● విద్యార్థులతో ఊళ్లో ర్యాలీ
● గమనించని ఉపాధ్యాయులు
ఐనవోలు: స్వాతంత్య్ర వేడుకలు ఘనంగా జరుగుతున్న వేళ ఒంటిమామిడిపల్లి ప్రభుత్వ పాఠశాల నుంచి స్థానిక గ్రామ పంచాయతీ వరకు నిర్వహించిన ర్యాలీలో తీవ్ర నిర్లక్ష్యం వెలుగుచూసింది. ప్రతీ సంవత్సరం మాదిరిగా ప్రభుత్వ పాఠశాల నుంచి జీపీ వద్దకు ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో విద్యార్థులు ర్యాలీగా వచ్చి జీపీ వద్ద జాతీయ జెండాను ఆవిష్కరించి జాతీయ గీతాలాపన చేస్తారు. అయితే, ఈసారి విద్యార్థులు మువ్వన్నెల జాతీయ జెండాను తలకిందులుగా ఆకుపచ్చ రంగుపైకి, కాషాయ రంగు కిందికి వచ్చేలా పట్టుకుని ప్రదర్శించారు. ర్యాలీ మొత్తం జాతీయ జెండా రివర్స్‌లోనే సాగినప్పటికీ వెంట ఉన్న ఉపాధ్యాయులు, బాధ్యులెవరూ దీన్ని గమనించకపోవడంపై స్థానికులు తీవ్ర విస్మయం వ్యక్తం చేశారు. దేశ సమగ్రతకు, గౌరవానికి ప్రతీక అయిన జాతీయ పతాకం విషయంలో ఇంత నిర్లక్ష్యం తగదని, కనీస అవగాహన లేకుండా జెండాను తలకిందులుగా ఊరేగించడంపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు.


