హన్మకొండ అర్బన్: ప్రజా ప్రభుత్వంలో హనుమకొండ జిల్లా అభివృద్ధి పథంలో పరుగులు పెడుతోందని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. హనుమకొండలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో శనివారం స్వాతంత్య్ర వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన శ్రీనివాస్‌రెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. పోలీసుల గౌరవ వందనం స్వీకరించి, స్వాతంత్య్ర సమరయోధులను ఘనంగా సన్మానించారు. పలు పాఠశాలల చిన్నారుల సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. అనంతరం శకటాల ప్రదర్శన, ఉత్తమ ఉద్యోగులను సత్కరించారు. ఈసందర్భంగా రాష్ట్రం, జిల్లాలో ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ప్రభుత్వ లక్ష్యాలు మంత్రి తన ప్రసంగంలో ప్రజలకు వివరించారు.
అభివృద్ధి పథంలో జిల్లా..
హనుమకొండ జిల్లా సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక బడ్జెట్ కేటాయించి పనులు వేగవంతం చేసిందని మంత్రి తెలిపారు. జిల్లాను అభివృద్ధి పథంలో పరుగులు పెట్టించేందుకు ప్రత్యేకంగా కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఎల్‌నినో పరిస్థితులు ఉన్నప్పటికీ దేవాదుల ద్వారా ధర్మసాగర్, చలివాగు ప్రా జెక్టులను నింపి వచ్చే ఏడాది వరకు తాగునీటికి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
పురోగతిలో పనులు..
2057 జనాభా అవసరాలకు అనుగుణంగా రూ.5,300 కోట్లతో భూగర్భ డ్రెయినేజీ పనులు చేపట్టినట్లు, రూ.572 కోట్లతో 45 కిలోమీటర్ల పొడవునా 200 అడుగుల ఇన్నర్ రింగ్ రోడ్డు నిర్మాణ పనులు శరవేగంగా కొనసాగుతున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. హనుమకొండ–కాజీపేట రూ.78 కోట్లు, ఫాతిమా–మామునూరు రూ.68 కోట్లతో చేపట్టిన రైల్వే ఓవర్ బ్రిడ్జి పనులు పురోగతిలో ఉన్నాయని పేర్కొన్నారు. ‘కుడా’ ఆధ్వర్యంలో మామునూరు విమానాశ్రయం కోసం 950 ఎకరాల స్థలాన్ని ఎయిర్‌పోర్ట్స్ అథారిటీకి అప్పగించామని, జిల్లాలో నాలుగు తెలంగాణ పబ్లిక్ స్కూళ్లు, రెండు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. పరకాలలో రూ.35 కోట్లతో 100 పడకల ఆస్పత్రి నిర్మాణం జరుగుతోందని, భద్రకాళి మాడవీధుల పనులు తుది దశకు చేరుకున్నట్లు పేర్కొన్నారు. వంగరలో పీవీ.నరసింహారావు విజ్ఞాన వేదికకు రూ.7 కోట్లు, కాకతీయ మ్యూజికల్ గార్డెన్‌కు రూ.5 కోట్లతో పునరుద్ధరణ పనులు వేగవంతం చేసినట్లు పేర్కొన్నారు.
జెండాకు వందనం చేస్తున్న మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్, సీపీ శ్వేత, అధికారులు
మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి
హనుమకొండ పరేడ్ గ్రౌండ్స్‌లో ఘనంగా స్వాతంత్య్ర దినోత్సవం
జాతీయ పతాకం ఆవిష్కరణ, జిల్లా ప్రగతి నివేదిక వివరణ
అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు
సమరయోధులకు సన్మానం..
ఉత్తమ ఉద్యోగులకు సత్కారం
ప్రారంభమైన స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ
జిల్లా వ్యాప్తంగా శనివారం నుంచి లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభమైందని మంత్రి పొంగులేటి తెలిపారు. జిల్లాలోని 1,445 మహిళా సంఘాలకు రూ.136 కోట్ల సీ్త్రనిధి, బ్యాంకు అనుసంధాన రుణాలు అందించామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి పేర్కొన్నారు. వేడుకల్లో స్థానిక ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడి, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్, సీపీ శ్వేత, అదనపు కలెక్టర్ రవి ఇతర ప్రజాప్రతినిధులు, పోలీస్ అధికారులు, సిబ్బంది, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.


