ఈసారి సర్దుబాటు పారదర్శకమేనా? | - | Sakshi
Sakshi News home page

ఈసారి సర్దుబాటు పారదర్శకమేనా?

Aug 1 2026 1:25 AM | Updated on Aug 1 2026 1:25 AM

కాళోజీ సెంటర్‌: జిల్లాలో ఉపాధ్యాయుల కొరత ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో వర్క్‌ అడ్జెస్ట్‌మెంట్‌ (పని సర్దుబాటు) చేసేందుకు జిల్లా విద్యాశాఖ సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. జిల్లా వ్యాప్తంగా 673 పాఠశాలలు ఉన్నాయి. గత విద్యాసంవత్సరం విద్యార్థులు లేక 131 పాఠశాలలను మూసివేశారు. ఈ పాఠశాలల్లో విధులు నిర్వర్తిస్తున్న 228 మంది ఉపాధ్యాయులను విద్యార్థులు ఎక్కువగా ఉన్న ఇతర పాఠశాలలకు సర్దుబాటు చేశారు. ఈ విద్యాసంవత్సరం ఖానాపురం మండలం పెద్దమ్మగడ్డ పాఠశాలలో 8 మంది విద్యార్థులు, గీసుకొండ మండలం సూర్యతండా పాఠశాలలో ఆరుగురు విద్యార్థులు చేరగా.. మిగిలిన 129 పాఠశాలలు మూతపడే ఉన్నాయి. ఈ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులను ఇతర పాఠశాలలకు సర్దుబాటు చేయనున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. కాగా, ఈసారి సర్దుబాటు ప్రక్రియ సవ్యంగా జరిగేనా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

జీఓ 25 ప్రకారం సర్దుబాటు..

గత విద్యాసంవత్సరం జీఓ 25 ఆధారంగా అధికారులు ఉపాధ్యాయులను సర్దుబాటు చేశారు. విద్యార్థులు లేని 131 పాఠశాలల్లో పనిచేస్తున్న 68 మంది ఉపాధ్యాయులను ఇతర మండలాల్లోని పాఠశాలలకు సర్దుబాటు చేశారు. అలాగే, మరో 160 మందిని వారు పనిచేస్తున్న స్థానిక మండల పరిధిలో విద్యార్థులు ఎక్కువగా ఇతర పాఠశాలల్లో సర్దుబాటు చేశారు. కాగా, అవసరం పేరుతో జీఓను పక్కన పెట్టి కొంతమంది ఎంఈఓలు ఇష్టారీతిన టీచర్లను సర్దుబాటు చేశారనే విమర్శలు ఉన్నాయి. ఈ విషయంపై ఇటీవల ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ (యూఎస్‌పీసీ) ప్రతినిధి బృందం డీఈఓకు వినతిపత్రం అందజేసింది. ఈసారి పారదర్శకంగా సర్దుబాటు చేస్తామని డీఈఓ హామీ ఇచ్చినట్లు తెలిసింది.

అక్రమ డిప్యుటేషన్లు రద్దయ్యేనా?

విద్యార్థులు, ఉపాధ్యాయుల నిష్పత్తి ప్రకారం.. విద్యార్థుల సంఖ్యకు మించి ఉపాధ్యాయులు ఉంటే ఆ పాఠశాలల నుంచి సీనియర్‌ ఉపాధ్యాయులను మినహాయించి, జూనియర్‌ ఉపాధ్యాయులను అవసరం ఉన్న పాఠశాలలకు డిప్యుటేషన్‌పై పంపించాలి. కానీ, నింబధనలను తుంగలో తొక్కి ఏకంగా జిల్లా కేంద్రంలో ఉన్న పాఠశాలల్లో డిప్యుటేషన్‌పై పంపించారని విమర్శలు ఉన్నాయి. అందులో కొన్ని మచ్చుకు ఇలా ఉన్నాయి.

● ఖానాపురం మండలం అశోక్‌నగర్‌ ప్రాథమిక పాఠశాలలో పనిచేస్తున్న ఎస్‌జీటీని గీసుకొండ మండలం మనుగొండ యూపీఎస్‌కు సర్దుబాటు చేశారు. మళ్లీ అదే టీచర్‌ను అక్కడి నుంచి గీసుకొండకు పంపించారు.

● బుధరావుపేట పాథమిక పాఠశాలలో 150 మంది విద్యార్థులు ఉండగా.. ఏడుగురు ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. ఇక్కడ గతంలో ఇద్దరు టీచర్లను సర్దుబాటు చేశారు. ఎస్‌జీటీని అదనంగా గుర్తించి ఖిలా వరంగల్‌ వెంకటేశ్వర ఎయిడెడ్‌ పాఠశాలకు నిబంధనలకు విరుద్ధంగా పంపించారు.

● వెంకటేశ్వర ఎయిడెడ్‌ పాఠశాలలో 40 మంది విద్యార్థులు ఉన్నారు. ఇక్కడ ముగ్గురు ఎయిడెడ్‌ ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. సర్దుబాటు పేరుతో అవసరం లేకున్నా ముగ్గురు ఎస్‌జీటీలను అదనంగా పంపించారు.

● ఖానాపురం మండలం బుధరావుపేట జెడ్పీహెచ్‌ఎస్‌లో ఇద్దరు మ్యాథ్స్‌ టీచర్లు ఉన్నారు. గత సంవత్సరం ఇక్కడి నుంచి ఒక టీచర్‌ను ఆంధ్రబాలిక పాఠశాలకు, ఇతర పాఠశాలల ఉపాధ్యాయులను బుధరావుపేట పాఠశాలకు పంపారు.

● ఖానాపురం మండలం అశోక్‌నగర్‌ జెడ్పీహెచ్‌ఎస్‌లో పనిచేస్తున్న బయోసైన్స్‌ టీచర్‌ను వరంగల్‌ జీహెచ్‌ఎస్‌ నరేంద్రనగర్‌కు సర్దుబాటు చేశారు. అశోక్‌నగర్‌లో ఒక టీచర్‌ రిటైర్‌ అయ్యారు. ఇప్పుడు అక్కడ బయోసైన్స్‌ బోధించే టీచర్‌ లేడు.

● నెక్కొండ మండలం సూరిపల్లి జెడ్పీహెచ్‌ఎస్‌లో ఇద్దరు స్కూల్‌ అసిస్టెంట్స్‌ ఉండగా.. అందులో ఒకరు డీఈఓ కార్యాలయంలో పనిచేస్తున్నారు. మరొకరు మెడికల్‌ లీవ్‌లో ఉన్నట్లు సమాచారం. ఇంకొకరు సీఆర్‌ఈటీలో పనిచేస్తున్నారు.

● నల్లబెల్లి మండలం నారక్కపేట ప్రాథమిక పాఠశాలలో పనిచేస్తున్న ఎస్‌జీటీ అనధికారికంగా డీఈఓ ఆఫీస్‌లో పనిచేస్తున్నట్లు సమాచారం.

పారదర్శకంగా సర్దుబాటు చేస్తాం

సర్‌ ప్లస్‌ టీచర్ల జాబితాలు ఎంఈఓలు అందజేయగానే ఈసారి పారదర్శకంగా సర్దుబాటు చేస్తాం. ఉపాద్యాయ సంఘాల ప్రతినిధుల సమన్వయంతో సర్దుబాటు చేయాలని భావిస్తున్నాం.

– రంగయ్యనాయుడు, డీఈఓ

త్వరలో టీచర్ల వర్క్‌ అడ్జస్ట్‌మెంట్‌కు విద్యాశాఖ కసరత్తు

గత సంవత్సరం నిబంధనలు

ఉల్లంఘించారని ఆరోపణలు

ఇప్పటికే డీఈఓను కలిసిన

ఉపాధ్యాయ సంఘాల నాయకులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement