కొమ్మాల బ్రహ్మోత్సవాలు ప్రారంభం
గీసుకొండ: వరంగల్ జిల్లా గీసుకొండ మండలంలోని కొమ్మాల లక్ష్మీనర్సింహస్వామి బ్రహ్మోత్సవాలకు సోమవారం అంకురార్పణ జరిగింది. తొలిరోజు రాత్రి అధ్యయనోత్సవ కార్యక్రమాన్ని అర్చకులు నిర్వహించారు. వైష్ణవ సంప్రదాయంలో ఆళ్వారులు రచించిన దివ్య ప్రబంధాన్ని అధ్యయనోత్సవంలో అర్చకులు పఠించడం ఆనవాయితీగా వస్తోంది. వేదాలకు సమానమైన నాలాయిర ద్రవిడ దివ్య ప్రబంధ పారాయణం అధ్యయనోత్సవంతో ప్రారంభమవుతుందని అర్చకులు తెలిపారు. ఆలయ వంశపారంపర్య ధర్మకర్త, చైర్మన్ చక్రవర్తుల శ్రీనివాసాచార్యులు, అర్చకులు విష్ణు, ఫణితో పాటు పలువురు అర్చకులు, భక్తులు పాల్గొన్నారు. ఈనెల 27న రాత్రి 10 గంటలకు స్వామివారి కల్యాణం జరుగుతుందని, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని అర్చకులు కోరారు.
డెంగీ వ్యాధిపై అప్రమత్తంగా ఉండాలి
దేశాయిపేట: నగర ప్రజలు డెంగీ వ్యాధిపై అప్రమత్తంగా ఉండాలని జిల్లా మలేరియా విభాగం అధికారి కె.రజనీ సూచించారు. డీఎంహెచ్‌ఓ డాక్టర్ సాంబశివరావు ఆదేశాల మేరకు దేశాయిపేట పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని నజ్రేతుపురంలో నమోదైన డెంగీ బాధితుడి ఇంటిని రజనీతో పాటు జిల్లా డిప్యూటీ మాస్ మీడియా అధికారి అనిల్‌కుమార్ సోమవారం క్షేత్రస్థాయిలో పర్యటించారు. బాలుడి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకొని, ఇంటి పరిసరాలను పరిశీలించారు. ఈ సందర్భంగా రజనీ మాట్లాడుతూ ఇంటి చుట్టుపక్కల నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని చెప్పారు. దోమల నివారణకు తగు చర్యలు తీసుకోవాలని వివరించారు. అనిల్‌కుమార్ మాట్లాడుతూ ప్రజలు కూడా తమ సామాజిక బాధ్యతలో భాగంగా వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాల పరిశుభ్రతను విధిగా పాటించాలని కోరారు. కార్యక్రమంలో ఆరోగ్య విస్తరణ అధికారులు సదానందం, విజయేంద్రకుమార్, మున్సిపల్ హెల్త్ సూపర్‌వైజర్ మధుకర్, సిబ్బంది రవి తదితరులు పాల్గొన్నారు.
నియామకం
పర్వతగిరి: తెలంగాణ ఉద్యమకారుల ఫోరం వరంగల్ జిల్లా అధ్యక్షుడిగా మండలంలోని సోమారం గ్రామానికి చెందిన చల్లా వెంకటేశ్వర్లు నియామకం అయ్యారు. ఈ మేరకు ఆయనకు తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షుడు, స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ నందగిరి రజనీకాంత్ సోమవారం నియామక పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఉద్యమకారుల సంక్షేమం, గౌరవం, ఉద్యమకారులకు ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలుకు తనవంతు కృషి చేస్తానని తెలిపారు.
ఆసక్తికరంగా శతావధానం
కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీలో స్వర్ణోత్సవాల సందర్భంగా తెలుగు విభాగం, కాకతీయ పద్య కవితా వేదిక ఆధ్వర్యంలో కేయూలోని సెనేట్‌హాల్‌లో చేపట్టిన అవధాన ప్రియ చేపూరిశ్రీరాం శతావధానం రెండో రోజు సోమవారం ఆసక్తికరంగా కొనసాగింది. కాకతీయ పద్య కవితా వేదిక అధ్యక్షుడు కందిశంకరయ్య సంచాలకత్వంలో అవధాని చతురతతో సమర్థవంతంగా 25 సమస్యా పూరణలు, 25 దత్త పదులను, 25 వర్ణణలను రెండు అవృత్తాలను పూర్తి చేశారు. మధ్యలో 25 ఆశువులను కూడా నిర్వహించారు. పృచ్ఛకులు అడిగిన వివిధ అంశాలపై సమస్యలపై పద్యరూపంలో పూరణలు చేశారు. దుష్కర ప్రాసలను, అసందర్భ సమస్యలను దత్తపదులను అలవోకగా అవధాని చేపూరిశ్రీరాం పూరణ చేశారు.
కొమ్మాల బ్రహ్మోత్సవాలు ప్రారంభం
కొమ్మాల బ్రహ్మోత్సవాలు ప్రారంభం


