హసన్‌పర్తి: అమర వీరుల సంస్మరణ వారోత్సవాల సందర్భంగా అమరులను స్మరిస్తూ మంగళవారం వరంగల్ పోలీస్ కమిషనరేట్ నుంచి సైకిల్ ర్యాలీ నిర్వహించారు. సీపీ శ్వేత, హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్, ఎన్‌పీడీసీఎల్ సీఎండీ వరుణ్‌రెడ్డి, డీసీపీ దార కవితలతోపాటు అధికారులు ర్యాలీలో పాల్గొని అమరులకు నివాళులర్పించారు. ప్రజల భద్రతకోసం ప్రాణాలు అర్పించిన పోలీస్ అమరుల సేవలు వెలకట్టలేమన్నారు. ఈ ర్యాలీ వారికి అంకితమన్నారు. ర్యాలీలో పాల్గొన్న నగరానికి చెందిన 89 ఏళ్ల నర్సయ్య అనే వృద్ధుడిని సీపీ అభినందించారు. కార్యక్రమంలో డీసీపీలు వి.శ్రీనివాస్, సురేష్, అంకిత్‌కుమార్, ఏసీపీ నర్సింహారావు, మడికొండ సీఐ పుల్యాల కిషన్ తదితరులు పాల్గొన్నారు.
రేపు జిల్లాస్థాయి
కబడ్డీ పోటీలు
కాళోజీ సెంటర్: జిల్లాలోని 14 పీఎంశ్రీ పాఠశాలల విద్యార్థులకు ఈనెల 29న ఓసిటీలో జిల్లాస్థాయి కబడ్డీ పోటీలు నిర్వహించనున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి ప్రశాంత్ రెడ్డి తెలిపారు. ఈ పోటీల్లో ప్రతిభ కనబర్చిన బాలబాలికలు నవంబర్ 5, 6వ తేదీల్లో నిర్వహించే రాష్ట్రస్థాయి పోటీల్లో ఆడనున్నట్లు పేర్కొన్నారు. ప్రతీ పీఎంశ్రీ పాఠశాల నుంచి ఒక గైడ్ టీచర్ తప్పనిసరిగా హాజరు కావాలని ఆయన సూచించారు.
మక్కలు @ రూ.3 వేలు
నర్సంపేట: గత సంవత్సరం రూ.1,500 నుంచి రూ.1,800 వరకు ధర పలికిన మొక్కజొన్న ఈ సంవత్సరం రూ.3 వేల మార్కు దాటింది. దీంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్ యార్డులో మంగళవారం క్వింటా మొక్కజొన్నకు ఏకంగా రూ.3,021 ధర పలికింది. సోమవారం నల్లబెల్లి మండలం గొల్లపల్లి గ్రామానికి చెందిన రైతు గూని నాగరాజుకు చెందిన 150 బస్తాల మొక్కజొన్న క్వింటాకు రూ.2,945 ధర వచ్చింది. కాగా, గత సంవత్సరంతో పోలిస్తే దాదాపు రెట్టింపు ధర రావడంతో అన్నదాతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
గ్రంథాలయానికి
పూర్వవైభవం తెస్తాం..
రాయపర్తి: అక్షర జ్యోతులు వెలిగించే గ్రంథాలయాల పరిరక్షణే తమ లక్ష్యమని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మీసాల ప్రకాశ్ అన్నారు. మండల కేంద్రంలోని గ్రంథాలయాన్ని మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా పాఠకుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ త్వరలోనే నూతన భవన నిర్మాణం చేపట్టనున్నట్లు హామీ ఇచ్చారు. అలాగే, ప్రస్తుత భవనానికి మరమ్మతులు చేయించి రంగులను వేయించనున్నట్లు చెప్పారు. గ్రంథాలయాలు కేవలం పుస్తకాల నిలయాలు మాత్రమే కాదని, విద్యార్థుల భవిష్యత్‌కు మార్గదర్శకాలని పేర్కొన్నారు. ప్రతిఒక్కరూ గ్రంథాలయాలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ కార్యదర్శి బుగ్గారెడ్డి, గ్రేడ్ –1 అధికారి అర్జున్, గ్రేడ్ –2 నర్సంపేట లైబ్రేరియన్ అమీనా నాయక్, గీసుగొండ లైబ్రేరియన్ చిన్నబాబు, సర్పంచ్ గారె సహేంద్రభిక్షపతి, ఉప సర్పంచ్ మచ్చ రమేష్, కారోబార్ రామచంద్రయ్య, పాఠకులు రావుల అనిల్, రాజు పాల్గొన్నారు.
తెల్లకోటు..
సేవాభావానికి ప్రతీక
కాశిబుగ్గ: తెల్లకోటు సేవాభావం, క్రమశిక్షణ, నైతిక విలువలు, మానవతా దృక్పథానికి ప్రతీక అని, రోగుల పట్ల సేవాభావం కలిగి ఉండాలని కాళోజీ నారాయణరావు ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం వైస్ చాన్స్‌లర్ డాక్టర్ రమేశ్‌రెడ్డి అన్నారు. మంగళవారం హనుమకొండలోని కాకతీయ వైద్య కశాశాలలో 2026–2027 విద్యాసంవత్సరం ఎంబీబీఎస్ ఫస్టియర్ విద్యార్థుల కోసం వైట్‌కోటు వేడుకలు ఘనంగా నిర్వహించారు. కేఎంసీ ప్రిన్సిపాల్ డాక్టర్ దివ్వెల మోహన్‌దాసు అధ్యక్షతన జరిగిన సమావేశంలో వీసీ మాట్లాడారు. ర్యాగింగ్‌ను పూర్తిగా నివారించాలన్నారు. ఉత్తమ వైద్యులుగా ఎదగాలని వీసీ సూచించారు.


