ఇంటర్‌ టెక్నాలజీ ఎంటర్‌ ! | - | Sakshi
Sakshi News home page

ఇంటర్‌ టెక్నాలజీ ఎంటర్‌ !

Feb 24 2026 6:52 AM | Updated on Feb 24 2026 6:52 AM

ఇంటర్‌ టెక్నాలజీ ఎంటర్‌ !

ఇంటర్‌ టెక్నాలజీ ఎంటర్‌ !

సాక్షి, వరంగల్‌: ఇంటర్మీడియట్‌ పరీక్షల నిర్వహణ ముఖచిత్రం మారిపోతోంది. ఈసారి సరికొత్తగా హాల్‌టికెట్‌ మీద ముద్రించిన క్యూఆర్‌ కోడ్‌తో విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు చేరుకోవడం సులభంగా మారింది. ఒకవేళ పొరపాటున ప్రశ్నాపత్రం లీకేజీ అయినా అది ఏ సెంటర్‌ నుంచి బయటకు వచ్చిందో తెలుసుకునేందుకు వీలుగా ప్రశ్నపత్రం మీద క్యూఆర్‌ కోడ్‌ ముద్రించారు. దాన్ని స్కాన్‌ చేస్తే ఎక్కడి నుంచి జరిగిందనేది క్షణాల్లో గుర్తించే సౌలభ్యం వచ్చింది. ఇలా ఆధునిక సాంకేతికతను అప్‌డేట్‌ చేసుకుంటూ ముందుకెళ్తున్న ఇంటర్మీడియట్‌ అధికారులు.. పరీక్ష కేంద్రాల్లో కాపీయింగ్‌ జరగకుండా ఉండేందుకు సీసీటీవీ కెమెరాలతో పర్యవేక్షించనున్నారు. ఇలా ఆధునిక టెక్నాలజీని వినియోగించుకుంటూనే క్షేత్రస్థాయిలో ఫ్లయింగ్‌ స్క్వాడ్‌లు, సిట్టింగ్‌ స్క్వాడ్‌లు తనిఖీలు చేయనున్నాయి. కట్టుదిట్టమైన నిబంధనల మధ్య ఇంటర్మీడియట్‌ విద్యార్థులు మూడు గంటల పాటు ప్రశాంతంగా పరీక్షలు రాసేలా ఏర్పాట్లు చేస్తున్నారు. గంట ముందే పరీక్షా కేంద్రానికి రావాలంటున్న ఇంటర్మీడియట్‌ అధికారులు.. నిమిషం నిబంధన విషయంలో కాస్త మానవత ధృక్పథంతో వ్యవహరించాలనే ఆదేశాలు కూడా ఉన్నాయి. ఆయా కళాశాలల ప్రిన్సిపాళ్ల సంతకం హాల్‌ టికెట్లపై లేకున్నా పరీక్షలకు అనుమతించనున్నారు.

16 కేంద్రాలపై ప్రత్యేక దృష్టి సారించాల్సిందే..

జిల్లాలోని పది ప్రభుత్వ కళాశాలల్లో 160 సీసీటీవీ కెమెరాలున్నాయి. ఒక్కో ప్రభుత్వ కళాశాలలో 16 సీసీటీవీ కెమెరాలున్నాయి. అయితే, 16 ఎయిడెడ్‌, సెక్టార్‌, ప్రైవేట్‌ కళాశాలల్లో మాత్రం ఒక్కో కాలేజీలో ఐదు సీసీటీవీ కెమెరాలే ఉండడం కాస్త ఆందోళన కలిగిస్తోంది. ఇక్కడ ప్రశ్నపత్రం తెరిచే గదితో పాటు ఎంట్రెన్స్‌, వరండాలో మాత్రమే సీసీటీవీ కెమెరాలున్నాయి. తరగతి గదుల్లో సీసీటీవీ కెమెరాలు లేకపోవడంతో ఆ పాఠశాలలపై ఫ్లయింగ్‌, సిట్టింగ్‌ స్క్వాడ్‌లు ప్రత్యేక దృష్టి సారించాలనే డిమాండ్‌ వస్తోంది.

స్కాన్‌ చేస్తే దారి చూపిస్తుంది

గతంలో గూగుల్‌ ప్లే స్టోర్‌ ద్వారా డౌన్‌లోడ్‌ చేసుకున్న సెంటర్‌ లొకేటర్‌ యాప్‌లో సెంటర్‌ కోడ్‌ టైప్‌ చేస్తే ఆయా పరీక్ష కేంద్రానికి తీసుకెళ్లేది. ఇది వాడే క్రమంలో చాలా మందికి గతేడాది ఇబ్బందులు ఎదురయ్యాయి. దీన్ని దృష్టిలో ఉంచుకొని ఈసారి ఆయా కేంద్రాల గూగుల్‌ జియో కోఆర్డినేట్స్‌ తీసుకొని హాల్‌ టికెట్‌పైనే క్యూఆర్‌ కోడ్‌ ముద్రించారు. ఈ కోడ్‌ను గూగుల్‌ లెన్స్‌ ద్వారా స్కాన్‌ చేస్తే నేరుగా సదరు కేంద్రానికి తీసుకెళ్లనుంది. ఉదాహరణకు వరంగల్‌లోని ఎల్‌బీ కళాశాలలో ఇంటర్మీడియట్‌, డిగ్రీ, పీజీ క్యాంపస్‌లు ఉంటాయి. క్యూఆర్‌ కోడ్‌ను ఉపయోగిస్తే నేరుగా పరీక్ష కేంద్రమైన ఇంటర్మీడియట్‌ క్యాంపస్‌కు మాత్రమే తీసుకొని వెళ్లనుంది. ఈసారి సెంటర్‌ పేరును హాల్‌టికెట్లపై గోల్డ్‌ ఫేజ్‌ లెటర్లలో ముద్రించారు. ఒకవేళ ప్రశ్నాపత్రం లీకై తే దానిమీద ఉండే క్యూఆర్‌ కోడ్‌ను గూగుల్‌ లెన్స్‌తో స్కాన్‌ చేస్తే ఏ సెంటరనేది తెలుస్తుంది. గతంలో ఏ సెంటర్‌ నుంచి లీకైందనేది తెలుసుకునేందుకు ఇబ్బందిగా ఉండేది.

పరీక్ష రాసే విద్యార్థుల సంఖ్య ఇలా..

సంవత్సరం జనరల్‌ ఒకేషనల్‌ మొత్తం

ఫస్ట్‌ ఇయర్‌ 5,210 793 6,003

సెకండ్‌ ఇయర్‌ 5,356 807 6,163

మొత్తం 10,566 1,600 12,166

హాల్‌టికెట్లపై తొలిసారిగా క్యూఆర్‌ కోడ్‌లు

గూగుల్‌ లెన్స్‌తో స్కాన్‌ చేస్తే పరీక్ష కేంద్రానికి దారి

ప్రశ్నాపత్రం లీకై తే తెలిసేలా

క్యూఆర్‌ కోడ్‌ ముద్రణ

240 సీసీటీవీ కెమెరాల నిఘాలోజిల్లాలో వార్షిక పరీక్షలు

రేపటి నుంచి జరగనున్న ఇంటర్‌ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement