అర్జీలను త్వరగా పరిష్కరించాలి
● కలెక్టర్ డాక్టర్ సత్యశారద
న్యూశాయంపేట: ప్రజావాణిలో ప్రజలు సమర్పించిన అర్జీలను అధికారులు త్వరగా పరిష్కరించాలని కలెక్టర్ డాక్టర్ సత్యశారద ఆదేశించారు. గ్రీవెన్స్‌లో భాగంగా కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన కార్యక్రమంలో ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. ఈ సందర్భంగా దరఖాస్తుదారుల సమక్షంలోనే సంబంధిత అధికారులతో కలెక్టర్ చర్చించారు. ప్రజల సమస్యలను వేగవంతంగా పరిష్కరించాలని సూచించారు. ప్రజావాణికి 150 దరఖాస్తులు రాగా, అందులో రెవెన్యూశాఖకు సంబంధించినవి 56, జీడబ్ల్యూఎంసీ 38, ఇతర శాఖలకు సంబంధించినవి 56 దరఖాస్తులు వచ్చాయని అధికారులు తెలిపారు.
30 ఏళ్లుగా డ్రెయినేజీ లేదు
మేము వరంగల్ నగరంలోని కాశిబుగ్గ వివేకానంద కాలనీలో ముప్పై ఏళ్లుగా నివాసముంటున్నాం. మా కాలనీలో రోడ్డు వేశారు కానీ డ్రెయినేజీలు నిర్మించలేదు. దాంతో రోడ్లపై మురుగు పారుతోంది. మురుగునీటి కాల్వ లు నిర్మించాలని పలుమార్లు కలెక్టర్, కమిషనర్‌కు విన్నవించినా ఫలితం లేదు.
– అమ్జద్ పాషా, వరంగల్, కాశిబుగ్గ
ఇందిరమ్మ ఇల్లు ఇప్పించండి
మాకు ఇల్లు లేదు. ఉండడానికి సొంతిల్లు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. అద్దె ఇంట్లో ఉంటున్నాం. ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. ప్రభుత్వం ద్వారా ఇందిరమ్మ ఇల్లు ఇప్పించండి.
– ముదిగిరి రాజేష్, చెన్నారావుపేట
‘సర్’పై సమీక్ష
ప్రజావాణి అనంతరం జిల్లాలో కొనసాగుతున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్) మ్యాపింగ్ ప్రక్రియపై తహసీల్దారులతో కలెక్టర్ సత్యశారద సమీక్ష సమావేశం నిర్వహించారు. భూ సంబంధిత రికార్డుల కచ్చితత్వం కోసం చేపట్టిన సర్వే కార్యక్రమాన్ని వేగవంతం చేసి ఎలాంటి పొరపాట్లు లేకుండా గడువులోపు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ సంధ్యారాణి, డీఆర్‌ఓ విజయలక్ష్మి,, ఆర్డీఓలు సుమ, ఉమారాణి, డీఎంహెచ్‌ఓ డాక్టర్ సాంబశివరావు, హౌసింగ్ పీడీ శ్రీవాణిలతో పాటు జిల్లా అధికారులు పాల్గొన్నారు.
అవినీతి అధికారులపై చర్య తీసుకోవాలి
మా గ్రామంలో ఉపాధి హామీ చట్టం ద్వారా మంజూరైన సీసీ రోడ్డు పనులు చేయకుండానే కొంతమంది ప్రజాప్రతినిధులు, కాంట్రాక్టర్లు బిల్లులు డ్రా చేసుకుంటున్నారు. అడ్డుకోవాల్సిన అధికారులు వారికి వత్తాసు పలుకుతూ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. ఉన్నతాధికారులు విచారణ చేసి బాధ్యులైన అధికారులు, ప్రజాప్రతినిధులు, కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకోవాలి. – స్వర్ణమేరీ, తిమ్మరాయ పహాడ్
అర్జీలను త్వరగా పరిష్కరించాలి
అర్జీలను త్వరగా పరిష్కరించాలి


