సాక్షి, వరంగల్/గీసుకొండ: బుధవారం అర్ధరాత్రి ఒంటి గంట సమయం.. ఆరు అంతస్తులున్న పరిశ్రమలో కార్మికులు పనిచేస్తున్నారు. ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దట్టమైన పొగ నాలుగో అంతస్తును కమ్మేసింది. ప్రాణాలు కాపాడుకునేందుకు కార్మికులు పరుగులు తీశారు. కానీ ఇద్దరి జీవితాలు అక్కడే ముగిశాయి. టెక్నీషియన్లుగా పనిచేస్తున్న ఉత్తరప్రదేశ్ రాష్ట్రం గోరఖ్‌పూర్‌కు చెందిన సూర్యప్రకాశ్(31), అదే రాష్ట్రం బెనారస్(వారణాసి)కు చెందిన వినోద్ ప్రజాపతి (30) లిఫ్ట్‌లో చిక్కుకుని ప్రాణాలు కోల్పోయారు. గీసుకొండ మండలంలోని కాకతీయ మెగాటెక్స్‌టైల్ పార్క్‌లోని గణేశా ఏకో పెట్ కంపెనీలో జరిగిన ఈ ప్రమాదం రెండు కుటుంబాల్లో తీరని విషాదాన్ని మిగిల్చింది. అదే సమయంలో పరిశ్రమల్లో పనిచేస్తున్న ప్రతి కార్మికుడినీ అప్రమత్తం చేసే గట్టి హెచ్చరికగా మారింది. పాలిస్టర్ ఫైబర్ తయారీలో భాగంగా ప్లాస్టిక్‌ను కరిగించేందుకు స్టీమ్‌ను పైపులైన్ ద్వారా పైకి పంపే ప్రక్రియ జరుగుతోంది. పైప్‌లైన్‌లో ఎంత వేడితో స్టీమ్‌ను పై యూనిట్లకు పంపించాలనే విషయంలో జాగ్రత్తలు పాటించకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఆ సమయంలో మొత్తం 80 మంది కార్మికులు ఉండగా మిగతా వారు అప్రమత్తం కావడంతో పెనుప్రమా దం తప్పినట్లయింది. కానీ, పై అంతస్తులకు వెళ్లిన ఇద్దరు లిఫ్ట్‌లో చిక్కుకొని మంటలు, వేడి, దట్టమైన పొగ మధ్య బయటపడే అవకాశం లేకుండా పోయింది. టెక్స్‌టైల్ పార్కులోని ఇతర కంపెనీల్లో పర్యావరణ, పొల్యూషన్, ఫైర్, పరిశ్రమల శాఖల ఆధ్వర్యంలో సేఫ్టీ ప్రమాణాలపై పర్యవేక్షణ లోపం వల్లే ఇలాంటి తప్పిదాలు జరుగుతున్నట్లు విమర్శలు వస్తున్నాయి.
లిఫ్ట్ వద్దు.. మెట్లే ముద్దు
● భవనాల్లో లేదా ఫ్యాక్టరీల్లో మంటలు చెలరేగితే షార్ట్ సర్క్యూట్‌లను అరికట్టడానికి విద్యుత్ సరఫరా నిలిపివేస్తారు. ఆ సమయంలో లిఫ్ట్‌లో ఉన్నవారు ఫ్లోర్ మధ్యలోనే చిక్కుకుపోతారు.
● లిఫ్ట్ వెళ్లే మార్గం (షాఫ్ట్) ఒక చిమ్నీలా పనిచేస్తుంది. భవనంలో ఉత్పన్నమయ్యే పొగ, విష వాయువులు అత్యంత వేగంగా ఈ షాఫ్ట్ గుండా పైకి పాకుతాయి. దీనివల్ల లిఫ్ట్ లోపల ఉన్నవారికి క్షణాల్లో ఊపిరాడక ఊపిరితిత్తులు దెబ్బతిని స్పృహ తప్పిపోతారు.
● వేడికి లిఫ్ట్ సెన్సార్లు, సర్యూట్‌లు కాలిపోయి తలుపులు లాక్ అయిపోవడం లేదా మంటలు తీవ్రంగా ఉన్న ఫ్లోర్‌లోనే లిఫ్ట్ ఆగిపోతుంది.
● అగ్నిప్రమాదం సంభవించినప్పుడు ఎంత ఎత్తయిన భవనమైనా, పరిశ్రమ అయినా ఎట్టిపరిస్థితుల్లోనూ లిఫ్ట్ జోలికి వెళ్లకూడదు.
● మంటలు కనిపించిన వెంటనే లిఫ్ట్ వైపు వెళ్లకుండా అత్యవసర మెట్లమార్గం ద్వారా బయటకు రావాలి.
● ప్రతీ కార్మికుడికి ఎమర్జెన్సీ ఎగ్జిట్, మెట్లు, ఫైర్ ఎక్స్‌టింగ్విషర్లు ఎక్కడున్నాయో ముందుగానే తెలియాలి.
● ప్రమాద సమయంలో ఏం చేయాలో క్రమం తప్పకుండా మాక్‌డ్రిల్స్ ద్వారా శిక్షణ ఇవ్వాలి.
● కేఎంటీపీలో కై టెక్స్ కంపెనీ షెడ్ల నిర్మాణం జరిగే సమయంలో జరిగిన ప్రమాదాల్లో ఒకరిద్దరు కార్మికులు మృత్యువాత పడినట్లు అప్పట్లో ప్రచా రం జరిగింది. కంపెనీల్లో జరిగే ప్రమాదాల విష యం బయటకు పొక్కకుండా ఆయా కంపెనీల వారు జాగ్రత్తలు పడుతున్నారని, కనీసం పోలీ సులకు సమాచారం ఇవ్వకుండా కొన్ని సందర్బాల్లో విషయాన్ని వారే సెటిల్ చేసుకుంటున్నట్లు తెలుస్తోంది.
అగ్నిప్రమాద సమయంలో
లిఫ్ట్ వాడితే ప్రాణానికి ముప్పు
ఏకో గణేశా కంపెనీలో
ఈ మాదిరిగానే ఇద్దరి ప్రాణాలు బలి
అత్యవసర సమయంలో
మెట్ల మార్గమే భద్రమంటున్న అధికారులు
గతంలోనూ ఈ కంపెనీలో
పలు ప్రమాదాలు
గతంలోనూ పలు ప్రమాదాలు?
గతంలోనూ ఫైబర్ యార్న్ తయారు చేసే యూనిట్‌లోని యంత్రంలో ఇరుక్కుని బిహార్‌కు చెందిన కార్మికుడు ఒకరు మృతి చెందినట్లు కంపెనీ ఉద్యోగులు చెబుతున్నారు. ఈ విషయాన్ని బయటికి పొక్కకుండా సెటిల్ చేసుకున్నట్లు సమాచారం. గతంలో కంపెనీకి ఉద్యోగులను తీసుకుని వచ్చే బస్సు లోనికివెళ్లాక రివర్స్ తీసుకుంటుండగా ఓ మహిళా కార్మికురాలు టైర్ కింద పడి మృతి చెందింది.
సురక్షిత మార్గాన్ని ఎంచుకోవాలి
యంత్రం ఆగితే మళ్లీ నడుస్తుంది. ఉత్పత్తి ఆగితే తిరిగి మొదలవుతుంది. కానీ ప్రాణం పోతే తిరిగిరాదు. ఈ విషాదం మరో కుటుంబాన్ని కన్నీటిలో ముంచకూడదు. ప్రమాదం రాకముందే భద్రత నేర్చుకోవాలి. అప్రమత్తంగా ఉండాలి.. లిఫ్ట్‌ను కాదు, సురక్షిత మార్గాన్ని ఎంచుకోవాలి.. ప్రాణాలను కాపాడుకోవాలి
– యజ్ఞనారాయణ,
జిల్లా అగ్నిమాపక విభాగాధికారి


