డీఫ్లోరైడ్ ప్రాజెక్టును పునరుద్ధరిస్తాం
● నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి
నర్సంపేట: ఖానాపురం మండలం అశోక్‌నగర్ డీఫ్లోరైడ్ ప్రాజెక్టును పునరుద్ధరించి పట్టణ ప్రజల తాగునీటి సమస్య తీరుస్తామని నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి హామీ ఇచ్చారు. ఈ మేరకు అశోక్‌నగర్ డీఫ్లోరైడ్ ప్రాజెక్టుపై ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మిషన్ భగీరథ, పబ్లిక్ హెల్డ్ డిపార్ట్‌మెంట్ అధికారులతో సోమవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాధవరెడ్డి మాట్లాడుతూ ఇటీవల డీఫ్లోరైడ్ ప్రాజెక్టుపై అసెంబ్లీలో ప్రస్తావించినట్లు తెలిపారు. ప్రాజెక్టు పునరుద్ధరణకు అవసరమయ్యే సుమారు రూ.12 కోట్ల నుంచి రూ.25 కోట్ల నిధుల మంజూరుప్రతిపాదనలు పంపించినట్లు వివరించారు. ప్రాజెక్టుకు కేటాయించిన భూమి ఆక్రమణకు గురికాకుండా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉందని గుర్తుచేశారు. కార్యక్రమంలో అధికారులు, ప్రజా ప్రతినిధులు, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
డీఫ్లోరైడ్ ప్రాజెక్టు సందర్శన
ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ఆదేశాల మేరకు ఖానాపురం మండలం అశోక్‌నగర్ గ్రామంలోని డీఫ్లోరైడ్ ప్రాజెక్టును అధికారులతో కలిసి మున్సిపాలిటీ చైర్‌పర్సన్ పెండెం శ్రీలక్ష్మిరామానంద్, వైస్ చైర్మన్ గంధం నరేందర్ సోమవారం సందర్శించారు. ఈ సందర్భంగా చైర్‌పర్సన్ శ్రీలక్ష్మి మాట్లాడుతూ గతంలో అనేక ఏళ్లుగా నర్సంపేట పట్టణంతో పాటు వివిధ మండలాలకు నిత్యం తాగునీటిని అందించిన డీఫ్లోరైడ్ ప్రాజెక్టు.. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ పట్టింపులేనితనం వల్ల పూర్తిగా నిర్లక్ష్యానికి గురైందని విమర్శించారు. డీఫ్లోరైడ్ ప్రాజెక్టు పునరుద్ధరణ కోసం నిధుల మంజూరుకు ఎమ్మెల్యే ప్రతిపాదనలు పంపించారని వివరించారు. కార్యక్రమంలో మిషన్ భగీరథ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సురేందర్, మిషన్ భగీరథ డీఈ అజార్‌సయ్యద్, మిషన్ భగీరథ డీటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ దేవేందర్‌రెడ్డి, ఏఈఈ వంశీ, పబ్లిక్ హెల్త్ డిపార్ట్‌మెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సుచరణ్, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రవీందర్‌నాథ్, అసిస్టెంట్ ఇంజనీర్ కుమారస్వామి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ ఎర్ర యాకుబ్‌రెడ్డి, కౌన్సిలర్లు, తదితరులు పాల్గొన్నారు.


