వలంటీర్లతో డిజిటల్ క్రాప్ సర్వే
● జిల్లాలో 162 రెవెన్యూ గ్రామాలు
● 150 గ్రామాల్లో వివరాలు
సేకరించనున్న వలంటీర్లు
హన్మకొండ: యాసంగి సీజన్ పంటల నమోదు ప్రక్రియ వేగవంతం చేసేందుకు వ్యవసాయ శాఖ వలంటీర్ల నియామకం చేపట్టింది. పంటల కచ్చితత్వాన్ని నమోదు చేసేందుకు ప్రభుత్వం, వ్యవసాయ శాఖ శాటిలైట్ మ్యాపింగ్ ఆధారంగా డిజిటల్ సర్వే చేపట్టింది. గతంలో వ్యవసాయ విస్తరణాధికారుల ద్వారా ఈ సర్వే నిర్వహించారు. అన్ని గ్రామాల్లో రైతులు, సర్వే నంబర్లవారీగా సర్వే చేయడానికి ఇప్పుడున్న వ్యవసాయ విస్తరణాధికారులు సరిపోరు. ఈక్రమంలో సర్వేను వేగంగా పూర్తి చేసేందుకు వలంటీర్ల నియామకాన్ని వ్యవసాయ శాఖ చేపట్టింది. ఈమేరకు హనుమకొండ జిల్లాలో వలంటీర్ల ఎంపిక ప్రక్రియ పూర్తి చేశారు. వీరికి ఈ నెల 23న శిక్షణ ఇవ్వనున్నారు. వీరు క్షేత్ర స్థాయిలో పంటల ఫొటోలు తీసి డిజిటల్ పద్ధతిలో నమోదు చేస్తారు. శిక్షణ ఇచ్చిన వెంటనే వీరు సర్వే మొదలు పెట్టేలా అధికారులు కార్యాచరణను రూపొందించారు.
రెవెన్యూ గ్రామానికో వలంటీర్
తాత్కాలిక వలంటీర్లుగా గ్రామాల్లోని నిరుద్యోగ యువతకు అవకాశాన్ని కల్పించారు. ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ కలిగి ఉండి, పదో తరగతి నుంచి డిగ్రీ వరకు చదువుతున్న వారికి అవకాశం కల్పిస్తున్నారు. గ్రామంలోని భూములు, యాప్‌పై అవగాహన కలిగి ఉన్న వారికి, వ్యవసాయ డిప్లమో చేసిన అభ్యర్థులకు ప్రాధాన్యం కల్పిస్తున్నారు. నియమితులైన తాత్కాలిక వలంటీర్లకు ఒక్క ఫొటోకు రూ.7 చొప్పున పారితోషికాన్ని అందిస్తారు. ప్రతీ రెవెన్యూ గ్రామానికి ఒక వలంటీర్ చొప్పున నియమిస్తున్నారు. ఈ వలంటీర్లు పొలాల్లోకి వెళ్లి పంటల ఫొటోలు తీసి ప్రభుత్వ యాప్‌లో అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. దీనివల్ల ప్రభుత్వానికి పంట దిగుబడిపై కచ్చితమైన అంచనా రావడమే కాకుండా, రైతులకు సకాలంలో పథకాలు అందుతాయి. 45 రోజుల్లో డిజిటల్ క్రాప్ సర్వే పూర్తి చేయాల్సి ఉంటుంది. ఈ తాత్కాలిక వలంటీర్లు కేవలం 45 రోజులు మాత్రమే పని చేస్తారు. వీరు రైతుల కమతాల వద్దకు వెళ్లి సర్వే నంబర్, రైతుల వారీగా పంట ఫొటో తీసి వివరాలు నమోదు చేస్తారు. గ్రామాల్లో ఉంటూ ఖాళీ సమయంలో ఆదాయం పొందాలనుకునే నిరుద్యోగులకు ఇది ఒక మంచి అవకాశం.
జిల్లాలో ఇలా..
హనుమకొండ జిల్లాలో మొత్తం 162 గ్రామాలున్నాయి. ఇందులో 150 గ్రామాలు శాటిలైట్ మ్యాపింగ్ కలిగినవి ఉన్నాయి. రెండు రెవెన్యూ శివారు గ్రామాలు నగరంలో ఉండి పంటల సాగు చేయడం లేదు. శాటిలైట్ మ్యాపింగ్ సిద్ధంగా ఉన్న గ్రామాల్లో ఎంపిక చేసిన తాత్కాలిక వలంటీర్లు డిజిటల్ పద్ధతిలో పంటలను నమోదు చేస్తారు. శాటిలైట్ మ్యాపింగ్ లేని 8 గ్రామాల్లో వ్యవసాయ విస్తరణాధికారులు పంటలు నమోదు చేస్తారు. హనుమకొండ జిల్లాలో అన్ని పంటలు కలిపి ఇప్పటి వరకు 1,77,735 ఎకరాల్లో సాగు చేశారు. వరి 1,11,380 ఎకరాలు, మొక్కజొన్న 65,700 ఎకరాలు, జొన్న 485 ఎకరాలు, పెసర 11 ఎకరాలు, మినుములు 12 ఎకరాలు, వేరు శనగ 145, నువ్వు 157 ఎకరాల్లో సాగు చేశారు.
ప్రక్రియ వేగవంతానికి వలంటీర్లు
యాసంగిలో సాగు చేసిన పంటలను వేగంగా డిజిటల్ సర్వే చేసేందుకు వలంటీర్ల నియామకాన్ని వ్యవసాయ శాఖ చేపట్టింది. ఈ మేరకు జిల్లాలో ఎంపిక ప్రక్రియ పూర్తయ్యింది. వీరు శిక్షణ అనంతరం వెంటనే పంటల నమోదు ప్రక్రియ చేపడతారు.
మొక్కజొన్న
65,700 ఎకరాలు
వరి
1,11,380 ఎకరాలు
వలంటీర్లతో డిజిటల్ క్రాప్ సర్వే


