ఏళ్లుగా ఎదురుచూస్తున్న 18 మంది ఎంజీఎం ఉద్యోగుల వారసులు
● ఎంజీఎంలో జూనియర్ అసిస్టెంట్‌గా పనిచేసిన ఓ ఉద్యోగి 2021 ఫిబ్రవరిలో గుండెపోటుతో మృతి చెందాడు. తండ్రి స్థానంలో ఆఫీస్ సబార్డినేట్ ఉద్యోగం కోసం కుమారుడు కారుణ్య నియామకం కింద దరఖాస్తు చేసుకున్నాడు. ఐదేళ్లు గడుస్తున్నా ఇప్పటికీ ఉద్యోగంపై స్పష్టత లేకపోవడంతో ఆ కుటుంబం ఆందోళన చెందుతోంది.
● ఎంజీఎం అకడమిక్ సెల్‌లో టేబుల్ బాయ్‌గా పనిచేసిన మరో ఉద్యోగి కుటుంబంలో వరుస విషాదాలు చోటుచేసుకున్నాయి. 2023 మేలో ఇద్దరు కుమారులు మరణించగా...అదే ఏడాది అక్టోబర్‌లో ఆయన గుండెపోటుతో కన్నుమూశారు. ఆమెకు అండగా నిలిచేందుకు కుమార్తె జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకున్నా ఇప్పటివరకు స్పష్టత రాలేదు.
● ఎంజీఎం ఎక్స్‌రే విభాగంలో సుమారు 30 ఏళ్లపాటు రేడియోగ్రాఫర్‌గా పనిచేసిన మరో ఉద్యోగి 2025 జనవరిలో మృతిచెందాడు. పదవీ విరమణకు నాలుగు నెలల సమయం ఉండగా పక్షవాతం, ఇతర అనారోగ్య సమస్యలతో కన్నుమూశాడు. ఆయన కుమారుడు బీకాం డిగ్రీ పూర్తి చేసి జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగం కోసం కారుణ్య నియామకం కింద దరఖాస్తు చేసుకున్నాడు. ఈ దరఖాస్తు కూడా పెండింగ్‌లోనే ఉంది.
... ఇలా మరో 15 మంది కారుణ్య నియామకాల కోసం గత ఆరేళ్ల నుంచి ఎదురుచూస్తున్నారు. ఏదో సాకుచూపుతూ ఏళ్ల తరబడి కలెక్టరేట్, ఎంజీఎం ఆస్పత్రి చుట్టూ కాళ్లరిగేలా తిప్పుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
సాక్షి, వరంగల్ : వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో విధి నిర్వహణలో మరణించిన 18 ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబాల పరిస్థితి అత్యంత దయనీయంగా, అగమ్యగోచరంగా మారింది. ఇంటి పెద్దను కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న ఆ కుటుంబాలను ఆదుకోవాల్సిన ఆస్పత్రి యంత్రాంగం కారుణ్య నియామకాల (కంపోసియేనెట్ అపాయింట్‌మెంట్స్) విషయంలో అత్యంత నిర్లక్ష్యంగా, బాధ్యతారహితంగా వ్యవహరిస్తోందనే ఆరోపణలున్నాయి. ప్రభుత్వ ఉద్యోగి విధి నిర్వహణలో మరణిస్తే, వారిపై ఆధారపడిన కుటుంబ సభ్యులకు ఏడాది లోపే కారుణ్య నియామకం కింద ప్రభుత్వ ఉద్యోగం కల్పించి ఆ కుటుంబానికి అండగా నిలవాలని రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో జీఓల్లో స్పష్టంగా ఆదేశాలు జారీ చేసింది. కానీ, వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో మాత్రం ఆ ప్రభుత్వ నిబంధనలు ఏమాత్రం అమలు కావడం లేదు. ఏడాదిలోపు ఇవ్వాల్సిన ఉద్యోగాలను ఏళ్లు గడుస్తున్నా భర్తీ చేయకపోవడం అధికారుల పనితీరుకు నిదర్శనంగా నిలుస్తోందన్న విమర్శలున్నాయి.
కలెక్టర్ అనుమతి ఇచ్చినా కదలని ఫైళ్లు...
బాధిత కుటుంబాలు గత దశాబ్ద కాలంగా తమ గోడును చెప్పుకోని వేదిక లేదు, తిరగని కార్యాలయం లేదు. వరంగల్ జిల్లా కలెక్టర్ ఈ విషయంపై సానుకూలంగా స్పందించి, ఎంజీఎంలో కారుణ్య నియామకాలు చేపట్టడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినప్పటికీ, ఆస్పత్రి పరిపాలన విభాగంలోని కొంతమంది అధికారుల అలసత్వం, నిర్లక్ష్యం కారణంగా ఆ ఫైళ్లు అడుగు కూడా ముందుకు కదలడం లేదు. ఏదో ఒక సాకు చెబుతూ, కాలయాపన చేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. మంత్రులు, స్థానిక ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లినా సమస్య పరిష్కారం కావడం లేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఖాళీలున్నా.. నియామకాలేవీ..
ఎంజీఎంలో కారుణ్య నియామకాలు ఇవ్వడానికి పోస్టులు లేక కాదు. అటెండర్, జూనియర్ అసిస్టెంట్, కంప్యూటర్ ఆపరేటర్, టైపిస్ట్ వంటి పలు కీలక విభాగాల్లో పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇంకోవైపు వరంగల్‌లో ప్రారంభానికి సిద్ధంగా ఉన్న 24 అంతస్తుల సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో సేవలు ప్రారంభమైతే అక్కడ పనిచేయడానికి భారీ ఎత్తున సిబ్బంది అవసరం. ఆయా ఖాళీల్లో ఎన్నో ఏళ్లుగా కారుణ్య నియామకాల కోసం దరఖాస్తులు చేసుకుని ఎదురుచూస్తున్న అర్హులైన వారసులను భర్తీ చేస్తే ఆయా కుటుంబాలకు ఎంతో న్యాయం జరగనుంది. అధికారుల నిర్లక్ష్యానికి, జాప్యానికి తాము బలైపోతున్నామని బాధిత కుటుంబ సభ్యులు కన్నీటిపర్యంతమవుతున్నారు. ఇప్పటికై నా కలెక్టర్, మంత్రులు ఈ విషయంపై ప్రత్యేక దృష్టి సారించి ఆదుకోవాలని వారు కోరుతున్నారు.
ఇంటి పెద్దలను కోల్పోవడంతో ఆర్థిక ఇబ్బందులు
కలెక్టర్ సానుకూలత తెలిపినా ముందుకు సాగని ప్రక్రియ
ఖాళీలు ఉన్నా ఉద్యోగాలివ్వని వైనం...
త్వరగా నియామకం చేపట్టాలంటూ బాధితుల వేడుకోలు


