పిల్లల సామర్థ్యాలపై సర్వే
రెండో తరగతి చదివే విద్యార్థుల ప్రాథమిక చదువు అంచనా
కాళోజీ సెంటర్: జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో చదువుతున్న 2వ తరగతి విద్యార్థుల ప్రాథమిక విద్యాసామర్థ్యాలను అంచనా వేసేందుకు స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ (ఎస్‌సీఈఆర్‌టీ) ఆధ్వర్యంలో ప్రత్యేక సర్వే నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా డీఎడ్, బీఎడ్ విద్యార్థులకు నేటి నుంచి (23, 24వ తేదీలు) రెండు రోజుల పాటు శిక్షణ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ శిక్షణ కార్యక్రమం రంగశాయిపేటలోని ప్రభుత్వ హైస్కూల్‌లో ఉదయం 9 నుంచి 4.30 గంటల వరకు రిస్సోర్స్ పర్సన్స్ ఇవ్వనున్నారు. ఎస్‌సీఈఆర్‌టీ ద్వారా ఎంపిక చేయబడిన మొత్తం 53 పాఠశాలలకు వెళ్లి 2వ తరగతి విద్యార్థుల తెలుగు, ఇంగ్లిష్, ఉర్దూ, గణితశాస్త్రం విషయాల్లో సామర్థ్యాలను పరిశీలిస్తారు.
25వ తేదీ నుంచి సర్వే..
జిల్లాలో ఎంపిక చేయబడిన 53 పాఠశాలల్లో ఈనెల 25, 26, 27 తేదీల్లో సర్వే చేపట్టనున్నారు. విద్యార్థుల పనితీరును టన్‌జెరిన్‌యాప్‌లో నమోదు చేయాల్సి ఉంటుంది. ఈ కార్యక్రమంలో ఫీల్డ్ ఇన్విస్టిగేటర్లుగా 53 మంది డీఎడ్, బీఎడ్ విద్యార్థులను నియమించారు.
ఎఫ్‌ఎల్‌ఎన్ ఉద్దేశం ఇదే..
ఎన్‌ఈపీ 2020 ప్రకారం ఫౌండేషన్ లిటరసీ అండ్ న్యూమరసీ (ఎఫ్‌ఎల్‌ఎన్) ఉద్దేశం వయసుకు తగ్గట్టుగా చదవడం, రాయడం, గణిత నైపుణ్యాలను పొందేలా లక్ష్యంగా పెట్టుకుంది. 2026–27 నాటికి అందరు విద్యార్థులు ప్రాథమిక నైపుణ్యాలను సాధి ంచేలా చూడటం. ఇది పిల్లల భవిష్యత్ విద్యా విజ యానికి, అభిజ్ఞ వికాసానికి పునాదిగా నిలవనుంది. అందుకు తగ్గట్టుగా జిల్లాలో ఎఫ్‌ఎల్‌ఎన్ పనితీరుపై అంచనా వేయడానికి శిక్షణ ప్రారంభిస్తున్నారు.
ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో చదువుతున్న 2వ తరగతి విద్యార్థుల ప్రాథమిక చదువు తెలుగు, ఇంగ్లిష్, ఉర్దూ, గణిత శాస్త్రం ఫౌండేషన్ లిటరసీ అండ్ న్యూమరిసీ (ఎఫ్‌ఎల్‌ఎన్) విషయాల్లో సామర్థ్యాలను అంచనా వేయడానికి ఎస్‌సీఈఆర్‌టీ దృష్టి సారించింది. ఇందులో భాగంగా జిల్లాలో శిక్షణ ప్రారంభించి విద్యార్థుల సామర్థ్యాన్ని అంచనా వేసి నివేదిక అందిస్తారు. ఎంపిక చేసిన వారు ఈ శిక్షణ కార్యక్రమంలో పాల్గొనాలి.
– బి.రంగయ్యనాయుడు, డీఈఓ
జిల్లాలో 53 పాఠశాలల ఎంపిక
సర్వే చేయనున్న డీఎడ్, బీఎడ్ విద్యార్థులు
పిల్లల సామర్థ్యాలపై సర్వే
పిల్లల సామర్థ్యాలపై సర్వే


