బీమా.. లేదు ధీమా! | - | Sakshi
Sakshi News home page

బీమా.. లేదు ధీమా!

Nov 13 2026 8:27 AM | Updated on Nov 13 2026 8:27 AM

ఆగస్టు 14న నిలిచిపోయిన రైతుబీమా పథకం

● జిల్లాలో మూడు నెలల్లో

80 మంది రైతుల మృతి

● సాయం కోసం బాధిత

కుటుంబాల ఎదురుచూపులు

ఈ ఫొటోలో కనిపిస్తున్నది కమలాపూర్‌ మండలం శనిగరం గ్రామానికి చెందిన బండి వెంకటస్వామి కుటుంబ సభ్యులు. వీరు రెండున్నర ఎకరాల్లో వరి, రెండెకరాల్లో పత్తి పంట సాగు చేశారు. అక్టోబర్‌ 2న వెంకటస్వామి తీవ్ర అనారోగ్యానికి గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఆయనకు భార్య మంజుల, కుమారుడు పవన్‌కల్యాణ్‌, కూతురు ప్రేమలత ఉన్నారు. వెంకటస్వామి ఆస్పత్రి వైద్య ఖర్చులకు రూ.8 లక్షల వరకు అప్పులయ్యాయి. అప్పులిచ్చిన వాళ్లు తమ అప్పులు తిరిగి చెల్లించాలని వెంటపడ్డారు. చేసేదేమీ లేక వెంకటస్వామి భార్య మంజుల తన పుస్తెలతాడు అమ్మి రూ.4 లక్షల అప్పు తీర్చగా.. ఇంకా మరో రూ.4 లక్షలు మిగిలింది. రైతుబీమా పథకం అమలులో ఉంటే తమ కుటంబానికి రూ.5 లక్షలు వచ్చేవని, దీంతో తమ అప్పులు కొంత వరకై నా తీర్చుకునే అవకాశం ఉండేదని, ప్రస్తుతం రైతు బీమా పథకం నిలిచి పోవడంతో రైతు బీమా డబ్బులు తమకు అందలేదని వెంకటస్వామి కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

హన్మకొండ: రైతుబీమా పథకం నిలిచిపోవడంతో బాధిత కుటుంబాలు ఇబ్బందులు పడుతున్నాయి. 2018లో అప్పటి బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రైతుబీమా పథకాన్ని తీసుకొచ్చింది. జిల్లాలో 2025 వరకు 3,360 మంది రైతులు మరణించగా ఆ బాధిత కుటుంబాలకు రూ.168 కోట్ల సాయాన్ని అందించారు. 18 నుంచి 59 ఏళ్ల వయస్సు ఉన్న అర్హులైన రైతులకు ప్రభుత్వమే ప్రీమియం చెల్లించేది. ప్రతి సంవత్సరం ఆగస్టు 14న ఎల్‌ఐసీకి ప్రీమియం చెల్లించి పునరుద్ధరిస్తూ వచ్చింది. రైతు మరణించిన వారం నుంచి పది రోజుల్లో నామిని బ్యాంకు ఖాతాలో రూ.5 లక్షలు జమయ్యేవి. 2026 ఆగస్టు 13 వరకు పథకం కొనసాగింది. ప్రభుత్వం ప్రీమియం చెల్లించకపోవడంతో ఆగస్టు 14 నుంచి రైతుబీమా పథకం నిలిచిపోయింది. మూడు నెలల్లో ఇప్పటి వరకు జిల్లాలో 80 మంది రైతులు చనిపోయారు. దీంతో ఆర్థిక సాయం అందక రైతు కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ప్రభుత్వం సూచించిన మేరకు బీమా పథకం నిలిచిపోయిన రైతుల వివరాలను వ్యవసాయ అధికారులు సేకరిస్తున్నారు.

కొత్త బీమా పథకంపై కరువైన స్పష్టత..

కొత్త బీమా పథకం అమలు చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించినా ఇప్పటి వరకు స్పష్టత లేదు. ఏ బీమా కంపెనీ ద్వారా పథకం అమలు చేస్తారు, ప్రీమియం చెల్లింపు ఎలా ఉంటుంది, అందించే సాయం ఎంత, ఎప్పటి నుంచి అమలు చేస్తారు అనే అంశాలపై ప్రభుత్వం నుంచి స్పష్టత రావాల్సి ఉంది. ప్రీమియం చెల్లించకుండా క్లెయిమ్స్‌ ఎలా సాధ్యమవుతుందని పలువురు రైతులు ప్రశ్నిస్తున్నారు. చనిపోయిన వారికి ప్రత్యేక నిధులు కేటాయించి సాయం అందించాలని రైతు కుటుంబాలు కోరుతున్నాయి.

సంవత్సరం మరణించిన క్లెయిమ్స్‌ నమోదైన

రైతులు రైతులు

2018–19 325 16.25 73,141

2019–20 358 17.9 74,570

2020–21 597 29.85 74,924

2021–22 390 19.5 80,708

2022–23 385 19.25 84,334

2023–24 491 24.55 88,401

2024–25 410 20.5 90,429

2025–26 404 20.2 90,765

మొత్తం 3,360 168 6,57,272

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement