వర్ధన్నపేట: రోడ్డు ప్రమాదాల నివారణకు అధికారులు చర్యలు చేపట్టాలని పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత పోలీస్ అధికారులను ఆదేశించారు. మంగళవారం వర్ధన్నపేట మున్సిపల్ పరిధిలో జాతీయ రహదారిపై పలు ప్రాంతాల్లో జరుగుతున్న రోడ్డు ప్రమాదాల ప్రాంతాలను మున్సిపల్ చైర్మన్ పాలకుర్తి సారంగపాణితో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా పోలీస్ అధికారులు జాతీయ రహదారికి ఇరువైపుల రోడ్లు మార్జిన్‌లను ఆక్రమించి నిర్మించిన గృహాలు, దుకాణాలు, షెడ్లు, ఇతర కట్టడాలతో వాహనాల రాకపోకలకు అంతరాయం కలుగుతుందని సీపీ దృష్టికి తీసుకొచ్చారు. అనంతరం సీపీ శ్వేత మాట్లాడుతూ రోడ్డు భద్రతకు ప్రతిఒక్కరూ సహకరించాలని, ప్రజలు స్వచ్ఛందంగా రహదారులను ఆక్రమించిన నిర్మాణాలను తొలగించి ట్రాఫిక్ అంతరాయం కలగకుండా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో నేషనల్ హైవే అధికారులు, పోలీస్, మున్సిపల్, రెవెన్యూ శాఖల అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.
పోలీసులు ప్రత్యేక దృష్టి సారించాలి
మామునూరు: జాతీయ రహదారిపై ప్రమాదాలకు అడ్డుకట్ట వేసేందుకు పోలీస్ అధికారులు ప్రత్యేక దృష్టిసారించారు. ఆర్టీఏ జంక్షన్ నుంచి ఇల్లందు వరకు ప్రమాదకర ప్రాంతాలను ఏసీపీ వెంకటేశ్, ఎంవీఐ శోభన్‌బాబు, ఇన్‌స్పెక్టర్ శ్రీనివాస్, ఎన్‌హెచ్‌ఏఐ, ఆర్‌అండ్‌బీ అధికారులతో కలిసి వరంగల్ పోలీస్ కమిషనర్ శ్వేత మంగళవారం పరిశీలించారు. ప్రమాదాలకు ఆస్కారం ఉన్న ప్రాంతాలను బ్లాక్‌స్పాట్లుగా గుర్తించారు. ప్రమాదాలు జరిగే ప్రాంతాల్లో రహదారి పరిస్థితులు, వాహనాల రాకపోకలు, మలుపులు, ప్రమాదాలకు దారితీస్తున్న ఇతర కారణాలపై సీపీ ఆరా తీశారు. ఆర్టీఏ జంక్షన్ నుంచి బొల్లికుంట క్రాస్ వరకు నిత్యం జరుగుతున్న ప్రమాదాల వివరాలను పరిశీలించి, ఇకపై ప్రమాదాలు జరగకుండా అవసరమైన భద్రతా చర్యలను చేపట్టాలని అధికారులకు ఆదేశించారు. జాతీయ రహదారిపై బ్లాక్‌స్పాట్లుగా గుర్తించిన ప్రాంతాల్లో హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఎన్‌హైపె 108 రోడ్డు ప్రమాదాలు జరగగా.. 80 మంది మరణించారు.
సీపీ ఎన్.శ్వేత


