సీఎంఆర్‌ బకాయి మిల్లర్లపై కొరడా | - | Sakshi
Sakshi News home page

సీఎంఆర్‌ బకాయి మిల్లర్లపై కొరడా

Nov 13 2026 8:27 AM | Updated on Nov 13 2026 8:27 AM

సాక్షి, వరంగల్‌: జిల్లాలో కస్టమ్‌ మిల్లింగ్‌ రైస్‌ (సీఎంఆర్‌) బకాయిలున్న మిల్లర్లపై పౌర సరఫరా విభాగాధికారులు కొరడా ఝుళిపిస్తున్నారు. 2023–24 ఖరీఫ్‌ సీజన్‌కు సంబంధించి మిల్లులకు ధాన్యం కేటాయించిన అనంతరం ప్రభుత్వానికి అందించాల్సిన సీఎంఆర్‌ బియ్యంలో వేల మెట్రిక్‌ టన్నులు బకాయిలున్న మిల్లర్లను కటకటాలపాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా రాయపర్తి మండలంలోని కొండూరులోని పరమేశ్వర రైస్‌ మిల్లుకు చెందిన చిర్ర ఉపేంద్ర, పుల్ల ఎల్లగౌడ్‌, ఆవుల కేశవరెడ్డి, వంగాల నరసయ్య, ఆవుల ప్రభాకర్‌ రెడ్డిలను పోలీసులు బుధవారం రాత్రి అరెస్టు చేసి నర్సంపేట, పరకాల జైళ్లకు తరలించారు. ప్రభుత్వానికి సీఎంఆర్‌ బకాయి రూ.కోటి 60 లక్షలు ప్రభుత్వానికి ఇవ్వాల్సి ఉండగా, వడ్డీతో రూ.3 కోట్ల వరకు ఇవ్వాల్సి ఉందని తెలిసింది. ఇప్పటికే వరంగల్‌ నగర శివారు గాడిపల్లిలోని వైష్ణవి ఇండస్ట్రీస్‌ యజమానిపై కేసు నమోదైతే వారం క్రితం బెయిల్‌ తెచ్చుకున్నట్టు తెలిసింది. అలాగే రెండు నెలల క్రితం రూ.1.5 కోట్ల బకాయిలున్న మరో మిల్లర్‌ లక్ష్మి ఎంటర్‌ప్రైజెస్‌ యజమాని జగదీశ్‌పై మామునూరు పోలీసు స్టేషన్‌లో కేసు నమోదు చేసి అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. దీంతో బకాయిలున్న మిగిలిన మిల్లర్లలో దడ మొదలైంది.

ఖరీఫ్‌ సీజన్‌ సీఎంఆర్‌పై దృష్టి..

2025–26 ఖరీఫ్‌ సీజన్‌కు సంబంధించి మిల్లులకు 1,74,951 మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని అప్పగించారు. దీనికి అనుగుణంగా ప్రభుత్వానికి 1,17,373 మెట్రిక్‌ టన్నుల బియ్యాన్ని సీఎంఆర్‌ కింద అందించాల్సి ఉంది. అయితే ఇప్పటివరకు 87,738 మెట్రిక్‌ టన్నుల బియ్యం మాత్రమే ప్రభుత్వానికి డెలివరీ చేశారు. ఇంకా 29,635 మెట్రిక్‌ టన్నుల బియ్యం అందించాల్సి ఉంది. మిగిలిన బియ్యాన్ని కూడా సకాలంలో అప్పగించేలా మిల్లర్లపై అధికారులు ఒత్తిడి తెస్తున్నారు. ఒకవైపు పాత బకాయిల వసూలుకు చట్టపరమైన చర్యలు తీసుకుంటూనే, మరోవైపు ప్రస్తుత సీజన్‌కు సంబంధించిన సీఎంఆర్‌ డెలివరీని వేగవంతం చేసేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగానే ప్రత్యేక బృందాలు ఆకస్మాత్తుగా మిల్లుల్లో తనిఖీలు చేస్తూనే చట్టపరమైన చర్యలకు దిగుతుండడంతో కొందరు మిల్లర్లు బకాయిలు క్లియర్‌ చేస్తున్నారని అధికారులు చెబుతున్నారు

తాజాగా రాయపర్తి మండలంలో ఓ మిల్లు యజమాని, నలుగురి అరెస్టు

మామునూరు ఠాణా పరిధిలోనూ ఓ మిల్లు యజమానికి సంకెళ్లు

అధికారుల వరుస చర్యలతో బకాయిల మిల్లు యజమానుల్లో దడ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement