకనున్నాయి. ఇప్పటికే పలువురు ముందస్తుగా మండపాలకు అడ్వాన్సులు చెల్లించి బుక్ చేసుకుంటున్నారు.
వివాహ వేదికలకు డిమాండ్
నగరంలో వసతులను బట్టి ఫంక్షన్ హాల్స్‌కు రోజుకు అద్దె రూ.40 వేల నుంచి రూ.లక్ష వరకు వసూలు చేస్తున్నారు. మండపాల అలంకరణకు అదనపు చార్జీలు వసూలు చేస్తున్నారు. ఇంకా భోజనాలు ఇతరరాత్ర ఖర్చులు వేరే ఉంటాయి. పురోహితులు, ఫొటోగ్రఫీ, వీడియోగ్రఫీ, తదితర కార్యక్రమాలకు కూడా లక్షలు వెచ్చించాల్సి వస్తోందని వాపోతున్నారు. వస్త్ర బంగారం దుకాణాలు కొనుగోళ్లలో సందడిగా మారాయి. ఇదే ఒరవడి రెండు నెలలపాటు కొనసాగనుందని వ్యాపారులు అభిప్రాయపడుతున్నారు.
ప్రారంభమైన కార్తీక మాసం..
వివాహాలకు సుముహూర్తాలు
దిగి వచ్చిన బంగారం రేట్లు..
పెరిగిన నిత్యావసరాల ధరలతో బెంబేలెత్తుతున్న సామాన్యులు


