పోలింగ్ ప్రక్రియను జాగ్రత్తగా పర్యవేక్షించాలి
వరంగల్ జిల్లా ఎన్నికల అధికారి,
కలెక్టర్ సత్యశారద
న్యూశాయంపేట: పోలింగ్ కేంద్రాల్లో జరిగే ప్రతీ ప్రక్రియను జాగ్రత్తగా పర్యవేక్షించాలని, ఎన్నికల సంఘం మార్గదర్శకాలను కచ్చితంగా అమలు చేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డాక్టర్ సత్యశారద, అబ్జర్వర్ శివకుమార్‌నాయుడు సూచించారు. మున్సిపల్ ఎన్నికల నిర్వహణలో భాగంగా సోమవారం కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ హాల్‌లో మైక్రో అబ్జర్వర్‌లకు మాస్టర్ ట్రైనర్ ద్వారా శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. నర్సంపేట మున్సిపాలిటీలో 8, వర్ధన్నపేట మున్సిపాలిటీలో 6 క్రిటికల్ పోలింగ్ లోకేషన్స్ గుర్తించారు. ఆయా కేంద్రాల పర్యవేక్షణకు 17 మంది మైక్రో అబ్జర్వర్లను నియమించి శిక్షణ ఇచ్చారు. కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ రాంరెడ్డి, జీఎం ఇండస్ట్రీస్ నరసింహమూర్తి, మాస్టర్ ట్రైనర్స్ పాల్గొన్నారు.
ప్రచార కార్యక్రమాలపై నిషేధం
మున్సిపల్ ఎన్నికలు జరగనున్న నర్సంపేట, వర్ధన్నపేట పట్టణాల్లో సోమవారం సాయంత్రం నుంచి ప్రచార కార్యక్రమాలపై నిషేధం అమల్లోకి వస్తుందని కలెక్టర్ సత్యశారద తెలిపారు. 48 గంటల సైలెన్స్ పీరియడ్ సమయంలో పట్టణాల్లో ఎవరు బహిరంగ ఎన్నికల ప్రచారం చేయరాదన్నారు. పోలింగ్ ముగిసేవరకు మద్యం షాపులు, కల్లు దుకాణాలు మూసివేయించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈనెల 13న కౌంటింగ్ సందర్భంగా మద్యం, కల్లు దుకాణాలు మూసివేయాలన్నారు.
రేపు సెలవు
మున్సిపల్ ఎన్నికల దృష్ట్యా నర్సంపేట, వర్ధన్నపేట మున్సిపల్ ఎన్నికల్లో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుటకు గాను ఈ నెల 11న తేదీన సెలవు ప్రకటిస్తున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగులకు సాధారణ సెలవు, షాపులు, సంస్థలు, ఫ్యాక్టరీల్లో పనిచేస్తున్న ఉద్యోగులు వేతనంతో కూడిన సెలవు కల్పిస్తున్నట్లు తెలిపారు.


