రాష్ట్రీయ ఏక్తాదివస్‌కు వెళ్లిన వరంగల్‌ వాసులు | - | Sakshi
Sakshi News home page

రాష్ట్రీయ ఏక్తాదివస్‌కు వెళ్లిన వరంగల్‌ వాసులు

Oct 31 2026 8:19 AM | Updated on Oct 31 2026 8:19 AM

న్యూశాయంపేట: సర్దార్‌ వల్లబ్‌భాయ్‌ పటేల్‌ జయంతిని పురస్కరించుకుని గుజరాత్‌లోని ఏక్తానగర్‌ (స్టాచ్యూ ఆఫ్‌ యూనిటీ) వద్ద రా ష్ట్రీయ ఏక్తా దివస్‌ –2026 వేడుకలు శనివారం జరగనున్నాయి. ఈ వేడుకల్లో పాల్గొనేందుకు జిల్లా నుంచి ఐదుగురు ఎంపికయ్యారు. వరంగల్‌ రెడ్డిపాలెం ప్రాంతానికి చెందిన విద్యార్థి నాగపురి శ్రీజ, రంగశాయిపేటకు చెందిన కొడిపాక సంధ్యారాణి (ఎంటర్‌ప్రెన్యూర్‌), ఎన్‌టీఈపీ ప్రోగాం అధికారి వరంగల్‌ డాక్టర్‌ అరుణ్‌కుమార్‌ జోషి, దుగ్గొండి మండలం బిక్కాజిపల్లి సర్పంచ్‌ బండారి రమేష్‌, సాధారణ మహిళ బండారి శ్రీకళ (శంభునిపేట) ఎంపికై నట్లు వరంగల్‌ జిల్లా నోడల్‌ ఆఫీసర్‌ డిప్యూటీ ఎస్‌ఓ అనిల్‌కుమార్‌ తెలిపారు.

పీఎం కిసాన్‌ నిధులను వినియోగించుకోవాలి

గీసుగొండ: ప్రధానమంత్రి కిసాన్‌ సమ్మాన్‌ నిధి 24వ విడత నిధులను రైతులు వినియోగించుకోవాలని జిల్లా వ్యవసాయ అధికారి విజయభాస్కర్‌ సూచించారు. మండలంలోని కొనాయమాకుల, శాయంపేట హవేలి రైతు వేదికల్లో శుక్రవారం నిర్వహించిన పీఎం కిసాన్‌ ఉత్సవ్‌ దివస్‌ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. నిధుల జమలో ఏవైనా సమస్యలు ఎదురైతే స్థానిక వ్యవసాయ విస్తరణ అధికారులను సంప్రదించాలని సూచించారు. అనంతరం నిర్వహించిన ఖేత్‌ బచావో అభియాన్‌ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి హరి ప్రసాద్‌ మాట్లాడుతూ.. ఎల్‌నినో ప్రభా వంతో యాసంగిలో నీరు, విద్యుత్‌ సమస్యలు తలెత్తే అవకాశం ఉన్నందున మొక్కజొన్న సాగును తగ్గించాలని రైతులకు సూచించారు. తక్కువ కాలపరిమితి, తక్కువ నీటి అవసరం ఉన్న కూరగాయలు, పప్పు దినుసులు, నూనెగింజల పంటలను సాగు చేయాలన్నారు. పంట వ్యర్థాలను కాల్చవద్దని, జలవనరులను పొదుపుగా వినియోగించుకోవాలని కోరారు. కార్యక్రమం వరంగల్‌ ఏఓ రవీందర్‌, డీసీఓ ఆఫీస్‌ సీనియర్‌ ఇన్‌స్పెక్టర్లు మంద శ్రీనివాస్‌, కనకదుర్గ, తంమిశెట్టి శ్రీనివాస్‌, ఏఈఓలు భరత్‌, రాజేష్‌ పాల్గొన్నారు.

బోట్‌ ఎస్‌ఆర్‌ ఒప్పందం చరిత్రాత్మకం

నర్సంపేట: పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థుల ఉపాధి, నైపుణ్యాభివృద్ధికి సరికొత్త బాటలు వేస్తూ భారత ప్రభుత్వ విద్యా మంత్రిత్వశాఖకు చెందిన బోర్డ్‌ ఆఫ్‌ అప్రెంటిస్‌షిప్‌ ట్రైనింగ్‌, దక్షిణ మండలం చైన్నె (బోట్‌ ఎస్‌ఆర్‌)తో అవగాహన ఒప్పందం కుదరడం చరిత్రాత్మకమని ప్రిన్సిపాల్‌ మల్లం నవీన్‌ అన్నారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. కళాశాలలో ప్రవేశపెట్టిన ఏఈడీపీ కోర్సులైన బీఎస్సీ హెల్త్‌ కేర్‌, బీకాం బీఎఫ్‌ఎస్‌ఐ విద్యార్థులకు క్షేత్రస్థాయిలో అప్రెంటిస్‌ షిప్‌ శిక్షణ అందించేందుకు ఈ ఒప్పందం ఎంతగానో దోహదపడుతుందని అన్నారు. కార్యక్రమంలో బోట్‌ ఎస్‌ఆర్‌ డైరెక్టర్‌ విజయశంకర్‌పాండే, ప్రొఫెసర్‌ రాజేంద్రప్రసాద్‌, అకాడమిక్‌ ఆఫీసర్‌ శ్రీచంద్రశేఖర్‌, బీఎస్సీ హెల్త్‌ కేర్‌ కో ఆర్డినేటర్‌ రాంబాబు, బీకామ్‌ బీఎఫ్‌ఎస్‌ఐ కో ఆర్డినేటర్‌ డాక్టర్‌ సోమయ్య, తదితరులు పాల్గొన్నారు.

కేయూలో తైక్వాండో జట్ల ఎంపికలు

కేయూ క్యాంపస్‌: కేయూ పరిధి ఉమ్మడి వరంగల్‌, ఖమ్మం, ఆదిలాబాద్‌ జిల్లాల నుంచి వివిధ కళాశాలల విద్యార్థులకు అంతర్‌ కళాశాలల తైక్వాండో పోటీలను శుక్రవారం కేయూలోని ఇండోర్‌ స్టేడియంలో నిర్వహించారు. స్పోర్ట్స్‌ బోర్డ్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ పోటీల్లో పురుషుల విభాగంలో ఆరుగురు, మహిళల విభాగం నుంచి నలుగురు క్రీడాకారులను ఎంపిక చేశారు. పురుషుల జట్టును రాజస్థాన్‌లోని జైపూర్‌లో గ్లోబల్‌ యూనివర్సిటీలో నిర్వహించనున్న ఆలిండియా ఇంటర్‌ యూనివర్సిటీ పోటీలకు ఎంపిక చేసినట్లు కేయూ స్పోర్ట్స్‌ బోర్డు సెక్రటరీ డాక్టర్‌ టి.శాస్త్రి, ఇన్‌చార్జ్‌ డాక్టర్‌ కుమార్‌ తెలిపారు. మహిళల జట్టు ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలో ఉన్న శారదా యూనివర్సిటీలో నిర్వహించనున్న ఆలిండి యా ఇంటర్‌ యూనివర్సిటీ తైక్వాండో పోటీల్లో పాల్గొంటుందని వారు పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement