సబ్‌ స్టేషన్‌లో మద్యం సేవించడంపై విచారణ | - | Sakshi
Sakshi News home page

సబ్‌ స్టేషన్‌లో మద్యం సేవించడంపై విచారణ

Oct 31 2026 8:19 AM | Updated on Oct 31 2026 8:19 AM

హన్మకొండ: వరంగల్‌ సర్కిల్‌ ఖానాపురం మండలం మంగళవారిపేటలో విధి నిర్వహణలో ఉండగానే లైన్‌ ఇన్‌స్పెక్టర్‌ రాజు మద్యం సేవించిన ఘటనను టీజీ ఎన్పీడీసీఎల్‌ యాజమాన్యం సీరియస్‌గా తీసుకుంది. దీనిపై విజిలెన్స్‌ విభాగం అధికారులు విచారణ చేపట్టారు. గురువారం ఈ ఘటన జరగగా సమాచారం తెలిసిన వెంటనే విజిలెన్స్‌ అధికారులు మంగళవారిపేట సబ్‌ స్టేషన్‌కు చేరుకుని పూర్తిస్థాయిలో విచారించారు. రాజు ఒక్కడే మద్యం సేవించాడా.. ఇంకా ఎవరితోనైనా కలిసి విందు చేసుకున్నాడా ? అనే కోణంలో విచారణ సాగిస్తున్నట్లు సమాచారం. ఆపరేషన్‌ అండ్‌ మెయింటెనెన్స్‌ విభాగంలో సిబ్బంది మద్యం సేవించి విధులకు హాజరు కావడం పరిపాటిగా మారిందనే ఆరోపణలున్నాయి. గతంలో ఎల్కతుర్తి విద్యుత్‌ సబ్‌ స్టేషన్‌ ఆపరేటర్‌గా విధులు నిర్వహిస్తున్న లైన్‌మెన్‌ మద్యం సేవించి విధులు నిర్వహిస్తుండగా అధికారులు గుర్తించి చర్యలు తీసుకున్నారు.

నిత్యం డుమ్మా..!

మంగళవారిపేట సబ్‌ స్టేషన్‌లో మద్యం సేవించి స్థానికులకు దొరికిన లైన్‌ ఇన్‌స్పెక్టర్‌ గతంలో చెప్పాపెట్టకుండా విధులకు ఎగనామం పెట్టినా.. అధికారులు చూసీచూడనట్లు వ్యవహరించారనే ఆరోపణలున్నాయి. 2021 నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి వరకు దశల వారీగా అతను 218 రోజులు విధులకు డుమ్మా కొట్టినా ఏ ఒక్క అధికారి చర్యలు తీసుకోలేదు. సర్వీస్‌ రూల్స్‌ ప్రకారం విధులకు అనధికారికంగా గైరాజరైన ప్రతీ స్పెల్‌ (దశ)కు నోటీసు ఇచ్చి సంజాయిషీ కోరడంతోపాటు క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలి. ఐదేళ్ల కాలంలో 11 స్పెల్స్‌ (దశల వారీగా) గైరాజరీ అయినా ఒక్కసారి కూడా ఈ లైన్‌ ఇన్‌స్పెక్టర్‌పై చర్యలు తీసుకోలేదు. ఐదేళ్లుగా ఉపేక్షించిన ఎన్పీడీసీఎల్‌ అధికారులు అనధికారికంగా గైరాజరైన 218 రోజుల కాలానికి ఈ ఏడాది మే30న ఒకసారి మైనర్‌ పనిష్మెంట్‌ ఎందుకు ఇవ్వకూడదో కోరుతూ షోకాజ్‌ నోటీసు జారీ చేశారు. మూడు రోజులకే వితవుట్‌ ఇంక్రిమెంట్‌ నిలుపుదల చేస్తూ క్రమశిక్షణ చర్యలు తీసుకున్నారు. దీనిపై అతను సర్కిల్‌ కార్యాలయానికి అప్పీలుకు వెళ్లగా విధులకు డుమ్మా కొట్టడాన్ని హెచ్చరిస్తూ వితవుట్‌ ఇంక్రిమెంట్‌ రద్దు చేస్తూ ఎస్‌ఈ ఉత్తర్వులు ఇచ్చినట్లు సమాచారం. విధులకు గైరాజరైన మొదటిసారి చర్యలు తీసుకుంటే పరిస్థితి ఇంత దూరం వచ్చేది కాదని విద్యుత్‌ ఉద్యోగులు చర్చించుకుంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement