వైభవంగా విగ్రహ ప్రతిష్ఠాపనోత్సవం
సంగెం: మండలంలోని గవిచర్ల గ్రామంలోని గుండ బ్రహ్మయ్య దేవాలయ పునఃనిర్మాణం, నూతన విగ్రహా ప్రతిష్ఠాపన మహోత్సవం ఆదివారం వైభవంగా జరిగింది. గుండ బ్రహ్మయ్య స్వామి నూతన దేవాలయంలో శ్రీ మహాగణపతి, సుబ్రహ్మణ్యేశ్వర, శివలింగ, పార్వతిదేవి, నందీశ్వర, ధ్వజస్తంభ, శిఖర, నవగ్రహా, అభయాంజనేయస్వామి, గ్రామ శ్రీలక్ష్మి శిలా విగ్రహా ప్రతిష్ఠాపన మహోత్సవాలను దేవగిరి సంతోష శివాచార్య, శ్యామ్ శివాచార్య, పిల్లలమర్రి కార్తీకేయశాస్రిల ఆధ్వర్యంలో శాస్త్రోత్తంగా నిర్వహించారు. ఉదయం గవ్వాంత పూజలు, గర్తన్యాసము, రత్నన్యాసము, యంత్రస్థాపన, మూర్తిస్థాపన, మహాపూర్ణాహుతి, అగ్ని ఉద్వాసన, ప్రాణ ప్రతిష్ఠాపన, కుంభాభిషేకం, దృష్టికుంభం, ప్రథమ దర్శనము, మహాదాశీర్వచన పూజలు నిర్వహించారు. అనంతరం అన్నప్రసాద వితరణ నిర్వహించారు.
దైవచింతనతోనే మానసిక ప్రశాంతత
దైవ చింతనతోనే మానసిక ప్రశాంతత లభిస్తుందని ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి అన్నారు. గ్రామాల్లో దేవాలయాలను నిర్మించుకోవడంతోనే గ్రామస్తులు ఆధ్యాత్మికత అలవర్చుకొని సరైన మార్గంలో జీవనం కొనసాగిస్తారన్నారు. అనంతరం ధ్వజస్తంభం, విగ్రహాల వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దేవాలయ కమిటీ చైర్మన్ కొంతం యాదగిరి, సర్పంచ్ బాషిపాక సదయ్య, భక్తులు పాల్గొన్నారు. అలాగే మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డితో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.


