ఇంటి పన్ను వసూళ్ల లక్ష్యాన్ని చేరుకోవాలి | - | Sakshi
Sakshi News home page

ఇంటి పన్ను వసూళ్ల లక్ష్యాన్ని చేరుకోవాలి

Nov 14 2026 1:35 AM | Updated on Nov 14 2026 1:35 AM

ఇంటి పన్ను వసూళ్ల లక్ష్యాన్ని చేరుకోవాలి

కలెక్టర్‌ చాహత్‌ బాజ్‌పాయ్‌

హన్మకొండ అర్బన్‌: పరకాల మున్సిపాలిటీ పరిధిలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఇంటి పన్నుల వసూళ్ల లక్ష్యాన్ని వందశాతం పూర్తి చేయాలని హనుమకొండ కలెక్టర్‌ చాహత్‌ బాజ్‌పాయ్‌ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో శుక్రవారం పరకాల మున్సిపాలిటీ కమిషనర్‌ పోతరాజు పవన్‌, ఇతర అధికారులతో ఇంటి పన్నుల వసూళ్ల పురోగతి, పట్టణ అభివృద్ధి పనులపై కలెక్టర్‌ సమీక్ష నిర్వహించారు. ఇప్పటివరకు వసూలైన పన్నులు, బకాయిలు, కొత్త అంచనాలు, పట్టణ ప్రణాళిక తదితర అంశాలను సమీక్షించారు. పన్నుల వసూళ్లపై ప్రత్యేక దృష్టి సారించి పురోగతి సాధించాలన్నారు. బకాయిదారులను గుర్తించి నోటీసులు జారీ చేయడంతోపాటు పన్నుల వసూళ్ల ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలన్నారు. తాగునీటి సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని, పారిశుద్ధ్య నిర్వహణ మెరుగుపర్చాలని ఆదేశించారు. అన్ని వార్డుల్లో స్వచ్ఛ ఆటోల ద్వారా చెత్త సేకరణ జరగాలన్నారు. రహదారులు, మురుగుకాలువలు, పార్కులు తదితర అభివృద్ధి పనులను త్వరగా పూర్తి చేయాలని సూచించారు. సమావేశంలో మున్సిపల్‌ అధికారులు ఎండీ అర్షద్‌, రాము, రాజ్‌కుమార్‌, గిరిబాబు తదితరులు పాల్గొన్నారు.

గడువులోగా సీఎంఆర్‌

బకాయిలు చెల్లించాలి

ప్రభుత్వానికి బకాయి ఉన్న కస్టమ్‌ మిల్లింగ్‌ రైస్‌ (సీఎంఆర్‌)ను ఈనెల 30వ తేదీలోగా అందజేయాలని హనుమకొండ కలెక్టర్‌ చాహత్‌ బాజ్‌పాయ్‌.. డీఫాల్ట్‌ రైస్‌ మిల్లర్లను ఆదేశించారు. కలెక్టరేట్‌లో శుక్రవారం అదనపు కలెక్టర్‌ ఎన్‌.రవి, జిల్లా పౌర సరఫరాల అధికారి మహేందర్‌, ఇతర అధికారులతో పాటు సీఎంఆర్‌ బకాయిలు పూర్తిగా పెండింగ్‌లో ఉన్న రైస్‌మిల్లర్లు, జరిమానా బకాయిలున్న మిల్లర్లతో కలెక్టర్‌ సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ.. గడువులోగా సీఎంఆర్‌ అందించకపోతే రెవెన్యూ రికవరీ చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సమావేశంలో పౌర సరఫరాల శాఖ సిబ్బంది నాగేంద్రప్రసాద్‌, భద్రునాయక్‌, ఇతర అధికారులు, రైస్‌మిల్లర్లు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement