జిల్లా అదనపు కలెక్టర్ రవి
హన్మకొండ అర్బన్ : ప్రజావాణిలో ప్రజలనుంచి వచ్చిన అర్జీలను వేగవంతంగా పరిష్కరించాలని జిల్లా అదనపు కలెక్టర్ ఎన్.రవి.. సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. సోమవారం హనుమకొండ కలెక్టరేట్‌తోపాటు హనుమకొండ, పరకాల ఆర్డీఓ కార్యాలయాలు, ఎంపీడీఓ కార్యాలయాల్లో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. కలెక్టరేట్‌లో అదనపు కలెక్టర్ ఎన్.రవి ప్రజలనుంచి వివిధ సమస్యలపై అర్జీలను స్వీకరించారు. కలెక్టరేట్‌లో 39, ఆర్డీఓ కార్యాలయాల్లో 6, ఎంపీడీఓ కార్యాలయాల్లో 39 చొప్పున మొత్తం 84 అర్జీలు అందాయి. ఈ అర్జీలను సంబంధిత శాఖల అధికారులు పరిశీలించి త్వరితగతిన పరిష్కరించాలని అదనపు కలెక్టర్ రవి ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి శ్రీనివాస్, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి మేన శ్రీను, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.


