కాళోజీ సెంటర్ : దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించకుంటే ఉద్యమం ఉధృతం చేస్తామని టీపీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు ఊటుకూరి అశోక్ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ (యూఎస్‌పీసీ) రాష్ట్ర శాఖ పిలుపు మేరకు రెండో దశ పోరాట కార్యక్రమంలో భాగంగా గురువారం వరంగల్ మండల రెవెన్యూ కార్యాలయం ఎదుట ఉపాధ్యాయ సంఘాల ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. అనంతరం డిప్యూటీ తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఊటుకూరి అశోక్ మాట్లాడుతూ.. పీఆర్సీ గడువు ముగిసి మూడేళ్లు దాటినా ఇప్పటివరకు నివేదిక స్వీకరించకపోవడం విచారకరమన్నారు. ఆరు డీఏలు పెండింగ్‌లో ఉండటం, మూడు నెలలుగా ఈహెచ్‌ఎస్ ప్రీమియం మినహాయిస్తున్నా హెల్త్ కార్డులు జారీ చేయకపోవడం దారుణమన్నారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పొందుపరిచిన విధంగా సీపీఎస్‌ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. సమస్యల పరిష్కారం కోసం పలుమార్లు ప్రభుత్వానికి వినతులు సమర్పించినా స్పందించకపోవడంతో ఉద్యమ కార్యాచరణ చేపట్టినట్లు తెలిపారు. ఈ నెల 21న జిల్లా కేంద్రాల్లో ధర్నాలు, 29న హైదరాబాద్ ఇందిరాపార్క్ వద్ద రాష్ట్రస్థాయి మహాధర్నా నిర్వహించనున్నట్లు తెలిపారు. అప్పటికీ సమస్యలు పరిష్కరించకుంటే సెప్టెంబర్‌లో చలో అసెంబ్లీ కార్యక్రమం చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో డీటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి గోవిందరావు, మండల బాధ్యులు బెల్లంకొండ పూర్ణచందర్, పూజరి మనోజ్, వెంకటేశ్వర్లు, గోపాల్, దుగ్యాల రవీందర్, తాబేటి కుమార్, కుమార్, ఆనందచారి, పేరం శ్యామ్‌సుందర్, నరసింహారెడ్డి పాల్గొన్నారు.
టీపీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు అశోక్


