న్యూస్‌రీల్
● 32 ప్రభుత్వ కార్యాలయాలనుంచి రాని రుసుములు
● అన్ని శాఖలు సకాలంలో
చెల్లిస్తేనే మెరుగైన సేవలు
● ఇలా అయితే నిర్వహణ సాగేదెలా అంటున్న అధికారి
హన్మకొండ అర్బన్ : హనుమకొండ జిల్లా పరిపాలనకు కేంద్ర బిందువుగా ఉన్న సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం (ఐడీఓసీ) నిర్వహణకు ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. 32 ప్రభు త్వ శాఖల కార్యాలయాలు ఒకే ప్రాంగణంలో కొనసాగుతుండగా.. పరిశుభ్రత, పచ్చదనం, విద్యుత్, నీటి సరఫరా, మరమ్మతులు, ఇతర మౌలిక వసతుల నిర్వహణకు నిరంతరం నిధులు వెచ్చించాల్సి వస్తోంది. కార్యాలయాలకు కేటాయించిన విస్తీర్ణం ఆధారంగా నిర్ణయించిన నిర్వహణ రుసుములు చెల్లించడం లేదు. ఇలా.. సుమారు రూ.కోటివరకు బకాయిలు పేరుకుపోయాయి. దీంతో నిర్వహణ బాధ్యతలు చూస్తున్న సిబ్బందికి ఆర్థికంగా ఇబ్బందులు ఎదురవుతున్నట్లు చెబుతున్నారు.
ఏడు ఎకరాల్లో ఐడీఓసీ..
32 కార్యాలయాలు
హనుమకొండ కలెక్టరేట్ సముదాయం మొత్తం 7 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. ఇందులో సుమారు 4 ఎకరాలు పచ్చదనం, అంతర్గత రహదారులకు కేటాయించగా.. మిగిలిన స్థలంలో కార్యాలయ భవనాలు ఉన్నాయి. మూడు అంతస్తుల భవనంలో 32 ప్రభుత్వ శాఖల కార్యాలయాలతోపాటు నాలుగు సమావేశ మందిరాలు ఉన్నాయి. కలెక్టరేట్‌లోని కార్యాలయాలు, పరిసరాల పరిశుభ్రత కోసం కాంట్రాక్టు పద్ధతిలో 15 మందితో హౌస్‌కీపింగ్ బృందాన్ని ఏర్పాటు చేశారు. వీఐపీ, వీవీఐపీ, సాధారణ సందర్శకుల కోసం కలిపి మొత్తం 18 మరుగుదొడ్లు ఉన్నాయి. వీటి శుభ్రత కోసం ప్రత్యేకంగా ముగ్గురు పారిశుద్ధ్య కార్మికులు పనిచేస్తున్నారు. ఇక.. అవసరమైన విద్యుత్, ఐటీ సహాయక సిబ్బంది కూడా అందుబాటులో ఉంటారు. వీరికి వేతనాలు కూడా నిర్వహణ ఖర్చులోనుంచి ఇవ్వాల్సి ఉంటుంది.
రూ.2లక్షలకుపైగా బకాయిలున్న శాఖల కార్యాలయాలు
మిగతా శాఖల కార్యాలయాలు రూ.లక్ష నుంచి రూ.2లక్షల వరకు బకాయిలున్నాయి.
అందరి సహకారంతో మరింత మెరుగైన సేవలు
ఇతర జిల్లాలతో పోలిస్తే మన ఐడీఓసీ నిర్వహణ తీరు మెరుగ్గా ఉందని, పలువురు ప్రశంసిస్తున్నారు. ఇది అందరి సహకారంతోనే సాధ్యమైంది. గార్డెనింగ్‌లోనూ ఎండల ప్రభావం మొక్కలపై పడకుండా డ్రిప్ ఇరిగేషన్ ద్వారా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం. అన్ని శాఖలు తమ నిర్వహణ రుసుములను సకాలంలో చెల్లించి సహకరిస్తే మరింత మెరుగైన సేవలు అందించేందుకు అవకాశం ఉంటుంది. – శ్యామ్, కలెక్టరేట్ నిర్వహణ అధికారి, డిప్యూటీ తహసీల్దార్
సకాలంలో నిర్వహణ చెల్లింపులు చేయాలి
కలెక్టరేట్ అన్ని ప్రభుత్వ కార్యాలయాలు నిబంధనల ప్రకారం నిర్వహణ ఖర్చులు చెల్లించాలి. పెద్ద మొత్తంలో బకాయిలు పేరుకుపోవడంతో కలెక్టరేట్ నిర్వహణ భారంగా మారుతోంది. అన్ని శాఖల అధికారులు ఈ విషయాన్ని గమనించి వారి వాటా చెల్లింపులను తక్షణమే పూర్తి చేయాలని స్పష్టం చేశాం. – ఎన్.రవి, అదనపు కలెక్టర్
ఖర్చులు ఇలా..
హౌస్‌కీపింగ్, పారిశుద్ధ్య నిర్వహణకు నెలకు రూ.1.50 లక్షలు, చిన్నచిన్న మరమ్మతులు, ప్లంబింగ్ తదితర పనులకు అదనంగా నెలకు రూ.10 వేల నుంచి రూ.20 వేల వరకు ఖర్చవుతోంది.
రెండు లిఫ్ట్‌ల నిర్వహణకు ఏడాదికి సుమారు రూ.1.50 లక్షలు వెచ్చిస్తున్నారు.
కలెక్టరేట్ ప్రాంగణంలో మొత్తం మూడు బోర్లు ఉన్నాయి. వీటి నుంచి మూడు మోటార్ల ద్వారా ఉదయం 7.30 నుంచి సాయంత్రం 7.30 గంటల వరకు అవసరమైన నీటిని పంపింగ్ చేస్తున్నారు. ఈ కరెంటు బిల్లు కూడా ఉంటుంది.
చదరపు అడుగుకు రూ.3..
కలెక్టరేట్‌లోని ప్రభుత్వ కార్యాలయాలకు కేటాయించిన విస్తీర్ణం ఆధారంగా చదరపు అడుగుకు రూ.3 చొప్పున నిర్వహణ రుసుము నిర్ణయించారు.
ఆయా శాఖలు తమకు కేటాయించిన మొత్తం కార్యాలయ విస్తీర్ణానికి అనుగుణంగా ఈ మొత్తాన్ని చెల్లించాలి.
ఈ ఖర్చులన్నీ నిర్వహణ నిధులపైనే ఆధారపడి ఉంటాయి.
32 శాఖలకు సంబంధించి సుమారు కోటి రూపాయల వరకు బకాయిలు పేరుకుపోయినట్లు తెలుస్తోంది. వీటి లో కొన్ని ఏడాదికాలంగా, మరికొన్ని కలెక్టరేట్ ప్రారంభంనుంచి నిర్వహణ రుసుములు చెల్లించడం లేదు.
తమ వాటా రుసుములను చెల్లిస్తేనే వసతుల కల్పనకు ఇబ్బంది ఉండదు.


