సాక్షిప్రతినిధి, వరంగల్:
కాకతీయ విశ్వవిద్యాలయం (కేయూ)లో ఏళ్ల తరబడి అధ్యాపకుల కొరత తీరట్లేదు. రోజురోజుకూ అసోసియేట్, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, ప్రొఫెసర్ల సమస్య తీవ్రమవుతోంది. యూనివర్సిటీలో 13 ఏళ్లుగా రెగ్యులర్, టీచింగ్ పోస్టుల నియామకాలు జరగలేదు. ఫలితంగా రెగ్యులర్ అధ్యాపకుల కొరత తీవ్రస్థాయికి చేరింది. ఒక్కసారి అధ్యాపకుల గణాంకాలను పరిశీలిస్తే మంజూరైన పోస్టుల్లో కేవలం 18.82 శాతం మందితోనే కాలం వెళ్లదీస్తున్న పరిస్థితి కనిపిస్తోంది.
నియామకాల జాప్యం..
విఫలమవుతున్న ప్రయత్నాలు
కాకతీయ యూనివర్సిటీలో మంజూరైన మొత్తం రెగ్యులర్ ఫ్యాకల్టీ పోస్టులు 409 కాగా అసిస్టెంట్, అసోసియేట్ ప్రొఫెసర్లు, ప్రొఫెసర్లు కలిపి 77 మందే పనిచేస్తున్నారు. 2013 నుంచి నేటివరకు ఒక్క రెగ్యులర్ నియామకం జరగలేదు. పదేళ్లుగా ఉద్యోగ విరమణలు పెరుగుతున్నా, కొత్త రిక్రూట్‌మెంట్లు చేపట్టకపోవడంతో ఖాళీలు పేరుకుపోతున్నాయి. 2017లో ఒకసారి అప్పటి పాలకవర్గం హయాంలో 136 అధ్యాపక పోస్టుల భర్తీకి ప్రభుత్వం నుంచి అనుమతి పొందే ప్రయత్నం జరిగినప్పటికీ, ఆ ప్రక్రియ కార్యరూపం దాల్చలేదు. 47 రకాల కోర్సులు, రెండు ఇంజనీరింగ్ కళాశాలలు, కామర్స్, ఫార్మసీ, లా వంటి కీలక విభాగాలు ఈ యూనివర్సిటీలో ఉన్నాయి. ప్రభుత్వ ఉదాసీ నతతో నిరుద్యోగ అభ్యర్థులకు అన్యాయం జరగడమే కాకుండా, వర్సిటీ పరిశోధనా రంగం కుంటుపడుతోంది. రెగ్యులర్ సిబ్బంది తగినంత లేకఅధి కంగా అకడమిక్ కన్సల్టెంట్లు (కాంట్రాక్టు అధ్యాపకులు), పార్ట్‌టైం టీచర్లపై ఆధారపడాల్సి వస్తోంది.
ఈసారైనా భర్తీ చేస్తారా?
యూనివర్సిటీలు ఇటీవల వెల్లడించిన వివరాల ప్రకారం.. రాష్ట్రంలోని 13 విశ్వవిద్యాలయాల్లో మొత్తం 2,994 మంజూరైన పోస్టులు ఉండగా, ప్రస్తుతం 763 మంది రెగ్యులర్ అధ్యాపకులు మాత్రమే పనిచేస్తున్నారు. మిగిలిన వారిలో 1,174 మంది కాంట్రాక్టు పద్ధతిలో, 544 మంది పార్ట్‌టైం పద్ధతిలో పనిచేస్తున్నారు. కాగా, సుమారు 500 అసిస్టెంట్ ప్రొఫెసర్ల పోస్టులను భర్తీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఉన్నత విద్యామండలి ద్వారా నివేదికలు తెప్పించుకున్నట్లు సమాచారం. త్వరలో జరగబోయే బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఈ నియామకాల కోసం ప్రతిపాదనలు స్వీకరించినట్లు చెబుతుండగా.. ఇందుకు సంబంధించిన ప్రకటన ప్రస్తుత బడ్జెట్ సమావేశాల్లో వచ్చే అవకాశం ఉందని కూడా అంటున్నారు. ప్రధానంగా ఉస్మానియా యూనివర్సిటీలో 250 పోస్టులు, కాకతీయ యూనివర్సిటీలో 145 పోస్టులను భర్తీ చేయనున్నారన్న చర్చ జరుగుతోంది. వీటితోపాటు పాలమూరు, శాతవాహన వంటి ఇతర విశ్వవిద్యాలయాల్లో కూడా కొన్ని పోస్టులను భర్తీ చేస్తారంటున్నారు. దీంతో ఈసారైనా కేయూలో ఉన్న ఖాళీలు భర్తీ అవుతాయా? అనే చర్చ మొదలైంది.
కీలక విభాగాల్లో పోస్టులు ఖాళీ.. 2017 నుంచి ఇదే పరిస్థితి
ప్రొఫెసర్లు, అసిస్టెంట్
ప్రొఫెసర్ల కొరత తీరేదెప్పుడు
పది విభాగాల్లో ఒక్క ప్రొఫెసర్ కూడా
లేని పరిస్థితి
అకడమిక్ కన్సల్టెంట్లపైనే ఆధారం.. పరిశోధనలపై తీవ్ర ప్రభావం
తాజాగా 13 వర్సిటీలకు
500 పోస్టుల ప్రకటన
ఈసారైనా ఖాళీలు భర్తీ అయ్యేనా?


