న్యూస్‌రీల్
శుక్రవారం శ్రీ 6 శ్రీ నవంబర్ శ్రీ 2026
జిల్లాలో యాసంగి ప్రణాళిక ఖరారు
● గతేడాదితో పోలిస్తే 91,906 ఎకరాల సాగు తగ్గింపు
● ఎల్‌నినో కరువు దృష్ట్యా విస్తీర్ణం తగ్గించిన వ్యవసాయ శాఖ
● రైతులకు అవగాహన కల్పిస్తున్న అధికారులు
● 61,151 ఎకరాల్లో సాగవ్వనున్న వరి
హన్మకొండ: ఎల్‌నినో ప్రభావం, వర్షాభావ పరిస్థితులు, భూగర్భ జలాలు పడిపోవడం, కరువు పరిస్థితుల నేపథ్యంలో.. వ్యవసాయ శాఖ సాగు విస్తీర్ణాన్ని భారీగా తగ్గించింది. మరోవైపు విద్యుత్ కోతలు ఉండొచ్చనే భావన కూడా సాగు తగ్గుతుందనే అంచనాకు వ్యవసాయ శాఖ అధికారులు వచ్చారు. గతేడాదితో పోలిస్తే ఈ సారి సాగు విస్తీర్ణం తగ్గుతుందని అంచనాలకు వచ్చారు. హనుమకొండ జిల్లాలో సగటున 2025 అక్టోబర్‌లో 3.19 మీటర్ల లోతులో ఉండగా.. 2026 అక్టోబర్ మాసాంతానికి 5,74 మీటర్ల లోతుకు పడిపోయాయి. గతేడాదితో పోలిస్తే 2.55 మీటర్ల లోతుకు జలమట్టం పడిపోయింది. జిల్లాలో 41 శాతం వర్షపాతం లోటు ఉంది. అన్ని మండలాల్లో వర్షపాతం లోటు ఉంది.
కరువు ప్రాంతాలుగా 14 మండలాలు
జిల్లాలోని 14 మండలాలను కరువు ప్రాంతాలుగా ప్రభుత్వం ప్రకటించింది. ఈక్రమంలో సాగు విస్తీర్ణం గణనీయంగా పడిపోయే అవకాశముందని అధికారులు అంచనాకు వచ్చారు. దీంతో.. ఈ యాసంగిలో అన్ని పంటలు కలిపి 1,42,916 ఎకరాల్లో సాగు చేస్తారని అంచనా. గతేడాది యాసంగిలో అన్ని పంటలు కలిపి 2,34,822 ఎకరాల్లో సాగు చేశారు. గతేడాదితో పోలిస్తే 91,906 ఎకరాల్లో సాగు విస్తీర్ణం తగ్గనుంది. ఈ ఏడాది వానాకాలంలో సాధారణ సాగు విస్తీర్ణం 2,38,964 ఎకరాలు కాగా, 2,13,435 ఎకరాల్లో సాగు చేశారు. వానాకాలంలో 89 శాతం మాత్రమే సాగైంది. గతేడాది యాసంగితో పోలిస్తే ఈ వానాకాలంలో 21,387 ఎకరాలు సాగు విస్తీర్ణం తగ్గింది. ఈ క్రమంలో యాసంగిలో సాగు విస్తీర్ణం తగ్గుతుందని అంచనా.
తగ్గనున్న వరి సాగు
ప్రధాన పంట వరి యాసంగిలో 61,151 ఎకరాల్లో సాగవుతుందని అంచనా. గతేడాది యాసంగిలో 1,45,730 ఎకరాల్లో సాగు చేశారు. గతేడాదితో పోలిస్తే ఈ యాసంగిలో 84,579 ఎకరాల సాగు తగ్గుతుందని అంచనా. మొక్కజొన్న 71,677 ఎకరాల్లో సాగవుతుందని అంచనా వేయగా.. గతేడాది యాసంగిలో 87,571 సాగు చేశారు. గతేడాదితో పోలిస్తే 15,894 ఎకరాల్లో సాగు తగ్గుతుందని అధికారులు భావించారు. పప్పు దినుసులు, నూనె గింజల పంటల సాగు విస్తీర్ణం పెరుగుతుందని అధికారులు నిర్ణయానికి వచ్చారు. సాగు నీటికి కొరత రావొచ్చని, ఈక్రమంలో వరి సాగు చేసి నష్టపోవద్దని అధికారులు రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. ఇందుకు అనుగుణంగా మినుములు, పెసర, వేరుశనగ, మొక్కజొన్న విత్తనాలు రాయితీపై అందిస్తున్నారు. జిల్లాలో వేరు శనగ విత్తనాలు 160 క్వింటాళ్లు పంపిణీ చేశారు. కిలో ధర రూ.125 కాగా, 50 శాతం రాయితీపై రైతులకు అందించారు. మినుములు 4 క్వింటాళ్లు పంపిణీ చేశారు. దీని కిలో ధర రూ.145 కాగా, రూ.125 రాయితీ అందించారు. పెసర 15 క్వింటాళ్లు పంపిణీ చేశారు. దీని ధర కిలో రూ.145 కాగా, రూ.120 రాయితీ అందించారు. శనగ విత్తనాలు 138 క్వింటాళ్లు పంపిణీ చేశారు. వీటి కిలో ధర రూ.87 కాగా, రూ.60 రాయితీపై అందించారు. మొక్కజొన్న 26 క్వింటాళ్లు పంపిణీ చేశారు. వీటి కిలో ధర రూ.190 కాగా, రూ.95 రాయితీ అందించారు.


