కొత్తగట్టు సింగారంలో అడ్డుకున్న రైతులు
శాయంపేట: కొత్తగట్టు సింగారం గ్రామ శివారులో టోల్‌గేట్ నిర్మాణ పనులకు శుక్రవారం పరకాల ఆర్డీఓ నారాయణ, తహసీల్దార్ ప్రవీణ్ కుమార్, నేషనల్ హైవే అథారిటీ డీఈలు.. శాయంపేట ఎస్సై ప్రవీణ్ కుమార్, దామెర ఎస్సై అశోక్ బందోబస్తు మధ్య 3డీ మ్యాపింగ్ చేశారు. దీంతో బాధిత రైతులు అడ్డుకున్నారు. ఇది కేవలం 3డీ మ్యాపింగ్ మాత్రమేనని, ప్రభుత్వానికి పంపించాల్సిన సిఫార్సులు అని, ఫైనల్ కాదని రైతుల ఆమోదం తెలిపిన తర్వాతే భూములను తీసుకుంటామని అధికారులు తెలపడంతో రైతులు సర్వేకు సహకరించారు. ఈ సందర్భంగా నాయకులు పోలెపల్లి శ్రీనివాస్‌రెడ్డి, మారెపల్లి క్రాంతికుమార్ మాట్లాడుతూ రైతులకు అన్యాయం జరుగకుండా ప్రభుత్వ భూమి రెండు కిలోమీటర్ల దూరంలో ఉందని, అక్కడ టోల్‌గేట్ నిర్మాణం చేపడితే రైతులు నష్టపోరని, 100 మీటర్లలోనే నిర్మాణం చేపడితే రైతులు కూడా సహకరిస్తారని తెలిపారు. అధికారులు పూర్తిస్థాయిలో పరిశీలన చేసి పేద రైతులకు న్యాయం చేయాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో రైతులు మాడ రాఘవరెడ్డి, నోముల సుదర్శన్, రాధిక, రజిత, మహేందర్, సాగర్, రాణి, మమత, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.


