గీసుకొండ: మండలంలోని ఊకల్ హవేలీలోని సుప్రసిద్ధ నాగేంద్రస్వామి దేవాలయంలోని నాగ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని జిల్లా ప్రధాన న్యాయమూర్తి నిర్మలా గీతాంబ మంగళవారం దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ ప్రధాన అర్చకుడు సముద్రాల సుదర్శనచార్యులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం న్యాయమూర్తికి స్వామి వారి శేష వస్త్రాలు, తీర్థప్రసాదాలు అందించారు. ఈ కార్యక్రమంలో గీసుకొండ సీఐ విశ్వేశ్వర్, ఆలయ చైర్మన్ రాజేశ్వర్‌రావు, రాజేందర్, సర్పంచ్ సుభాష్, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
కేటీఆర్‌ను కలిసిన పెద్ది స్వప్న
నర్సంపేట: బీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో మంగళవారం మాజీ జెడ్పీ ఫ్లోర్ లీడర్ పెద్ది స్వప్నసుదర్శన్‌రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పెద్ది స్వప్న కుటుంబ యోగ క్షేమాలు, పిల్లల చదువుల గురించి కేటీఆర్ అడిగి తెలుసుకున్నారు. అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ నియోజకవర్గంలోని ముఖ్య నాయకులతో త్వరలోనే సమావేశం ఏర్పాటు చేసి నియోజకవర్గ పరిస్థితులపై సమీక్ష నిర్వహిస్తామన్నారు.
కార్మికుల హక్కులను హరిస్తున్న ప్రభుత్వాలు
నర్సంపేట: భవన నిర్మాణ కార్మికులు ఎన్నో పోరాటాల ఫలితంగా సాధించుకున్న 1996 చట్టం హక్కులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు హరిస్తున్నాయని బీఆర్‌టీయూ భవన, ఇతర నిర్మాణ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగుల రమేష్, బీఆర్‌టీయూ జిల్లా అధ్యక్షుడు గోనె యువరాజు ఆరోపించారు. ఈ మేరకు పట్టణంలోని బీఆర్‌టీయూ కార్యాలయంలో మంగళవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిర్మాణ కార్మికులకు అందిస్తున్న సంక్షే మ పథకాలను ప్రైవేటు ఇన్సూరెన్స్ కంపెనీల కు అప్పజెప్పి రూ.446 కోట్లు దారి మళ్లించారని ఆరోపించారు. నేడు హైదరాబాద్ తెల ంగాణ భవన్‌లో జరుగబోయే భవన నిర్మాణ కార్మిక సంఘం రాష్ట్ర స్థాయి సదస్సును జ యప్రదం చేయాలని కోరారు. ఈ సమావేశంలో రాష్ట్ర కమిటీ సభ్యులు కొల్లూరి లక్ష్మి నారా యణ, భవన నిర్మాణ కార్మికులు ఓరిగంటికు మారస్వామి, కృష్ణ పస్తం, నేరెళ్ల బిక్షం, కొరబోయి న కుమారస్వామి, తదితరులు పాల్గొన్నారు.
విద్యార్థులు పట్టుదలతో చదువుకోవాలి
ఖానాపురం: విద్యార్థులు పట్టుదలతో చదువుకోవాలని జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖాధికారి శ్రీధర్ సుమన్ అన్నారు. ఈ మేరకు మండలకేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఫ్రెషర్స్ డే వేడుకలను మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 430 జూనియర్ కళాశాలల్లో ప్రస్తుత విద్యాసంవత్సరం నుంచి ఏకరూప దుస్తువుల పంపిణీ చేస్తున్నామన్నారు. జిల్లాలోని రెండు జూనియర్ కళాశాలల్లో ఇప్పటికే పంపిణీ చేశామన్నారు. విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో సర్పంచ్ దాసరి రమేష్, ఇన్‌చార్జ్ ప్రిన్సిపాల్ సదానందం, ఏఏపీసీ చైర్మన్ మమత, లైబ్రేరియన్ సుధీర్‌కుమార్, ఎన్‌ఎస్‌ఎస్ పీఓ పరా చికపు సదానందం తదితరులు పాల్గొన్నారు.
నిట్‌లో ‘కాన్‌క్లేవ్–26’
కాజీపేట అర్బన్: నిట్ పూర్వ విద్యార్థులు డిసెంబర్ 19, 20వ తేదీల్లో గ్లోబల్ ఎంట్రీపెన్యూర్‌షిప్ కాన్‌క్లేవ్–26ను నిర్వహించనున్నారు. నూతన ఐడియాలకు ఆవిష్కరణ రూపం, స్టార్టప్ కల్చర్ కల్పించే వేదికగా నిలవనున్న కాన్‌క్లేవ్‌లో నిట్ పూర్వ విద్యార్థులు, పారిశ్రామిక వేత్తలు, పెట్టుబడిదారులు తదితరులు పాల్గొననున్నట్లు సమాచారం. ఔత్సాహికులు కాన్‌క్లేవ్‌లో పాల్గొనేందుకు డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ. ఎన్‌ఐటీ డబ్ల్యూజీఈసీ.కామ్‌ను సంప్రదించాలని నిర్వాహకులు సూచించారు.


