● డాక్టర్ శ్రావణ్‌కుమార్
సంగెం : పంటలకు ఆశించిన తెగుళ్లు, పురుగుల ఉధృతిని సకాలంలో గుర్తించి సమగ్ర సస్యరక్షణ చర్యలు చేపడితేనే అధిక దిగుబడులు సాధించవచ్చని వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం, రైతు విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ ఆర్.శ్రావణ్‌కుమార్ అన్నారు. శుక్రవారం మండలంలోని తీగరాజుపల్లిలో స్థానిక వ్యవసాయాధికారులతో కలిసి పత్తి, వరి, పసుపు, కూరగాయల పంటలను సందర్శించి పంటల్లో తెగుళ్లు, పురుగుల ఉధృతిని పరిశీలించి సూచనలు, సలహాలు ఇచ్చారు. పత్తి పంటను యాసంగి సీజన్ వరకు పొడిగించకుండా సకాలంలో తొలగించాలని లేకుంటే గులాబీరంగు పురుగు వల్ల తీవ్ర నష్టం వాటిల్లుతుందన్నారు. వరిలో పొట్టదశ, గింజ నిండె దశలో గింజ మచ్చతెగులు, కంకినల్లి ఉధృతి ఉందని నివారణకు టెబ్యుకోనజోల్+ట్రైప్లాక్సిస్ట్రోబిన్ కలిగిన మందును ఎకరానికి 80 గ్రాముల చొప్పున పిచికారీ చేయాలని సూచించారు. పసుపులో దుంపకుళ్లు, పుచ్చు నివారణకు మొక్కల మొదళ్ల వద్ద వర్షపు నీరు నిలువ ఉండచూడాలన్నారు. మెటలాక్సిల్+మాంకోజెబ్ కలిగిన శిలీంద్రనాశక మందును ఉపయోగించాలన్నారు. పోటా షియం లోప నివారణకు 13–0–45 నీటిలో కరిగే ఎరువును లీటరు నీటికి 5 గ్రాముల చొప్పున కలిపి ఆకులపై పడేటట్లు పిచికారీ చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో శాస్త్రవేత్తలు డాక్టర్ రాజ్‌కుమార్, సౌందర్య, మానస, ఆత్మ ప్రాజెక్టు డైరెక్టర్ విజయ నిర్మల, ఏడీఏ నర్సింగం, ఏఓ జగదీశ్వర్, ఏఈఓ సరిత, సర్పంచ్ కర్జుగుత్త గోపాల్, రైతులు పాల్గొన్నారు.


