చనిపోయిన వారి ఐడీలు తొలగించరా? | - | Sakshi
Sakshi News home page

చనిపోయిన వారి ఐడీలు తొలగించరా?

Nov 6 2026 2:32 AM | Updated on Nov 6 2026 2:32 AM

దుగ్గొండి: గ్రామాల్లో ఆసరా పింఛన్లు పొందుతున్న వారు చనిపోతే ఐడీలు ఎందుకు తొలగించడం లేదని పంచాయతీ కార్యదర్శులపై డీఆర్‌డీఓ నాగపద్మజ ఆగ్రహం వ్యక్తం చేశారు. చనిపోయిన వారి ఖాతాల్లో డబ్బులు జమ అవుతుంటే ఏం చేస్తున్నారంటూ మండిపడ్డారు. మండల పరిషత్‌ కార్యాలయంలో ఉపాధిహామీ పథకం పనులు, ఆసరా పింఛన్ల పంపిణీపై సామాజిక తనిఖీ బహిరంగ సభ గురువారం నిర్వహించారు. 31 మార్చి 2025 నుంచి 1 ఏప్రిల్‌ 2026 వరకు 34 గ్రామ పంచాయతీల పరిధిలో రూ.3 కోట్ల 57 లక్షల 52 వేల రూపాయల విలువైన పనులు చేపట్టారు. ఈ మేరకు వారం రోజులుగా సామాజిక కార్యకర్తలు గ్రామాల్లో పర్యటించి పనులు పరిశీలించారు. కూలీలతో మాట్లాడి తనిఖీలు చేశారు. జరిగిన పనుల్లో అవినీతి, అక్రమాలు, లోటుపాట్లను సభ ముందు ఉంచారు. దీంతో గ్రామాల వారీగా ఆడిట్‌ వివరాలను పీడీ నాగపద్మజ సమీక్షించారు.

పింఛన్లపై ఆడిట్‌..

మండలంలో 6,578 ఆసరా పింఛన్‌దారులు ఉన్నారు. 2,916 వృద్ధులు, 2053 మంది వితంతువులు, 1038 మంది దివ్యాంగులు, 215 మంది కల్లుగీత కార్మికులు, 63 మంది చేనేత కార్మికులు, 156 మంది ఒంటరి మహిళలు, 137 మంది బీడీ కార్మికులు నెలానెలా పింఛన్లు పొందుతున్నారు. వీటి పంపిణీపై ఆడిట్‌ నిర్వహించారు. గ్రామాల్లో చనిపోయిన వారి పేర్లను జాబితా నుంచి తొలగించడం లేదని ఆడిట్‌లో వెల్లడైంది. చనిపోయిన వారి కొందరి ఖాతాల్లో డబ్బులు జమ చేసినట్లు గుర్తించారు. మరోసారి అలా కాకుండా చనిపోయిన వారి ఐడీలు వెంటనే తొలగించాలని డీఆర్‌డీఓ ఆదేశించారు. ఎంపీడీఓ లెక్కల అరుంధతి, ఏపీఓ శ్రీని వాస్‌, ఎంపీఓ చంద్రమోహన్‌, ఎస్సార్పీ రవియాదవ్‌, ఈసీ రాజు తదితరులు పాల్గొన్నారు.

పంచాయతీ కార్యదర్శులపై

డీఆర్‌డీఓ నాగపద్మజ ఆగ్రహం

ఎంపీడీఓ కార్యాలయంలో

సామాజిక తనిఖీ బహిరంగ సభ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement