రైతులకు అందుబాటులో 37 రకాల వ్యవసాయ పరికరాలు
దుగ్గొండి: ఖరీదైన వ్యవసాయ యంత్ర పరికరాలను కొనలేక ఇబ్బంది పడుతున్న చిన్న సన్నకారు రైతులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. వ్యవసాయ యాంత్రీకరణకు ఊతమిచ్చేలా రాష్ట్రవ్యాప్తంగా 360 అద్దె యంత్రాల కేంద్రాలను మంజూరు చేసింది. ఇందులో భాగంగానే జిల్లాకు 10 సీహెచ్‌సీలను (కస్టమ్ హైరింగ్ కేంద్రాలు) కేటాయించారు. ఈ పథకం రాష్ట్రీయ కృషి వికాస్ యోజనలో భాగంగా సబ్ మిషన్ ఆన్ అగ్రికల్చర్ మెకనైజేషన్ కింద అమలవుతుంది.
యూనిట్ విలువ రూ.50లక్షలు
సీహెచ్‌సీ యూనిట్ విలువ రూ.50లక్షలు ఉండగా ప్రభుత్వ సబ్సిడీ రూ.20లక్షలు, లబ్ధిదారుల వాటా రూ.30 లక్షలు ఉంటుంది. ఇది మహిళా సంఘాలైన భరించాలి లేదా బ్యాంక్ రుణమైనా తీసుకోవచ్చు. కిసాన్ డ్రోన్‌కు రూ.5 లక్షలుగాను 50 శాతం సబ్సిడీ అందిస్తారు. ఇందుకు ప్రభుత్వం జిల్లాకు రూ.5 కోట్లు మంజూరు చేసింది. ఈ పథకం ద్వారా యంత్రాలను అద్దెకు ఇస్తూ సంఘాలు ఆర్థికంగా బలోపేతమై శాశ్వత ఆదాయం వస్తుంది.
ఒకేచోట 37 రకాల పరికరాలు
ఒకే కేంద్రంలో 7 విభాగాల్లో 37 రకాల పరికరాలను అందుబాటులో ఉంచనున్నారు. భూమి తయారీ విభాగంలో పవర్‌టిల్లర్, రోటీవీటర్, కల్టీవేటర్, డిస్‌ప్లవ్, సబ్‌సాయిలర్, బండ్ ఫార్మర్, లెవలింగ్ బ్లేడ్ ఉన్నాయి. విత్తనాల విభాగంలో సీడ్‌కమ్ ఫర్టిలైజర్ డ్రిల్, మల్లీక్రాప్ ప్లాంటర్, ప్లాస్టిక్ మల్చింగ్ యంత్రం, కలుపుతీయడంలో పవర్‌వీడర్, బ్రష్‌కట్టర్, కలుపుతీసే యంత్రం ఉంది. అలాగే పంట రక్షణకు పవర్ స్ప్రేయర్, ట్రాక్టర్ బూమ్ స్ప్రేయర్, కిసాన్ డ్రోన్, కోత నూర్పిడికి కంబైన్డ్ హార్వెస్టర్, మొక్కజొన్న హార్వెస్టర్, మల్టీక్రాఫ్ థ్రెషర్, మైజ్ షిల్లర్, కోత అనంతరం వరిధాన్యం మొబైల్ డ్రయ్యర్, స్ట్రాబేలర్, రోటరీ గ్రేడర్‌తో పాటు ప్రత్యేక పరికరాలైన పసుపు ఉడికించే యంత్రం, పసుపు పాలిషర్ కూడా ఉన్నాయి.
పంట చేతికొచ్చే వరకు..
దుక్కి దున్ని విత్తనం వేసే నాటి నుంచి పంట కోత, ధాన్యం ఆరబెట్టడం వరకు అన్నీ రకాల పరికరాలు చౌకగా అద్దెకు ఇవ్వనున్నారు. రైతులు పరికరాల కోసం ఇతర రాష్ట్రాలు, ఇతర జిల్లాల వారిపై ఆధారపడడం తగ్గడంతో పాటు డ్వాక్రా మహిళలకు, ఎఫ్‌పీఓలకు నెలవారీ ఆదాయం వస్తుంది.
అర్హులు వీరే..
ప్రభుత్వం ఏర్పాటు చేసే కస్టమ్స్ హైరింగ్ కేంద్రాలను (సీహెచ్‌సీ) రైతు ఉత్పత్తి దారుల సంఘాలు, డ్వాక్రా స్వయం సహాయక సంఘాలు, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలకు కేటాయించనున్నారు. సంఘాలు ఏర్పడి 3 సంవత్సరాలు నిండి ఉండాలి. ఈ పథకానికి కేంద్రం వాటా 60 శాతం కాగా రాష్ట్రం వాటా 40 శాతం ప్రాతిపదికన నిధులు రానున్నాయి.
జిల్లాకు 10 సీహెచ్‌సీల కేటాయింపు
చిన్న సన్నకారు రైతులకు ఊరట


