● పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి
● కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్‌తో కలిసి
పరకాల ఏరియా ఆస్పత్రి పరిశీలన
పరకాల: ప్రభుత్వ ఆస్పత్రుల్లో సాధారణ ప్రసవాల సంఖ్య పెంచేందుకు ప్రత్యేక దృష్టిసారించాలని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి ఆదేశించారు. పరకాలలోని నూతన ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిని కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్‌తో కలిసి గురువారం ఆయన సందర్శించారు. వైద్య సేవలు, అవసరమైన మౌలిక సదుపాయాలు, పెండింగ్ పనులు, వివిధ విభాగాల పనితీరుపై వైద్యాధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి మాట్లాడుతూ ఆస్పత్రిలో పెండింగ్ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని, పాత భవనంలో ఉన్న బ్లడ్‌బ్యాంకును నూతన ఆస్పత్రి భవనానికి తరలించాలని సూచించారు. ఈ– ఔషధి, ఆయుష్మాన్ భారత్, ఆరోగ్యశ్రీ పథకాలను సమర్థవంతంగా అమలు చేయాలని, ఓపీ, ఐపీ సేవలను మరింత విస్తరించాలని ఆదేశించారు. కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ మాట్లాడుతూ ఆస్పత్రిలో పారిశుద్ధ్య నిర్వహణ మెరుగుపర్చాలని, రోగులకు మెరుగైన వైద్యసేవలు అందించాలని, సదుపాయాలు కల్పించాలని సూచించారు. డీఎంహెచ్‌ఓ డాక్టర్ అప్పయ్య, ఆర్డీఓ డీఎస్ వెంకన్న, పరకాల మున్సిపల్ కమిషనర్ పి.పవన్, ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ వంశీకృష్ణ, ఆర్‌ఎంఓలు డాక్టర్ నారాయణరెడ్డి, డాక్టర్ బాలకృష్ణ, డాక్టర్ ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.
రెవెన్యూ దరఖాస్తులు పరిష్కరించాలి
రెవెన్యూకు సంబంధించిన దరఖాస్తులను వేగవంతంగా పరిష్కరించాలని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి, కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ అధికారులను ఆధేశించారు. పరకాల ఆర్డీఓ కార్యాలయంలో గురువారం నిర్వహించిన సమీక్షలో వారు మాట్లాడారు. ప్రభుత్వ స్థలాలు ఆక్రమణకు గురికాకుండా పరిరక్షించాలని, భూరీసర్వే ప్రక్రియ త్వరితగతిన పూర్తి చేయాలని తెలిపారు. సమీక్షలో పరకాల ఆర్డీఓ డీఎస్ వెంకన్న, తహసీల్దార్ విజయలక్ష్మి, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.
అవసరమైతేనే సిజేరియన్లు చేయాలి..
హన్మకొండ అర్బన్: ప్రభుత్వ ఆరోగ్య కార్యక్రమాల అమలులో ప్రైవేట్ ఆస్పత్రులు భాగస్వాములు కావాలని కలెక్టర్ చాహత్‌బాజ్‌పాయ్ ఆదేశించారు. రోడ్డు ప్రమాద బాధితులకు సత్వర వైద్యం అందించే పీఎం రాహత్ పథకాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని, అర్హులకు నగదు రహిత చికిత్స అందించాలని కోరారు. జిల్లాలోని ప్రైవేట్ ఆస్పత్రుల యాజమాన్యాలతో కలెక్టరేట్‌లో గురువారం నిర్వహించిన సమీక్షలో ఆమె మాట్లాడారు. ఆస్పత్రుల్లో సిజేరియన్లు, సాధారణ ప్రసవాల నిష్పత్తిపై ఆడిట్ నిర్వహించాలని పేర్కొన్నారు. అవసరం ఉన్నప్పుడే మాత్రమే సిజేరియన్లు చేయాలని, సాధారణ ప్రసవాలను ప్రోత్సహించాలని స్పష్టం చేశారు. డీఎంహెచ్‌ఓ అప్పయ్య, ప్రోగ్రాం అధికారులు డాక్టర్లు రజిత, కృష్ణారావు, జ్ఞానేశ్వర్, ప్రదీప్‌రెడ్డి, ప్రైవేట్ ఆస్పత్రుల ప్రతినిధులు పాల్గొన్నారు.
బాలల ఆధార్ నమోదు పూర్తిచేయాలి
బాలలకు కొత్తగా ఆధార్ నమోదు చేయడంతోపాటు ఇప్పటికే ఆధార్ కార్డులు ఉన్న పిల్లల బయోమెట్రిక్ నవీకరణ ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో అధికారుల సమీక్షలో కలెక్టర్ మాట్లాడారు. అదనపు కలెక్టర్ ఎన్.రవి, డీఆర్‌ఓ కె.శ్రీనివాస్, డీఈఓ గిరిరాజ్ గౌడ్, డీఐఈఓ గోపాల్, డీడబ్ల్యూఓ విశ్వజ, ఈడీఎం శ్రీధర్, యూఐడీఏఐ అసిస్టెంట్ మేనేజర్ శ్రవణ్ కుమార్, కలెక్టరేట్ డీసెక్షన్ సూపరింటెండెంట్ నాగరాజు, పోస్టల్ శాఖ ఇన్‌స్పెక్టర్ రవి, మీసేవ జిల్లా సమన్వయకర్త చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.


