ధర లేక దిగాలు | - | Sakshi
Sakshi News home page

ధర లేక దిగాలు

Feb 23 2026 8:51 AM | Updated on Feb 23 2026 8:51 AM

ధర లే

ధర లేక దిగాలు

నర్సంపేట: జిల్లాలో టమాట సాగు చేసిన రైతు కన్నీరు పెడుతున్నాడు. పెట్టుబడులు పెట్టి కంటికి రెప్పలా కాపాడుకున్న టమాట పంట దిగుబడి సమయంలో ధర అమాంతం పడిపోయింది. దీంతో దిక్కుతోచని స్థితిలో టమాట సాగు చేసిన రైతులు ఆందోళన చెందుతున్నారు. ఎకరాకు రూ.22 వేల నుంచి రూ.30 వేల వరకు పెట్టుబడులు పెట్టారు. మార్కెట్‌లో కిలో టమాట రూ.2 నుంచి రూ.ఐదు వరకు అమ్ముడుపోని పరిస్థితి నెలకొంది. దీంతో చేలల్లోనే టమాటలను వదిలేస్తున్నామని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా రైతుల నుంచి కొనుగోలు చేసిన కొంతమంది దళారులు మాత్రం వినియోగదారులకు ఎక్కువ ధరకు అమ్ముతున్నట్లు తెలుస్తోంది.

అప్పులు తెచ్చి.. పంట సాగుచేసి

జిల్లాలోని 13 మండలాల్లో 1,278 మంది రైతులు 1,016.36 ఎకరాల్లో టమాట సాగు చేశారు. మొదటి నుంచి వాతావరణంలో వచ్చిన మార్పులతో దిగుబడి అంతంత మాత్రంగానే వచ్చింది. టమాట ధర అమాంతం పడిపోవడంతో అప్పులు చేసి పంట సాగుచేసిన రైతులు నిరాశకు గురవుతున్నారు. పలు మండలాల్లో 20 వేల పైన ఎకరాల విస్తీర్ణంలో అన్ని రకాల కూరగాయల పంటలు రైతులు సాగు చేస్తున్నారు.

కూలీల ఖర్చు రావడం లేదు..

నాకు ఉన్న ఎకరంన్నరలో టమాట పంట సాగు చేశా. మార్కెట్‌లో కిలో టమాట రూ.2కే అంటే ఏం చేయాలో పాలుపోవడం లేదు. ఒ క్కో మొక్కకు రూ.1.25తో వెచ్చించి 16 వేల మొక్కలు కొనుగోలు చేశా. మల్చింగ్‌ పేపర్‌కు రూ.15 వేలు, నారుకు రూ.20 వేలు, మందుల పిచికారీకి రూ.10 వేలు, కూలీలతో కలిపి మొత్తం రూ.70 వేల ఖర్చు అయ్యింది. కూలీల ఖర్చు భరించలేక చేనులోనే పంట వదలాల్సి వస్తోంది.

– నల్లపు యతిన్‌, అప్పల్‌రావుపేట, నెక్కొండ

మార్కెట్‌లో కిలో టమాట రూ.రెండే

చేలల్లోనే పంటను వదిలేస్తున్న రైతులు

జిల్లాలో 1,278 మంది రైతులు.. 1,016.38 ఎకరాల్లో సాగు

ధర లేక దిగాలు1
1/1

ధర లేక దిగాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement