‘ఎకై ్సజ్’ విభజన ఇంకెన్నాళ్లు..?
సాక్షి, వరంగల్: వరంగల్ రూరల్ జిల్లా వరంగల్ జిల్లాగా.. వరంగల్ అర్బన్ జిల్లా హనుమకొండ జిల్లాగా ఏర్పడి నాలుగేళ్లు దాటినా.. ఇంకా ఎకై ్సజ్ (ఆబ్కారీ) శాఖకు మాత్రం ఆ నిబంధన వర్తించడం లేదు. వరంగల్, హనుమకొండ జిల్లాలు ఏర్పడిన క్రమంలో వరంగల్ రూరల్ నుంచి ఐదు మండలాలు హనుమకొండలో, వరంగల్ అర్బన్ నుంచి రెండు మండలాలు వరంగల్ జిల్లాలో కలిసినా ఇంకా పాత పద్ధతిలోనే ఎకై ్సజ్ విభాగం కొనసాగుతోంది. తమ విభాగానికి సంబంధించిన ఏ సమాచారమైనా ఇద్దరు కలెక్టర్ల దృష్టికి తీసుకెళ్లాల్సిన పరిస్థితి ఉందని సంబంధిత అధికారులు అంటున్నారు. తమ ఉన్నతాధికారులకు కూడా మళ్లీ వరంగల్, హనుమకొండ జిల్లాల వారీగా లెక్కలు చెప్పాల్సి ఉండడంతో సమన్వయంతో ముందుకెళ్లాల్సిన పరిస్థితి ఎదురవుతోందని చెబుతున్నారు.
జిల్లాలు ఏర్పడి నాలుగేళ్లు
ప్రభుత్వం అధికారికంగా వరంగల్ రూరల్‌ను వరంగల్ జిల్లాగా, వరంగల్ అర్బన్‌ను హనుమకొండ జిల్లాగా మార్చి నాలుగేళ్లు దాటింది. ఆ సమయంలో వరంగల్ రూరల్ జిల్లాలోని పరకాల, నడికూడ, శాయంపేట, ఆత్మకూరు, దామెర మండలాలు హనుమకొండ జిల్లాలో కలిశాయి. వరంగల్ అర్బన్‌లోని వరంగల్, ఖిలా వరంగల్ మండలాలు వరంగల్ జిల్లాలో కలిపారు. ఆ తర్వాత ఆయా ప్రభుత్వ విభాగాలు కూడా ఆయా హద్దుల మేర తమ సేవలను ప్రజలకు అందిస్తున్నాయి. ఇంతవరకు బాగానే ఉన్నా ఎకై ్సజ్ విభాగానికి మాత్రం ఇప్పటికీ ఈ కొత్త జిల్లాల వర్తింపు కాలేదు. ఫలితంగా ఆయా విభాగాల్లో పనిచేస్తున్న సిబ్బందికి తాము ఏ జిల్లానో పక్కాగా చెప్పుకునే పరిస్థితి లేదు. వరంగల్ రూరల్ 57 వైన్స్‌లు, ఆరు బార్లు ఉండగా, వరంగల్ అర్బన్‌లో 65 వైన్స్‌లు, 108 బార్లు ఉన్నాయి. అధికంగా ఆదాయం సమకూర్చే వరంగల్, ఖిలా వరంగల్ మండలాలను హనుమకొండ (పాత వరంగల్ అర్బన్) విభాగాధికారులు వదులుకునేందుకు ఇష్టపడడం లేదని తెలుస్తోంది.
పట్టించుకోని ఉన్నతాధికారులు
అనుమతి కోసం ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు పంపించినా పరిష్కారం కాలేదని సమాచారం. ఆ దిశగా కృషి చేయాల్సిన ఉమ్మడి వరంగల్ కేంద్రమైన హనుమకొండ విభాగం ఉన్నతాధికారులు పట్టించుకోకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ప్రభుత్వ ఉన్నతాధికారుల వద్దనే ఈ ఫైల్ పెండింగ్‌లో ఉందని చెబుతున్నారు. చీఫ్ సెక్రటరీ స్థాయిలోనే ఈ విభజన ప్రక్రియ ఉందంటూ అధికారులు చేతులు దులుపుకోవడం గమనార్హం. అన్ని ప్రభుత్వ విభాగాలకు వర్తించిన విభజన.. ఇక్కడా ఎందుకు వర్తించదూ అంటే సమాధానం ఇచ్చేవారు కరువయ్యారు. ఇప్పటికై నా ఈ కొత్త సంవత్సరంలోనైనా కొత్త జిల్లా ప్రకారం తమ విభాగ సేవలు అందించేలా ఉన్నతాధికారులు చొరవ చూపాలని ఆబ్కారీ అధికారులు కోరుతున్నారు.
ఇంకా వరంగల్ రూరల్,
అర్బన్ జిల్లాలుగానే ఆబ్కారీ శాఖ
వరంగల్, హనుమకొండ జిల్లాలు
ఏర్పడి నాలుగేళ్లు
గందరగోళం మధ్య విధులు నిర్వర్తిస్తున్న అధికారులు
జిల్లాల సరిహద్దుల మేర
విభజించాలంటున్న ఎక్సైజ్ సిబ్బంది


