● అమల్లోకి రాని అక్కంపేట
రెవెన్యూ గ్రామ ఉత్తర్వులు
● అక్కంపేటను ఆదర్శంగా తీర్చిదిద్దాలని సీఎం రేవంత్‌కు వేడుకోలు
ఆత్మకూరు: సీఎం రేవంత్‌రెడ్డి అప్పటి పీసీసీ అధ్యక్షుడి హోదాలో 2022లో ఆత్మకూరు మండలం అక్కంపేటలో రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా పర్యటించిన సందర్భంగా అక్కంపేట ప్రజలు తమ గ్రామాన్ని రెవెన్యూ గ్రామంగా మార్చాలని ఆయన దృష్టికి తీసుకెళ్లారు. జయశంకర్ స్వగ్రామం అక్కంపేటను అధికారంలోకి రాగానే రెవెన్యూ గ్రామంగా మారుస్తామని చెప్పారు. అధికారంలోకి వచ్చిన తర్వాత రెవెన్యూ గ్రామంగా మారుస్తున్నామని సీఎం అధికారికంగా ప్రకటించారు. కానీ, ఇంతవరకు తమ గ్రామం పెద్దాపూర్ రెవెన్యూ గ్రామ పరిధిలోనే రికార్డుల్లో చూపిస్తున్నదని ఇంతవరకు అక్కంపేట రెవెన్యూ గ్రామ ఉత్తర్వులు అమలు కావట్లేదని అక్కంపేట ప్రజలు వాపోతున్నారు. తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి ప్రదాత జయశంకర్ స్వగ్రామంపై సీఎం రేవంత్‌రెడ్డి ప్రత్యేక దృష్టిపెట్టి గతంలో ఇచ్చిన హామీలు అమలు చేయాలని, తమ గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దాలని అక్కంపేట గ్రామస్తులు సీఎం రేవంత్‌ను కోరుతున్నారు. స్థానిక ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి, ‘కుడా’ చైర్మన్ ఇనగాల వెంకట్రామ్‌రెడ్డి అక్కంపేట సమస్యలను సీఎం రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లి సమస్యలు పరిష్కరించి అక్కంపేటను ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దాలని గ్రామస్తులు కోరుతున్నారు.


