నేడు గ్రేటర్‌ వరంగల్‌ గ్రీవెన్స్‌ | - | Sakshi
Sakshi News home page

నేడు గ్రేటర్‌ వరంగల్‌ గ్రీవెన్స్‌

Feb 23 2026 9:41 AM | Updated on Feb 23 2026 9:41 AM

నేడు

నేడు గ్రేటర్‌ వరంగల్‌ గ్రీవెన్స్‌

వరంగల్‌ అర్బన్‌: వరంగల్‌ మహానగర పాలకసంస్థ (జీడబ్ల్యూఎంసీ) ప్రధాన కార్యాలయంలో సోమవారం గ్రీవెన్స్‌సెల్‌ నిర్వహిస్తున్నట్లు కమిషనర్‌ చాహత్‌ బాజ్‌పాయ్‌ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు రాత పూర్వకంగా దరఖాస్తులు స్వీకరించి, అక్కడి అక్కడే పరిష్కరించేందుకు కృషి చేస్తామని తెలిపారు. సమస్యల పరిష్కారానికి నిర్వహిస్తున్న గ్రీవెన్స్‌సెల్‌ను సద్వినియోగం చేసుకోవాలని కమిషనర్‌ సూచించారు.

వరంగల్‌ కలెక్టరేట్‌లో..

న్యూశాయంపేట: వరంగల్‌ జిల్లా కలెక్టరేట్‌లో నేడు (సోమవారం) గ్రీవెన్స్‌ నిర్వహిస్తున్నట్లు కలెక్టర్‌ డాక్టర్‌ సత్యశారద ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకొని తమ సమస్యల పరిష్కారానికి వినతులు అందించాలని కోరారు.

మేడారంలో భక్తుల రద్దీ

ఎస్‌ఎస్‌తాడ్వాయి: మేడారానికి ఆదివారం భక్తులు భారీగా తరలివచ్చారు. దీంతో గద్దెల ప్రాంగణం భక్తుల రద్దీతో కోలాహలంగా మారింది. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు జంపన్నవాగు స్నానఘట్టాల వద్ద పుణ్యస్నానాలు ఆచరించారు. అనంతరం గద్దెల వద్దకు చేరుకుని సమ్మక్క–సారలమ్మకు పసుపు, కుంకుమ, చీరసారె, కానుకలు, ఒడిబియ్యం, ఎత్తు బంగారం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. భక్తుల రద్దీ పెరగడంతో ప్రధాన ఆర్చీ ద్వారం నుంచి భక్తులను పోలీసులు క్రమపద్ధతిలో దర్శనాలకు పంపించారు. నార్లాపూర్‌ పోలీస్‌స్టేషన్‌ ఎస్సై కమలాకర్‌ భక్తుల రద్దీని పర్యవేక్షించి ప్రశాంతంగా దర్శించుకునేలా చర్యలు తీసుకున్నారు. మేడారం కార్యనిర్వహణాధికారి వీరస్వామి కుటుంబ సమేతంగా అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎత్తు బంగారం అమ్మవార్లకు మొక్కుగా సమర్పించారు.

యువకుడిపై

కార్పొరేటర్‌ దాడి

హసన్‌పర్తి: రాజకీయ కక్షలను దృష్టిలో పెట్టుకుని ఓ యువకుడిపై కార్పొరేటర్‌ దాడికి పాల్పడ్డారు. ఈసంఘటన కాకతీయ యూనివర్సిటీ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని రెడ్డిపురం సమీపంలో జరిగింది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. నగరంలోని నాలుగో డివిజన్‌ కమ్యూనిటీహాల్‌లో ఆదివారం బొడ్రాయి ప్రతిష్ఠాపన కోసం సమావేశం నిర్వహించారు. యాదవ కులసంఘం పెద్ద మనిషి నేతుల రఘుయాదవ్‌ అధ్యక్షతన సమావేశం జరిగింది. అయితే విషయం తెలుసుకున్న కార్పొరేటర్‌ బొంగు అశోక్‌యాదవ్‌ అక్కడికి చేరుకున్నారు. కార్పొరేటర్‌ లేకుండా సమావేశం ఎలా నిర్వహిస్తారని గొడవకు దిగారు. కుల పెద్ద మనిసి రఘును చంపుతానని కార్పొరేటర్‌ బెదిరింపులకు గురిచేశారు. ఎమ్మెల్యేతో తిరుగుతావురా.. ఈ డివిజన్‌లో లీడర్‌ అంటే ఉంటే నేనే ఉండాలి రా.. అని బెదిరించినట్లు రఘు తెలిపారు

పొలం నుంచి ఇంటికి వస్తుండగా..

కాగా, మధ్యాహ్నం రెండున్నర గంటల ప్రాంతంలో నేతుల రఘు, అతడి తమ్ముడు నేతుల లక్ష్మణ్‌ బైక్‌పై రెడ్డిపురం సమీపంలోని వ్యవసాయ పొలం వద్దకు వెళ్లారు. తిరిగి ఇంటికి వస్తున్న క్రమంలో కార్పొరేటర్‌ బొంగు అశోక్‌యాదవ్‌, అతడి అనుచరుడు లింగంపల్లి కుమార్‌ వారిని అడ్డగించారు. కత్తితో రఘుపై దాడికి యత్నించగా, లక్ష్మణ్‌ అడ్డుకోవడంతో అతడి అరచేతికి తీవ్ర గాయమైంది. మళ్లీ అదేకత్తితో రఘు, లక్ష్మణ్‌పై దాడికి యత్నించగా వారు అక్కడి నుంచి ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరుగులుదీశారు. క్షతగాత్రుడు లక్ష్మణ్‌ను చికిత్స నిమిత్తం ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు స్థానికులు తెలిపారు. బాధితుడి సోదరుడు రఘు ఇచ్చిన ఫిర్యాదు మేరకు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీస్‌ ఇన్‌స్పెక్టర్‌ రవికుమార్‌ తెలిపారు.

నేడు గ్రేటర్‌ వరంగల్‌ గ్రీవెన్స్‌1
1/1

నేడు గ్రేటర్‌ వరంగల్‌ గ్రీవెన్స్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement