ఇక ఆస్తుల లెక్క పక్కా | - | Sakshi
Sakshi News home page

ఇక ఆస్తుల లెక్క పక్కా

Feb 24 2026 6:52 AM | Updated on Feb 24 2026 6:52 AM

ఇక ఆస

ఇక ఆస్తుల లెక్క పక్కా

భూముల సర్వేకు నక్ష ప్రాజెక్టు

వర్ధన్నపేట: భూ సంబంధిత ఆస్తులకు కచ్చితమైన సరిహద్దులు, యాజమాన్య హక్కులు దక్కనున్నాయి. అందుకు కేంద్ర ప్రభుత్వం కొత్తగా నక్ష ప్రాజెక్టును అందుబాటులోకి తెచ్చింది. ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న నక్ష (నేషనల్‌ జియోస్పెషియల్‌ నాలెడ్జ్‌ – బేస్‌డ్‌ ల్యాండ్‌ సర్వే ఆఫ్‌ అర్బన్‌ హాబిటేషన్స్‌) పైలట్‌ ప్రాజెక్టు ఇప్పుడు వర్ధన్నపేట మున్సిపాలిటీలో కొనసాగుతోంది. దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన 157 మున్సిపాలిటీల్లో తెలంగాణ రాష్ట్రం నుంచి 10 మున్సిపాలిటీలను ఎంపిక చేశారు. అందులో వర్ధన్నపేట ఉంది. ఇప్పటికి పట్టణంలో 12 వార్డులను 158 బ్లాక్‌లుగా విభజించి సర్వే చేపట్టారు. గతంలో ఇంటి విస్తీర్ణంపై డ్రోన్లు, ఏరియల్‌ సర్వే చేసిన అధికారులు.. ఇప్పుడు ఇంటింటికి నేరుగా వెళ్లి కొలతలు వేస్తున్నారు. ఖాళీ స్థలాలు, ఇళ్లు, కమర్షియల్‌ భవనాలు, వ్యవసాయ భూముల్లో ప్రతీ అంగుళాన్ని నమోదు చేస్తున్నారు.

ఇప్పటికే పట్టణంలోని ఇళ్ల సర్వే పూర్తి

మున్సిపాలిటీలో మొత్తం 3,500 ఇళ్లు ఉండగా, వాటితో పాటు 2వేల ఎకరాల్లో సర్వే పూర్తయింది. దీంతో పాటు పట్టణ పరిధిలో 10 వేల ఎకరాల వ్యవసాయ భూమి ఉండగా, సర్వే నిర్వహిస్తున్నారు. గతనెల 23 నుంచి 13 బృందాలతో సర్వే చేస్తున్నారు. ఈ సర్వే వీలైనంత తొందరగా పూర్తి చేయడానికి సర్వే బృందాలను ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ సలహాలు, సూచనలు చేస్తున్నారు.

అనేక ప్రయోజనాలు

డిజిటల్‌ సర్వే వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. భూ రికార్డులను నవీకరించడం, డిజిటలైజేషన్‌ చేయడం పట్టణ ప్రణాళిక మెరుగైన పౌరసేవల కోసం కచ్చితమైన జీఐఎస్‌ ఆధారిత మ్యాపులను అధికారులు తయారు చేశారు. ఆస్తి యజమానులకు స్పష్టమైన హక్కుల ధ్రువీకరణ ఇవ్వనున్నారు. ఆస్తికి ఇచ్చే డిజిటల్‌ కార్డు.. ఆధార్‌ కార్డుగా ఉపయోగపడుతుంది. యజమాని ఆస్తికి ఒక యూనిక్‌ నంబరు కేటాయిస్తారు. సర్వే తర్వాత ఇచ్చే పత్రం పక్కాగా ఉంటుంది. ఒకసారి పత్రం ఇస్తే కబ్జాల భయమే ఉండదు. సరిహద్దు తగాదాలు పూర్తిగా తగ్గనున్నాయి. ఆస్తి పన్ను చెల్లించడం నుంచి మ్యూటేషన్‌ వరకు అంతా ఆన్‌లైన్‌లోనే నిక్షిప్తం అవుతుంది. డిజిటల్‌ కార్డు నంబర్‌ నమోదు చేస్తే ఇంటి యజమాని ఆస్తుల వివరాలు తెలిసేలా ఆన్‌లైన్‌లో పొందుపరుస్తారు. డిజిటల్‌ కార్డుతో ప్రాపర్టీ విలువ పెరగడంతో పాటు బ్యాంకుల్లో కూడా రుణాలు సులభంగా పొందే అవకాశం ఉంటుంది. ఒక్కసారి ఆన్‌లైన్‌లో డేటా నమోదైతే భవిష్యత్‌లో చట్టపరమైన సమస్యలు తగ్గుతాయని అధికారులు స్పష్టం చేస్తున్నారు.

ప్రజలకు అవగాహన కల్పిస్తాం

నక్ష సర్వేపై ప్రజలకు అవగాహన కల్పించడానికి చర్యలు చేపడతాం. వారి అపోహలను తొలగించి ఆస్తుల భద్రత కోసమే అని ప్రచారం చేయిస్తాం. డిజిటల్‌ మ్యాపింగ్‌కు పట్టణ ప్రజలు సహకరించాలి. ఇంటికి అధికారులు వచ్చినప్పుడు ఖాళీ స్థలాలు, ఇళ్లు, వ్యవసాయ భూముల వివరాలన్నింటిని ప్రజలు పక్కాగా తెలపాలి.

– పాలకుర్తి సారంగపాణి, చైర్మన్‌, వర్ధన్నపేట

నెలలో సర్వే పూర్తిచేస్తాం

ఇప్పటికే ఇళ్ల సర్వే దాదాపు పూర్తయింది. ప్రజల్లో ఉన్న అపోహలను తొలగిస్తూ పనులు కొనసాగిస్తున్నాం. అవగాహన కార్యక్రమాలతో ప్రజలను చైతన్యం చేస్తాం. ఇప్పటికే 2 వేల ఎకరాల వ్యవసాయ భూముల సర్వే పూర్తి చేశాం. నెలరోజుల్లో సర్వే పూర్తిచేస్తాం. అందుకు ప్రజలు సహకరించాలి.

– బి.నాగభూషణం, డిప్యూటీ ఇన్‌స్పెక్టర్‌ ఆఫ్‌ సర్వేయర్‌

భూమి, ఇళ్ల రికార్డుల ఆధునికీకరణ

పకడ్బందీగా కొలతలు, యాజమాన్య హక్కులు

యూనిక్‌ నంబర్‌ కేటాయింపు

వర్ధన్నపేటలో కొనసాగుతున్న నక్ష డిజిటల్‌ సర్వే

ప్రజల్లో అపోహలు

డిజిటల్‌ సర్వే కోసం అధికారుల బృందం ఇంటికి వెళ్తే కొందరు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పన్నులు పెంచుతారేమోనని, ఖాళీ ప్రదేశాలను ప్రభుత్వం తీసుకుంటుందేమోనని ప్రజల్లో అపోహలు వెంటాడుతున్నాయి. వివరాలు చెప్పేందుకు ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తున్నారు. అయితే, ఇదిపూర్తిగా ఆస్తుల భద్రత కోసమేనని వారికి అధికారులు వివరిస్తున్నారు. డిజిటల్‌ సర్వేపై ప్రజల్లో నెలకొన్న అనుమానాలు తొలగించేందుకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే ఇంటి పన్నులు పెంచారని గగ్గోలు పెడుతున్న ప్రజలు.. ఖరీదైన ఖాళీ స్థలాల వివరాలు చెప్పేందుకు జంకుతున్నట్లు తెలుస్తోంది. వచ్చే మార్చి నాటికి తమ లక్ష్యం పూర్తయ్యేలా అధికారులు సర్వే నిర్వహిస్తున్నారు.

ఇక ఆస్తుల లెక్క పక్కా1
1/4

ఇక ఆస్తుల లెక్క పక్కా

ఇక ఆస్తుల లెక్క పక్కా2
2/4

ఇక ఆస్తుల లెక్క పక్కా

ఇక ఆస్తుల లెక్క పక్కా3
3/4

ఇక ఆస్తుల లెక్క పక్కా

ఇక ఆస్తుల లెక్క పక్కా4
4/4

ఇక ఆస్తుల లెక్క పక్కా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement