కాళోజీ సెంటర్: కొత్త సామాజిక భద్రతా పింఛన్ల పంపిణీకి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ‘చేయూత’ పథకం కింద అర్హులైన లబ్ధిదారులకు కొత్త పింఛన్లు మంజూరు చేసేందుకు గ్రామీణాభివృద్ధి శాఖ (సెర్ప్) స్పష్టమైన మార్గదర్శకాలతో కూడిన సర్క్యూలర్‌ను జారీ చేసింది. తొలివిడత ప్రాధాన్యం కింద ఏడు ప్రత్యేక కేటగిరీలకు చెందిన వారికి కొత్త పింఛన్లను మంజూరు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ఎవరెవరికీ అవకాశం
ఒంటరి మహిళలు, వితంతువులు, దివ్యాంగులు, గీత కార్మికులు, చేనేత కార్మికులు, ఫైలేరియా (బోదకాలు) బాధితులు, రక్త సంబంధిత వ్యాధులు (తలసేమియా, సికిల్ సెల్, హిమోఫీలియా) అవకాశం కల్పిస్తూ వీరి నుంచి ఈ నెల ఆగస్టు 31వ తేదీ వరకు దరఖాస్తులను స్వీకరణకు అవకాశం ఇచ్చారు.
దరఖాస్తులు ఎక్కడ ఇవ్వాలంటే..
గ్రామ పంచాయతీ కార్యదర్శులు, వార్డు ఆఫీసర్లు, ఎంపీడీఓలు, పురపాలక కమిషనర్ల వద్ద దరఖాస్తులు సమర్పించవచ్చు. ఇప్పటికే ప్రజా పాలన, ప్రగతి ప్రణాళిక 99 రోజుల గ్రామసభలు, ప్రజావాణిలో దరఖాస్తు చేసుకున్నవారు మళ్లీ దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదు. కొత్తగా దరఖాస్తు చేసేవారు, ఇంతకుముందు అవసరమైన పత్రాలు జత చేయనివారు సంబంధిత సర్టిఫికెట్లతో దరఖాస్తు చేసుకోవడానికి వెసులుబాటు కల్పించారు.
అందుబాటులో ఆన్‌లైన్ వెబ్‌సైట్..
దరఖాస్తుల నమోదు కోసం ప్రత్యేకంగా డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.చేయూత.తెలంగాణ. జీవీఓ.ఇన్ అనే వెబ్‌సైట్‌ను అందుబాటులోకి తెచ్చారు. మండల స్థాయి, మున్సిపల్ స్థాయిలో ప్రత్యేక లాగిన్‌ల ద్వారా ఆన్‌లైన్ ఎంట్రీలు పూర్తి చేస్తారు. క్షేత్రస్థాయిలో విచారణ అధికారుల పరిశీలన అనంతరం కలెక్టర్ల ఆమోదంతో మంజూరు ఉత్తర్వులు జారీ చేసి, ప్రజాప్రతినిధుల ద్వారా పంపిణీ చేయనున్నారు.
ఈనెల 31వ తేదీ వరకు దరఖాస్తుల స్వీకరణ
తొలి విడతలో ఏడు కేటగిరీలకు కొత్త పింఛన్లు
మార్గదర్శకాలు జారీ చేసిన సెర్ప్
అవసరమైన ధ్రువీకరణ పత్రాలు
వితంతువులు: భర్త మరణ ధ్రువీకరణ పత్రం.
ఒంటరి మహిళలు: విడిపోయినట్లు స్థానిక విచారణ నివేదిక.
గీత కార్మికులు, చేనేత కార్మికులు: ఆయా శాఖల (ఆబ్కారీ, చేనేత జౌళి శాఖ) ధ్రువీకరణ పత్రాలు తప్పనిసరి.
ఫైలేరియా బాధితులు: వైద్య ఆరోగ్య శాఖ జారీ చేసిన సర్టిఫికెట్ అందించాలి.


