వృక్షాకారంలో దీపాలు వెలిగిస్తే చాలా మంచిది.. ● వ్యాపారులకు శ్రీమహాలక్ష్మీ పూజలు ప్రత్యేకం ● కిక్కిరిసిపోయిన నగర రహదారులు
దీపావళి పండుగ సామగ్రి కొనుగోలు చేయడానికి వచ్చిన ప్రజలతో కిక్కిరిసిన వరంగల్ జేపీఎన్ రోడ్డు
హన్మకొండ కల్చరల్: జ్ఞానజ్యోతి వెలిగించి కొత్త ఆశలను మోసుకొచ్చే ఆధ్యాత్మిక దీపావళి పర్వదినం నేడు.. దీపకాంతి జ్ఞానానికి ప్రతీక, అజ్ఞానమనే చీకటి నుంచి విజ్ఞానమనే వెలుగులోనికి పయనించి జీవితపరమార్థాన్ని తెలియజేసే దివ్వెల దీపావళి పండుగ ఉద్దేశం.. ఇంట్లోని ప్రతికూల శక్తులను తొలగించి.. నూతన వెలుగులను తీకువచ్చే గొప్ప పండుగ ... ఆశ్వయుజ బహుళ అమావాస్య రోజు నేడు ఆదివారం నగరప్రజలు దీపావళిపండుగ జరుపుకోనున్నారు.
వ్యాపారులకు
శ్రీమహాలక్ష్మీ పూజలు ప్రత్యేకం..
వ్యాపారులు ప్రతిఒక్కరూ ఈ రోజున వ్యాపారకేంద్రాన్ని శుభ్రంచేసి తోరణాలు కట్టి, బంతిపూలతో అలంకరించుకుంటారు. అష్టైశ్వర్యాలు ప్రసాదించే శ్రీమహాలక్ష్మీదేవికి భక్తిపూర్వకంగా పూజలు జరుపుకుంటారు. తమ జమాఖర్చుల లెక్కల పుస్తకాలను పూజిస్తారు. కొత్తగా జమఖర్చు పుస్తకాలను రాయడం ప్రారంభిస్తారు. ఒకప్పుడు పండుగ వచ్చిందంటే వరంగల్‌చౌరస్తా, హన్మకొండ చౌరస్తాలో వ్యాపారులు లక్ష్మీపూజలు నిర్వహించుకున్న అనంతరం రాత్రి 8గంటల నుండి బాణసంచా కాల్చేవారు.
కిక్కిరిసిపోయిన రహదారులు..
మట్టిప్రమిదలు, పింగాణి ప్రమిదలు, వివిధ అంతస్తుల ప్రమిదలు విక్రయాలతో, బాణసంచావిక్రయాలతో శనివారం నగరంలోని ప్రధాన రహదారులు కిక్కిరిసిపోయాయి. ఈ సందర్బంగా హన్మకొండలోని హంటర్‌రోడ్డు, వరంగల్‌చౌరస్తా, బట్టల బజార్ ప్రాంతాలలో వెలసిన బాణసంచా దుకాణాలలో జోరుగా కొనుగోళ్లు జరిగాయి. దీంతో పాటు కేదారేశ్వరవ్రతంలో ఉపయోగించే పట్టుదారాలు, మర్రిఊడలు, కొత్తచేటలు, ఊదు, బంతిపూలు, లక్ష్మీదేవిగా ప్రియమైన పద్మములు తదితర నోము సామగ్రి అమ్మకాలు జోరుగా జరిగాయి.


