పర్వతగిరి: మండలంలోని దౌలత్‌నగర్, ఉట్టితండా అంగన్‌వాడీ కేంద్రాలను కలెక్టర్ సత్యశారద బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. అంగన్‌వాడీ కేంద్రాల్లో పరిశుభ్రత, రికార్డుల నిర్వహణ సరిగా లేకపోవడంతో టీచర్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. చిన్నారులకు యూనిఫాం తప్పనిసరిగా ఉండేలా చూడాలని, మెనూ ప్రకారం నాణ్యమైన పౌష్టికాహారం అందించాలని, పరిసరాలు పరిశుభ్రత ఉండేలా ఆయాలు చూడాలని ఆదేశించారు. రికార్డులను సక్రమంగా నిర్వహించని టీచర్లకు, కేంద్రాలను తనిఖీ చేయని అంగన్‌వాడీ సూపర్‌వైజర్లకు షోకాజ్ నోటీసులు జారీ చేయాలని జిల్లా సంక్షేమ అధికారిని ఆదేశించారు. ఉట్టితండాలోని బుద్ధి మాంధ్యంతో ఉన్న పిల్లలను జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్యశారద పలకరించి వారిని భవిత సెంటర్లకు పంపించాలని డీడబ్ల్యూఓకు సూచించారు. కలెక్టర్ వెంట డీఆర్‌డీఓ నాగపద్మజ, జిల్లా సంక్షేమ అధికారి నాగమణి, తహసీల్దార్ వెంకటస్వామి, ఎంపీడీఓ తదితరులు పాల్గొన్నారు.
మార్కెట్ యార్డుల పరిశీలన..
కొంకపాక, పర్వతగిరి మార్కెట్ యార్డులను కలెక్టర్ సందర్శించారు. వీఓల సభ్యులతో కలిసి ఆర్గానిక్ పప్పు దినుసులు, మిల్లెట్స్ మిల్లుతోపాటు అరటి, మోదుగు ఆకులతో విస్తర్ల ప్లాంట్ ఏర్పాటుకు అనువైన స్థలాలను పరిశీలించారు. కంది, ఇతర పప్పుదినుసుల మిల్లును ఏర్పాటు చేయడం ద్వారా స్థానికంగా పంటలకు విలువ జోడించడంతో పాటు మహిళా సంఘాల సభ్యులకు ఉపాధి, ఆదాయ అవకాశాలు కల్పించే అంశంపై అధికారులతో చర్చించారు. మిల్లు ఏర్పాటుకు అవసరమైన స్థలం, వీఓ బిల్డింగ్‌కు స్థల పరిశీలన, మౌలిక వసతులు తదితర అంశాలను పరిశీలించారు.
నాణ్యమైన ఆహారం అందించాలి..
న్యూశాయంపేట: గురుకుల పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాల్లో నాణ్యమైన ఆహారం అందించాలని కలెక్టర్ డాక్టర్ సత్యశారద అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో ఆహార భద్రతపై బుధవారం నిర్వహించిన జిల్లాస్థాయి సలహా కమిటీ(డీఎల్‌ఏసీ) సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. చిన్నారులకు, విద్యార్థులకు అందించే ఆహార నాణ్యత, ఆహార భద్రతపై ప్రత్యేక దృష్టిసారించాలని అధి కారులను ఆదేశించారు. అదనపు కలెక్టర్లు ఎల్.కిశోర్‌కుమార్, వైవీ గణేశ్, జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారి కృష్ణమూర్తి, డీఎంహెచ్‌ఓ రాజారెడ్డి ఉన్నారు.
మహిళా సంఘాలకు ఉపాధి అవకాశాలు
కాళోజీ సెంటర్: మహిళా సంఘాల ఆర్థికాభివృద్ధికి ఉపాధి అవకాశాలు కల్పించాలని కలెక్టర్ డాక్టర్ సత్యశారద సూచించారు. డీఆర్‌డీఏ సమావేశ మందిరంలో రాణి రుద్రమదేవి జిల్లా సమాఖ్య 12వ వార్షికోత్సవంలో కలెక్టర్ సత్యశారద మాట్లాడారు. జిల్లాలోని 11 మండలాల్లో మహిళా సంఘాల ఆధ్వర్యంలో మొబైల్ సూపర్ మార్కెట్లు, జిరాక్స్ కేంద్రాలు, మిల్లెట్ ప్రాసెసింగ్ యూనిట్లు, పప్పు మిల్లులు ఏర్పాటు చేయాలని సూచించారు. జిల్లా సమాఖ్య అధ్యక్షురాలు రజిత, కార్యదర్శి ఉమ, కోశాధికారి స్వప్న, అదనపు డీఆర్‌డీఓ శ్రీనివాస్, డీపీఎం అనిల్‌కుమార్, ఏపీఎంలు, పాలకవర్గ సభ్యులు పాల్గొన్నారు.
పరిశుభ్రత, రికార్డుల నిర్వహణ
సరిగా లేకపోవడంతో ఆగ్రహం
టీచర్లు, సూపర్‌వైజర్లకు నోటీసులు
ఇవ్వాలని డీడబ్ల్యూఓకు ఆదేశం


