గీసుకొండ: ఆర్థిక, వ్యక్తిగత సమస్యలతో మనస్తాపానికి గురైన రైతు గడ్డిమందు తాగి చికిత్స పొందుతూ మృతి చెందిన ఘటన మండలంలోని వంచనగిరిలో చోటుచేసుకుంది. గీసుకొండ ఇన్‌స్పెక్టర్ విశ్వేశ్వర్ తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన ఎడ్డె రవికుమార్ (42) వ్యవసాయ చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. కొంతకాలంగా ఆర్థిక, వ్యక్తిగత సమస్యలతో తీవ్ర మనస్తాపానికి గురవుతున్నాడు. ఈ క్రమంలో ఈనెల 20న గ్రామంలోని బతుకమ్మగడ్డ సమీపంలో గడ్డి మందు తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం హనుమకొండలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా గురువారం ఉదయం చికిత్స పొందుతూ మృతి చెందినట్లు తెలిపారు. తన భర్త మరణంపై ఎలాంటి అనుమానం లేదని, ఆర్థిక, వ్యక్తిగత సమస్యలతోనే ఆత్మహత్య చేసుకున్నట్లు మృతుడి భార్య ఎడ్డె సుమలత పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ విశ్వేశ్వర్ తెలిపారు.


