ఖానాపురం: పోలీస్ సిబ్బంది అంకితభావంతో పనిచేయాలని నర్సంపేట ఏసీపీ రవీందర్‌రెడ్డి అన్నారు. ఈ మేరకు మండల కేంద్రంలోని పోలీస్‌స్టేషన్‌ను గురువారం ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్టేషన్ పరిసరాలు, పలు కేసుల్లో పట్టుబడిన వాహనాలు, రికార్డులు, సిబ్బంది సామగ్రిని పరిశీలించారు. పోలీస్ సిబ్బందికి పలు సూచనలు చేశారు. ముందుగా మొక్కలు నాటారు. అనంతరం ఏసీపీ రవీందర్‌రెడ్డి మాట్లాడుతూ కేసుల నిమిత్తం పోలీస్‌స్టేషన్‌కు వచ్చే ఫిర్యాదుదారులతో మర్యాదగా ప్రవర్తించాలని, అసాంఘిక కార్యకలాపాలపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కేసుల వివరాలను ఎప్పటికప్పుడు ఆన్లైన్లో నమోదు చేయాలన్నారు. విధుల్లో నిర్లక్ష్యం చేస్తే ఉన్నతాధికారులకు తెలియజేసి కఠిన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. కార్యక్రమంలో నర్సంపేట రూరల్ సీఐ శంకర్రావు, ఎస్సై గుగులోత్ రామ్మోహన్, సిబ్బంది పాల్గొన్నారు.


